ఈ నెల 17నుంచి మొదలు కానుంది శబరిమల యాత్ర. దాంతో ఈ యాత్రకి భారీ భద్రతా ఏర్పాట్లు చేసినట్లు కేరళ పోలీసులు తెలిపారు. ఈ యాత్రకు దేశం నలుమూలల నుంచి భక్తులు వస్తారని వివరించారు. యాత్రకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆలయ అధికారులతో కలిసి భద్రతను ఏర్పాటు చేశామని చెప్పారు. దారిపొడవునా పోలీస్ చెక్ పోస్టులను ఏర్పాటు చేయడంతో పాటు సీసీటీవీ కెమెరాలను అమర్చినట్లు పేర్కొన్నారు. ఈమేరకు కేరళ పోలీస్ బాస్ అనిల్ కాంత్ భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. కరోనా ఆంక్షల తొలగింపు నేపథ్యంలో ఈ ఏడాది భారీ సంఖ్యలో భక్తులు యాత్రకు వచ్చే అవకాశం ఉందని అనిల్ కాంత్ చెప్పారు. ఈ క్రమంలో భక్తుల రద్దీని తట్టుకునేలా సెక్యూరిటీ ఏర్పాట్లు చేశామని విలేకరులకు తెలిపారు. సుమారు 14 వేల మంది పోలీసులు ఈ యాత్రలో భక్తులకు భద్రత కల్పిస్తారని చెప్పారు. మొత్తం 134 సీసీటీవీ కెమెరాలతో భక్తులను నిరంతరం గమనిస్తుంటామని పేర్కొన్నారు. ఏరియల్ సర్వే కోసం ఎన్డీఆర్ఎఫ్, ఆర్పీఎఫ్, ఆర్ఏఎఫ్ బలగాల సాయం తీసుకుంటున్నట్లు చెప్పారు. సంఘ విద్రోహశక్తులను గుర్తించేందుకు పక్క రాష్ట్రాలకు చెందిన పోలీసు బలగాలను కూడా శబరిమల యాత్రకు సంబంధించిన భద్రతా ఏర్పాట్లలో భాగం చేసినట్లు అనిల్ కాంత్ వివరించారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement