Friday, November 22, 2024

Dharani Portal: ధరణి హెల్ప్‌ డెస్క్‌.. పోర్టల్‌పై అవగాహన..

భూ సమస్యల పరిష్కారానికి తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్ పై ప్రజలకు అవగాహన కల్పించనున్నారు. ధరణి పోర్టల్‌కు అనుబంధంగా జిల్లా కలెక్టరేట్లలో హెల్ప్‌ డెస్క్‌ లను ఏర్పాటు చేయనున్నారు. పోర్టల్‌లోని మాడ్యూల్స్‌, భూ సమస్యల పరిష్కారంపై ప్రజలకు అవగాహన కల్పించడంతోపాటు మీసేవ కేంద్రంలో మాదిరిగా దరఖాస్తులను అప్‌లోడ్‌ చేయనున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని అధికారులకు క్యాబినెట్‌ సబ్‌ కమిటీ సూచించింది. ధరణిపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం మంత్రి హరీశ్‌రావు అధ్యక్షత బీఆర్కే భవన్‌లో రెండోసారి బుధవారం సమావేశమైంది. ధరణి పోర్టల్‌లో సమస్యల పరిష్కారానికి చేయాల్సిన మార్పులపై చర్చించారు. నిషేధిత జాబితాలో ఉంచిన భూములపై ఇప్పటివరకు 98,049 దరఖాస్తులు రాగా, వాటిలో 82,472 దరఖాస్తులను డిస్పోజ్‌ చేసినట్టు అధికారులు వివరించారు.

ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. పలు భూ సమస్యల పరిష్కారానికి పోర్టల్‌లో ఇప్పటికే అనువైన మాడ్యూల్స్‌ను, ఆప్షన్స్‌ను పొందుపరిచామని చెప్పారు. వీటిపై సరైన అవగాహన లేక సమస్యలు పరిషారం కావడంలేదని అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో ధరణి పోర్టల్‌, మాడ్యూల్స్‌, ఆప్షన్లపై అధికారులు, మీసేవ కేంద్రాల నిర్వాహకులకు జిల్లాస్థాయిలో ఒకరోజు శిక్షణ నిర్వహించాలని ఉన్నతాధికారులకు సూచించారు. జడ్పీ, మున్సిపల్‌ సమావేశాలకు కలెక్టర్లు హాజరై ధరణిపై పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇవ్వాలని తెలిపారు. ధరణిపై అవగాహన కల్పించి, అక్కడే దరఖాస్తు చేసేలా కలెక్టరేట్లలో ‘ధరణి హెల్ప్‌డెస్‌’లను ఏర్పాటుచేయాలని సూచించారు. భూరికార్డుల నమోదులో జరిగిన పొరనాట్లను సవరించేందుకు మరిన్ని మాడ్యూల్స్‌ను త్వరగా అందుబాటులోకి తేవాలని అధికారులను కోరారు. వచ్చే వారం మరోసారి సమావేశం కావాలని ఉపసంఘం నిర్ణయించింది.

రాష్ట్రంలోని భూ సమస్యలకు శాశ్వత పరిష్కారమే లక్ష్యంగా గతేడాది అక్టోబర్ 29న తెలంగాణ ప్రభుత్వం ‘ధరణి’ పోర్టల్‌ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఏడాది కాలంలో పారదర్శకంగా సేవలు అందించింది. సంవత్సర కాలంలో 10 లక్షలకుపైగా లావాదేవీలు నిర్వహించింది. భూ సంస్కరణలో భాగంగా దేశంలోనే మొదటి సారిగిగా ధరణి పోర్టల్‌ను తీసువుకొచ్చారు సీఎం కేసీఆర్. మధ్యవర్తుల అవసరం లేకుండా.. లంచాలు ఇచ్చుకునే పరిస్థితి లేకుండా ఈ వ్యవస్థను తీసుకొచ్చారు. అత్యాధునిక సాంకేతికతతో అభివృద్ధి చేసిన ధరణి పోర్టల్‌ను 2020 అక్టోబర్‌ 29న మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా మూడుచింతలపల్లిలో సీఎం కేసీఆర్ ప్రారంభించారు. ఈ పోర్టల్‌ అందుబాటులోకి వచ్చిన తర్వాత గతంలో ఎప్పుడూ లేని విధంగా.. దేశంలో మరెక్కడా కూడా లేనంతగా పారదర్శకంగా ఒకేసారి రిజిస్ట్రేషన్‌, మ్యుటేషన్‌ జరిగే విధానం అమలవుతోంది. గతంలో రిజిస్ట్రేషన్‌ అయిన తర్వాత మ్యుటేషన్‌కు దరఖాస్తు చేసుకోవడం.. మండల రెవెన్యూ కార్యాలయం చుట్టూ, వీఆర్వో చుట్టూ తిరగాల్సిన పరిస్థితికి ధరణి పోర్టల్‌కు చెక్‌ పెట్టేసింది. రిజిస్ట్రేషన్‌, మ్యుటేషన్‌ అక్కడి జరిగిపోగా.. వారం పది రోజుల్లో నేరుగా ఇంటికే పాస్‌ పుస్తకాలు పంపిణీ చేస్తోంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily

Advertisement

తాజా వార్తలు

Advertisement