Friday, November 22, 2024

Congress: ఇక‌మీద‌ట కాంగ్రెస్‌ ఓపెన్‌ హౌస్‌ సెషన్‌.. కొత్త ఒరవడి శ్రీకారం చుట్టిన మల్లికార్జున ఖర్గే

కాంగ్రెస్‌ పార్టీకి పూర్వవైభవం తీసుకోవడానికి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖ‌ర్గే చర్యలు చేపట్టారు. ముందుగా కాంగ్రెస్‌ అధిష్టానానికి, పార్టీ వర్కర్లకు మధ్య పెరిగిన అగాధాన్ని పూడ్చడానికి ప్రయత్నాలు మొదలెట్టారు. నవంబర్‌ 21వ తేదీ ఉదయం 11గం.ల నుంచి మధ్యాహ్నం 1గం.ల వరకు ఏఐసీసీ కార్యాలయంలో ఈ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ”ఒక కొత్త వ్యవస్థను ప్రారంభించాం. 21న ఏఐసీసీ ఆఫీస్‌లో 11 గం.ల నుంచి 1గం. వరకు పార్టీ వర్కర్లతో ఖర్గే సమావేశం కానున్నారు. ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగించాలని నిర్ణయించాం” అని కాంగ్రెస్‌ అధ్యక్ష కార్యాలయ సమన్వయకర్త, రాజ్యసభ సభ్యుడు సయీద్‌ నజీర్‌ హుసేన్‌ తెలిపారు.

పార్టీ నేతల సమాచారం ప్రకారం… కాంగ్రెస్‌ పార్టీ మాజీ చీఫ్‌ సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ భద్రతా కారణాల రీత్యా ఏఐసీసీ కార్యాలయంలో అందుబాటులో ఉండటం లేదు. పార్టీ ప్రతినిధులు ఎవరైనా సోనియా, రాహుల్‌ నివాసాలకెళ్లి కలుసుకోవాల్సి వస్తోంది. అయితే, అధినాయకత్వంతో పార్టీలో జరిగిన, జరుగుతున్న అన్ని విషయాలపై కూలంకుషంగా చర్చించడానికి అవకాశం లేకుండా పోతోంది…. అంతేగాక అగ్రనాయకత్వం అపాయింట్‌మెంట్‌ లభించడం కూడా కష్టసాధ్యమవుతోంది. ఈ నేపథ్యంలోనే మల్లికార్జున ఖర్గే జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తద్వారా క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితి అత్యున్నత కార్యాలయం దృష్టికి తీసుకురావడానికి అవకాశం ఏర్పడుతుందని అభిప్రాయం పార్టీ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది.

ఎంతో సుదీర్ఘ చరిత్ర కల్గిన కాంగ్రెస్‌ పార్టీ గత కొంతకాలంగా జాతీయ స్ధాయిలో చేపట్టే కార్యక్రమాలు క్షేత్రస్థాయి వరకు పోవడం లేదనే విషయాన్ని అగ్రనాయకత్వం గుర్తించింది. ఇందుకు పార్టీ వర్కర్లకు, అధిష్టానానికి మధ్య అగాధం ఏర్పడటమేనని తేల్చింది. గత ఎనిమిదేళ్లుగా దేశవ్యాప్తంగా జరిగిన పలు ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఓటమి పాలవుతూ వస్తోంది. ఇంతటి గడ్డు పరిస్థితిని గతంలో ఎన్నడూ చూడలేదు. దాదాపు 50ఏళ్లపాటు కాంగ్రెస్‌ పార్టీలో క్రియాశీల కార్యకర్తగా పనిచేసిన మల్లికార్జున ఖర్గే ఏఐసీసీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు.

- Advertisement -

పార్టీకి పూర్వవైభవం తేవడమే లక్ష్యంగా తన కార్యాచరణ మొదలెట్టేశారు. అందులో భాగంగానే పార్టీ శ్రేణులకు, అధిష్టానానికి మధ్య నెలకొన్న అగాధాన్ని పూడ్చడమే తన ముందున్న తక్షణ కర్తవ్యమని గుర్తించి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ ”ఓపెన్‌ హౌస్‌ సెషన్‌” కార్యక్రమం ద్వారా పార్టీ వర్కర్లు ఏఐసీసీ కార్యాలయానికి వచ్చి, అధ్యక్షుడితో తమ సాధక బాధలు చెప్పుకోవచ్చు… పార్టీ పటిష్టత కోసం తగిన సలహాలు, సూచనలు ఇవ్వడానికి ఆస్కారం ఏర్పడిందని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మెహ్‌సినా కిద్వాయ్‌ అభిప్రాయం వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement