బంగాళాఖాతంలో ఏర్పడిన ‘గులాబ్’ తుఫాన్ ప్రభావంతో తెలంగాణలోని భారీ వర్షాలు కురుస్తున్నాయి. తుఫాను ప్రభావంతో సోమవారం తెల్లవారుజాము నుంచి హైదరాబాద్ వ్యాప్తంగా వర్షం కురుస్తున్నది. నగరంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వాన పడుతున్నది. జీడిమెట్ల, కొంపల్లి, కుత్బుల్లాపూర్, అంబర్‌పేట, కాచిగూడ, గోల్నాక, నల్లకుంటలో ఉరుములతో కూడిన వర్షం కురుస్తున్నది. దీంతో రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. నేడు, రేపు జీహెచ్ఎంసీ హైఅలర్ట్ ప్రకటించింది. గులాబ్ తుఫాను ప్రభావంతో రాష్ట్రంలో సోమవారం, మంగళవారం భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో లోతట్టు ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండేలా అధికారుల చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. తుఫాన్ నేపథ్యంలో హైదరాబాద్‌లో కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేసింది.
రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఏకధాటిగా కురుస్తున్న వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. తుపాను నేపథ్యంలో రైల్వేశాఖ పలు రైళ్లను రద్దు చేసింది. మరికొన్నింటిని దారిమళ్లించింది.