Friday, November 22, 2024

వెన్ను విరిగింది – ఆశ రాలింది..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: అకాల వర్షాలు అన్నదాతల వెన్నువిరుస్తున్నాయి. గతంలో ఎన్నడూలేని విధంగా మార్చి, ఏప్రిల్‌ మండువేసవిలో అకాల వర్షాలు రైతులను వెంటాడుతున్నాయి. తాజాగా శని, ఆదివారాల్లో ఉమ్మడి కరీంనగర్‌, వరంగల్‌, ఆదిలాబాద్‌, నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో వడగండ్ల వర్షం కురిసింది. వడగళ్ల వానతో వరి, మామిడి, మిరప, మొక్కజొన్న రైతులు తీవ్రంగా నష్టపోయారు. కోత దశకు చేరుకున్న వరిపంట వడగళ్ల ధాటికి పొలాల్లోనే రాలిపోయింది. మామిడికాయలు రాలిపోయి చెట్లు ఖాళీ అయ్యాయి. మిరప పంట చేతికందకుండా నీట మునగడంతో లక్షల రూపాయల నష్టం వాటిల్లింది. మరికొన్ని ప్రాంతాల్లో కొనుగోలు కేంద్రాల్లో కుప్పులు ధాన్యం తడిసి ముద్దయ్యింది. ఒకటి రెండు రోజుల్లో ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తరలించి విక్రయించాలని చూస్తున్న రైతులకు అకాల వర్షం కోలుకోలేని దెబ్బతీసింది. ప్రకృతిని నమ్ముకుని పంట సాగుచేస్తున్న అన్నదాతలకు అనేక సందర్భాల్లో వాతావరణం కలిసివస్తున్నప్పటికీ ప్రస్తుత సీజన్‌లో మాత్రం పంటను తడపాల్సిన చినుకే అకాల వర్ష రూపంలో అన్నదాతను చిదిమేస్తోంది. దీంతో రైతులు కంటతడి పెడుతున్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం విక్రయించేందుకు జరుగుతున్న పలు లోపాల వల్లే రైతులు ఎక్కువ ధాన్యాన్ని నష్టపోవాల్సి వచ్చిందంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో కయ్యల్లోనే ధాన్యం ఉంది. మరో రోజు వర్షం కురిస్తే మాత్రం రైతులు పూర్తిగా పంటలపై ఆశలు వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

కరీంనగర్‌ జిల్లాలోని చొప్పదండి, రామడుగు, గంగాధర, కొలిమేల మండలాల్లో ఈదురుగాలులు, వడగళ్లదాటికి వందల ఎకరాల్లో వరి పంట తుడిచిపెట్టుకుపోయింది. కోత దశకు చేరుకున్న వరి ధాన్యం పొలాల్లోనే రాలిపోయింది. యాసంగి పంట కాలంలో ఆలస్యంగా వరి నాట్లు వేసుకున్న రైతులకు అకాల వర్షాలు శాపంగా మారాయి. మామిడి కాయలకు మార్కెట్‌లో ధర లేదని వేచి చూస్తున్న తరుణంలో ఈదురుగాలుల రూపంలో భారీ వర్షం కురవడంతో తీవ్ర నష్టం వాటిల్లింది. మామిడికాయలతోపాటు చెట్లు కూడా పడిపోయాయి. చొప్పదండి మండలం చాకుంట గ్రామంలో మిరపతోటలు వడగళ్ల వర్షానికి పూర్తిగా ధ్వంసమయ్యాయి. కొనుగోలు కేంద్రాల వద్ద తూకం కోసం నిల్వ చేసిన ధాన్యం కూడా అకాల వర్షం పాలైంది. దీంతో ధాన్యం పూర్తిగా తడిసిపోయింది. రామడుగు మండలం లక్ష్మీపూర్‌ రైతుల ధాన్యం కాళేశ్వరం ఎత్తిపోతల కాల్వలోకి కొట్టుకుపోయింది. యాసంగి పంట కాలంలో మూడో సారి కురిసిన అకాల వర్షాలు, వడగళ్లు రైతులకు పెనుశాపంగా మారాయి. దత్తోజిపల్లి గ్రామంలో 20 ఎకరాల భూమిని కౌలుకు తీసుకుని మామిడి అంజయ్య అనే రైతు సాగు చేశాడు. శనివారం రాత్రి కురిసిన వర్షంతో పంట మొత్తం నేలపాలైంది. గత నెలలో కురిసిన వర్షానికి సగం పంట నష్టపోగా శనివారం కురిసిన వడగళ్ల వానకు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అకాల వర్షానికి 20లక్షల రూపాయల వరకు పంట నష్టం జరిగిందని చెప్పారు.

- Advertisement -

మరో రైతుల రాములు మాట్లాడుతూ తాము ఎనిమిది ఎకరాల్లో వరి పంట సాగు చేశానని, శనివారం నాటి వర్షానికి పంట మొత్తం నష్టపోయిందని వరి గెలలకు వడ్లన్నీ రాలిపోయాయని, మొత్తంగా తాలుమాత్రమే మిగిలిందని ఎకరాకు వరిసాగు చేయడానికి రూ.30 వేలకు ఖర్చు అయిందని, పెట్టుబడులన్నీ మీద పడ్డాయని కన్నీటి పర్యంతమయ్యారు. హన్మకొండ జిల్లా పరకాల డివిజన్‌ వ్యాప్తంగా వేల ఎకరాల్లో వరి, మిర్చి, మొక్కజొన్న పంటలు నేలవాలాయి. భీమదేవరపల్లి మండలంలో మామిడి రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఉమ్మడి నల్గొండ జిల్లా, ఇప్పటి సూర్యాపేట జిల్లా జాజిరెడ్డి గూడెం మండలంలో వరి ధాన్యం నేలరాలడంతోపాటు కల్లాల్లో ఆరబోసిన ధాన్యం ఈదురుగాలులకు కొట్టుకుపోయింది. జనగామ, బచ్చన్నపేట మండలాల్లో నష్టపోయిన రైతులను ఆదుకోవాలని కోరుతూ కర్షకులు రోడ్డెక్కారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా కురిసిన వర్షానికి మిర్చి, వరి పంటలకు అపారనష్టం వాటిల్లింది. ఎండకు ఆరబెట్టిన మిర్చి తడిసి ముద్దయింది. సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్‌ మార్కెట్‌ యార్డులో ధాన్యం తడిసింది. జనగామ జిల్లా స్టేషన్‌ ఘన్‌పూర్‌ నియోజకవర్గం నమిలికొండలో ఐకేపీ కేంద్రం ప్రారంభించినా ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో ఎండిన ధాన్యం తడిసిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్‌ మార్కెట్‌ యార్డులో తడిసిన ధాన్యాన్ని ఎమ్మెల్యే సతీష్‌ కుమార్‌ సందర్శించారు. తడిసిన ధాన్యం రంగుమారటమే కాకుండా ఆరబెట్టేందుకు వాతావరణం అనుకూలించడం లేదని, ప్రభుత్వం తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేసి ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement