Friday, November 22, 2024

చ‌రిత్ర‌లో భారీ భూకంపాలు..

గత శతాబ్దాల్లో ప్రపపంచంలో అనేక సార్లు భూకంపాలు సంభవించాయి. వీటిలో కొన్ని సాధారణమైనవి కాగా, మరికొన్ని తీవ్ర, అతితీవ్ర నష్టాల్ని కలిగించాయి. మానవ చరిత్రలో మరపురాని విషాదాల్ని మిగిల్చాయి. సిస్మోగ్రాఫిక్‌ పరికరాలు కనిపెట్టిన తర్వాత, అమెరికా జియోలాజికల్‌ సర్వే ప్రకారం ప్రపంచంలో చిలీ, అలస్కా, సుమత్ర దీవులు, జపాన్‌ దీవులు, రష్యాలో వచ్చిన కొన్ని భూకంపాలు తొమ్మిదికిపైగా తీవ్రతను కలిగివున్నాయి. అతిపెద్ద భూకంపం 1950లో అస్సాం, టిబెట్‌ సరిహద్దుల్లో సంభవించింది.

చరిత్రలో అతిపెద్ద భూకంపం..
1960 మే 22న చిలీలోని బయో-బయో ప్రాంతంలో 9.5 తీవ్రత తో సంభవించింది. దాదాపు 10 నిముషాలు భూమి కంపించింది. రికార్డుల్లో నమోదైన అతిపెద్ద భూ ప్రళయం ఇదే. సముద్రంలో 25 మీటర్ల ఎత్తున ఏర్పడ్డ రాకాసి అలలు దక్షిణ చిలీ, హవాయి, జపాన్‌, ఫిలిప్పీన్స్‌, తూర్పు న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియా తీరాలను తాకాయి. ఈ భూకంపం, సునామీలో మరణించిన వారి సంఖ్య 1000-6000 మధ్య ఉంది. దాదాపు 400 కోట్ల డాలర్ల ఆస్తినష్టం వాటిల్లింది.

అనగనగా బ్యాడ్‌ ఫ్రైడే…
1964లో అలస్కాను భారీ భూకంపం వణికించింది. ఆ రోజు గుడ్‌ఫ్రైడే కాస్తా బ్యాడ్‌ ఫ్రైడేగా మారింది. భూకంప లేఖనిపై దీని తీవ్రత 9.2గా నమోదైంది. 4.38 నిముషాలు భూమి కంపించింది. చాలా చోట్ల భూమి బీటలు వారింది. ఇళ్లు, ఇతర నిర్మాణాలు నేలమట్టం అయ్యాయి. 9 మంది మరణించారు. సునామీ అలల కారణంగా 131 మంది మృతిచెందారు.

సుమత్రకు ఓ పీడకల..
2004 డిసెంబర్‌ 26వ తేదీన సుమత్రా తీరంలోని సముద్ర ప్రాంతంలో 9.1 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. భూకంపం కారణంగా ఎగసిపడిన అలలు 14 దేశాల తీరాలను అతలాకుతలం చేశాయి. 2,27,898 మందిని బలిగొంది. భూకంపం వచ్చిన రెండు గంటల తర్వాత రాకాసి అల ఒకటి భారత్‌లో అండమాన్‌-నికోబార్‌ దీవులు, ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు తీరాలను తాకింది. కేరళలోనూ దీని ప్రభావం కనిపించింది. రెండు నుంచి ఐదు సునామీ అలలు తీరాలను తాకినట్లు రికార్డులు వెల్లడిస్తున్నాయి.

- Advertisement -

జపాన్‌లో అతిపెద్ద విపత్తు..
2011లో జపాన్‌ను తాకిన భూకంపం ఆదేశ చరిత్రలోనే అతిపెద్దది. టొహోకు వద్ద 9.1 తీవ్రతతో భూకంపం వచ్చింది. దీంతో దాదాపు 40 మీటర్ల ఎత్తులో భయానక సునామీ అలలు ఎగసిపడ్డాయి. దాదాపు 15,500 మంది మృత్యువాత పడ్డారు. 4.5 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. ఇక ఫుకుషిమా అణురియాక్టర్‌ ధ్వంసమైంది. 1986 నాటి చెర్నోబిల్‌ అణు విద్యుత్‌ ప్లాంట్‌ దుర్ఘటన తర్వాత ఇది రెండవ అతిపెద్ద విషాదం. ఈ ఘటన తర్వాత 12 లక్షల టన్నుల రేడియో ధార్మిక జలాలను వెయ్యి ట్యాంకుల్లో సుదూర ప్రాంతాలకు తరలించారు.

రష్యాలో రాకాసి అలలు
రష్యాకు చెందిన కమ్చట్కా ద్వీపకల్పంలో 1952లో భారీ భూకంపం వచ్చింది. దీని తీవ్రత 9.2గా నమోదైంది. ఇది దాదాపు 18 మీటర్లున్న మూడు భారీ సునామీ అలలను పుట్టించింది. సెవెరే-కురిల్స్క్‌ ప్రాంతంపై ఇవి తీవ్ర ప్రభావం చూపాయి. భూకంపం వచ్చిన వెంటనే ఇక్కడి ప్రజలు ప్రాణభయంతో కొండలపైకి చేరుకున్నారు. దీంతో తొలి సునామీ అల నుంచి బయటపడ్డారు. కానీ ఇళ్లకు తిరిగి వచ్చాక రెండో సునామీ అల విరుచుకుపడింది. 6000 మంది నివాసితుల్లో 2336 మంది ప్రాణాలు తీసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement