ప్రభ న్యూస్ బ్యూరో, ఉమ్మడి మెదక్ : హాలో డీపీవో గారు నేను ఎమ్మెల్యే గారి పీఏను.. ఎంఎన్‌ఆర్ పై ఆంధ్రప్రభలో వచ్చిన కథనాలపై చూసిచూడనట్లు ఉండండి అంటూ జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే పీఏ డీపీవోకు ఫోన్ చేసి సూచించినట్లు విశ్వసనీయ సమాచారం. ఎమ్మెల్యే పీఏ ఫోన్ చేసి చెప్పడం, ఎంఎన్‌ఆర్ విద్యా సంస్థల నుండి ఓ మనిషి స్వయంగా డీపీవోను కలిసి వేడుకోవడం జరిగిందని ఫలితంగానే ఎంఎన్‌ఆర్ విషయంలో డీపీవో ఎలాంటి చర్యలు తీసుకోకుండా కాలయాపన చేస్తున్నట్లు స్పష్టమవుతుంది. జిల్లా పంచాయతీ అధికారిగా సురేష్ మోహన్ బాధ్యతలు తీసుకున్న దగ్గరి నుండి అక్రమ నిర్మాణాల విషయంలో ఉక్కుపాదం మోపే తత్వాన్ని పక్కకు పెట్టి ఎంఎన్‌ఆర్ విషయంలో దానికి విరుద్ధంగా ప్రవర్తించడం చూస్తుంటే డీపీవో పై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా ఆయా అనుమానాలకు తెరదించి తన నిబద్ధతను చాటుకోవాలని ఎంఎన్‌ఆర్ విషయంలో కఠినంగా వ్యవహరించి అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేయాలని సర్వత్రా డిమాండ్ చేస్తున్నారు.
ఎంఎన్‌ఆర్ అక్రమాలకు అడ్డుకట్టవేయలేరా..?
ఫసల్‌వాదీ గ్రామంలోని ఎంఎన్‌ఆర్ విద్యాసంస్థలు సాగిస్తున్న అక్రమాలపై ఆంధ్రప్రభ ఎప్పటికప్పుడు ఎండగడుతోంది. ఏప్రిల్‌లో ఎంఎన్‌ఆర్ విద్యాసంస్థల అక్రమాలపై వరుస కథనాలు ప్రచురించింది. ముఖ్యంగా ఎఫ్‌టీఎల్, శిఖం భూముల్లో ఎంఎన్‌ఆర్ తన వ్యాపారాన్ని విస్తరించి అక్రమంగా పక్కా నిర్మాణాలు నిర్మించినా జిల్లా యంత్రాంగం, హెచ్‌ఎండీఏగాని ఇప్పటివరకు చర్యలు తీసుకున్న పాపానపోలేదు. తాజాగా ఎంఎన్‌ఆర్ విద్యాసంస్థలు దాదాపు 30 వేల ఎస్‌ఎఫ్‌టీతో మరో భారీ అక్రమ నిర్మాణాన్ని నిర్మిస్తోంది. దీని విషయంలో కూడా మరోమారు కథనం రాసింది.
పత్రికల్లో వార్తలు వస్తే వెంటనే చర్యలు తీసుకునే డీపీవో ఎంఎన్‌ఆర్ విషయంలో మాత్రం ఆదినుండి వెనకడుగు వేస్తూనే ఉన్నారు. తాజాగా నిర్మిస్తున్న అక్రమ నిర్మాణం విషయంలో ఆంధ్రప్రభలో కథనాలు వెలువడితే కేవలం నోటీసులు జారీ చేసి కాలయాపన చేస్తున్నారు. 3వ నోటీసు జారీ చేసిన అనంతరం మూడు రోజుల్లో సమాధానం ఇవ్వలేకపోతే కూల్చుతామని హెచ్చరించినప్పటికీ ఆ దిశగా చర్యలు తీసుకోలేదు. డిమోలేషన్ నోటీసు జారీ చేసి పక్షం రోజులు గడుస్తున్నా ఎంఎన్‌ఆర్‌పై డీపీవో ప్రేమకురిపిస్తుండటం దేనికి సంకేతమో వారికే తెలియాలి. అపార్టుమెంట్లు, ఇండిపెండెంట్ గృహాల విషయంలో అక్రమాలని తెలిస్తే బుల్డోజర్లతో నేలమట్టం చేసి ప్రతాపం చూపుతున్న పంచాయతీ అధికారులు ఫసల్‌వాదీ ఎంఎన్‌ఆర్ విషయంలో ఆ విధంగా చర్యలెందుకు తీసుకోవడం లేదని సర్వత్రా ప్రశ్నిస్తున్నారు.
నోటీసు జారీచేసి నెలరోజులు దాటుతున్నా..
ఎంఎన్‌ఆర్ అక్రమ నిర్మాణ విషయంలో ఫసల్‌వాదీ గ్రామ కార్యదర్శి గ ణష్ గత నెల 10న డిమోలేషన్ నోటీసు జారీ చేశాడు. డిమోలేషన్ నోటీసు జారీచేసే సమయంలో 3 రోజుల్లో సమాధానం ఇవ్వాలని లేని పక్షంలో అక్రమ నిర్మాణాల పై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. 3 రోజుల్లో చర్యలు తీసుకుంటామని పక్షం రోజులు దాటుతున్నా ఇంకా ఎంఎన్‌ఆర్ పై చర్యలు తీసుకోకపోవడంలో ఆంతర్యమేమిటో పంచాయతీ అధికారులే తెలపాలి. సామాన్యుల విషయంలో తమ పరిధి దాటి వ్యవహరించే పంచాయతీ అధికారులు అదే పలుకుబడి ఉన్నోడి విషయంలో మెతకవైఖరి, చర్యలు తీసుకోవడంలో వెనకడుగు వేయడం దేనికి సంకేతమని సర్వత్రా ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైన తమపై వస్తున్న ఆరోపణలకు చెక్ పెట్టి ఎంఎన్‌ఆర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని సర్వత్రా డిమాండ్ చేస్తున్నారు.