తెలంగాణలో రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో నిర్మల్ జిల్లాలో వానలు విపరీతంగా పడుతున్నాయి. దీంతో జిల్లాలో వాగులు కూడా ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. కడెం మండలం దత్తోజీపేట సమీపంలోని వాగు పొంగి ప్రవహిస్తోంది. ఈ క్రమంలో నిర్మల్‌లో ఇళ్లు నీటమునిగాయి. కొన్ని గ్రామాల వారు పట్టణాలకు వెళ్లేందుకు నానా యాతనా పడాల్సి వస్తోంది. ఇప్పటికే కొన్ని గ్రామాలకు రాకపోకలు కూడా నిలిచిపోయాయి.
ఇదే సమయంలో దత్తోజీపేటకు చెందిన ఎల్లవ్వ అనే మహిళకు పురిటినొప్పులు వచ్చాయి. కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకువెళుతుండగా వాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది. ముందుకు వెళ్లే దారి లేక వాగు ఒడ్డునే వారు ఉండిపోయారు. నాలుగైదు గంటలు వారు అక్కడే ఆందోళనతో గడిపారు. దీంతో నొప్పులు ఎక్కువైన ఎల్లవ్వ వాగు ఒడ్డునే ప్రసవించింది. ఆ తర్వాత వాగు ప్రవాహం తగ్గడంతో గ్రామస్తులు జేసీబీ సాయంతో బాలింతను వాగు దాటించి ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో తల్లీ బిడ్డ క్షేమంగా ఉన్నారు.
ఈ వార్త కూడా చదవండి: రోజంతా బ్రిడ్జికి వేలాడిన బాలిక మృతదేహం