తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. వడగాలులకు ప్రజలు అల్లాడుతున్నారు. ఉదయం 9 దాటితే చాలు ప్రజలు బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. మధ్యాహ్నం సమయంలో ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరుగుతున్నాయి. రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో 40 డిగ్రీల పైనే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నిజామాబాద్, కామారెడ్డి, ఆదిలాబాద్, ఖమ్మం, నల్లగొండ, పెద్దపల్లి జిల్లాల్లో ఉష్ణోగ్రతలు భారీగా నమోదవుతున్నాయి. మే నెలలో ఎండలు విపరీతంగా ఉంటాయని వాతావరణశాఖ హెచ్చరించింది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది.
కాగా, ప్రతి ఏటా సాధారణంగా ఏప్రిల్ మొదటివారం నుంచి ఎండలు తీవ్రమవుతాయి. మే నెలలో వడగాడ్పులు వీస్తాయి. ఈ నేపథ్యంలో చిన్న పిల్లలు, వృద్ధులు ఎండలకు బయటకు వెళ్లకుండా ఉండాలని వైద్యులు చెబుతున్నారు. వడదెబ్బతో పాటు డీహైడ్రేషన్ సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు. దీంతో చాలామంది మధ్యాహ్నం టైమ్ లో ఇంటిపట్టునే ఉంటున్నారు.