హైదరాబాద్ నగరాన్ని వరుణుడు మరోసారి వణికించాడు. శుక్రవారం రాత్రి కురిసిన కుండపోత వర్షాలు పలు కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. రోడ్లు జలాశయాలను తలపించాయి. దాదాపు రెండు గంటల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన కుండపోత వర్షానికి భాగ్యనగరం చిగురుటాకులా వణికిపోయింది. వరద నీటిలో చిక్కుకుని పలువురు ప్రమాదానికి గురయ్యారు. ఎల్బీనగర్ సమీపంలోని చింత కుంటలో డ్రైనేజీలో పడి గల్లంతైన వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడు. బైక్ ప్రయాణిస్తున్న జగదీశ్ అనే వ్యక్తి బైక్ తోపాటు డ్రైనేజిలో పడిపోయాడు. అయితే, వెంటనే స్పందించిన రెస్క్యూ టీం.. రంగంలోకి బాధితుడిని ప్రాణాలతో రక్షించారు. నగరంలోని పలు కాలనీ రోడ్లపై వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
చాంద్రాయనగుట్ట పరిధిలోని పలు బస్తీల్లో ఇళ్లలోకి నీరు చేరింది. జిల్లెలగూడలోని బాలాజీ కాలనీ జలదిగ్భంధమయింది. బాలజీ కాలనీలో నడుములోతులో నీరు నిలిచిపోయింది. దీంతో ప్రజలు ఇండ్ల నుంచి బయటకు రాలేని పరిస్థితి ఏర్పడింది. దిల్‌సుఖ్‌నగర్, చైతన్యపురిలో భారీగా వరద ప్రవహిస్తున్నది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. భారీ వర్షాల నేపథ్యంలో జీహెచ్ఎంసీ అప్రమత్తమయింది. జీహెచ్‌ఎంసీ, డీఆర్‌ఎఫ్ బృందాలతో సహాయక చర్యలు చేపట్టింది. సహాయం కోసం కంట్రోల్ రూం ఏర్పాటు చేసింది.
ఇది కూడా చదవండి: టాటా చేతికి ఎయిరిండియా: కేంద్రం కీలక ప్రటకన