Saturday, November 23, 2024

వెదర్ అలర్ట్: మరో మూడు రోజులు వానలే వానలు

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. ఏపీ, తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. సోమ, మంగళవారాల్లోనూ అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణశాఖ తెలిపింది. గత మూడ్రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో రాష్ట్రంలో పలుచోట్ల జనజీవనం అతలాకుతలమైంది. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆదివారం వరదల్లో కొట్టుకుపోయి ఇద్దరు మరణించగా… మరో నలుగురు గల్లంతయ్యారు. పలు చోట్ల వాగులు, వంకలు పొంగి రోడ్లపై ప్రవహిస్తున్నాయి. నిజామాబాద్, కామారెడ్డి, యాదాద్రి, కరీంనగర్, సిద్దిపేట, వికారాబాద్, వరంగల్, ఆదిలాబాద్ తదితర జిల్లాలో అతి భారీ వర్షాలు పడ్డాయి.

ఏపీలోని ఉత్తరాంధ్రను కుండపోత వానలు ముంచెత్తాయి. ఉపరితల ఆవర్తన ప్రభావం శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలపై ఎక్కువగా ఉండటంతో.. ఈ ప్రాంతంలో ఆదివారం సాయంత్రం మొదలై రాత్రి 7 గంటల దాకా ఏకధాటిగా వర్షం కురుస్తూనే ఉంది. శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం పైడి భీమవరం, విశాఖపట్నం జిల్లా రాంబిల్లి, కె.కోటపాడు ప్రాంతాల్లో 10 సెం.మీ. పైగా వర్షపాతం నమోదైంది. విజయనగరంలో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. కర్నూలు జిల్లాలో పలు చోట్ల భారీవర్షాలు కురిశాయి. అత్యధికంగా కొత్తపల్లిలో 11.5, ఆత్మకూరులో 11.1 సెం.మీ. వర్షపాతం నమోదైంది.రాజమహేంద్రవరంలో సుమారు గంటన్నరపాటు కురిసిన వర్షానికి పలు ప్రాంతాలు జలమయంగా మారాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement