Tuesday, November 12, 2024

అకాల వ‌ర్షాలు – ఆరు ల‌క్ష‌ల ఎకరాల‌లో పంట న‌ష్టం..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: ఈ ఏడాది యాసంగి సేద్యం రైతులను నట్టేట ముంచింది. పెరిగిన సాగు వ్యయాన్ని భరించి అప్పులు తెచ్చి మరీ ఎలాగోలాగా పంటలను సాగు చేసిన రైతులు ప్రకృతి ప్రకోపంతో కుదేలైపోతున్నారు. ఈ సీజన్‌లో వరుసగా మూడోసారి వడగళ్లు కురవడంతో రైతులు కోలుకోలేని ఆర్థిక అప్పుల ఊబిలో కూరుకుపోయారు. మూడుసార్లు కురిసిన అకాల వర్షాలు, వడగళ్ల వానలు కురవడంతో రైతుల పంటలన్నీ నాశనమయ్యాయి. ఉమ్మడి ఖమ్మం, వరంగల్‌, కరీంనగర్‌, ఆదిలాబాద్‌, నిజామాబాద్‌ , మెదక్‌ జిల్లాల్లో వడగళ్ల వానలు ఊహకందని నష్టాన్ని మిగిల్చాయి. మూడు రోజులుగా కురిసిన వడగళ్ల వానకు ఒక్క కరీంనగర్‌ జిల్లాలో 27వేల ఎకరాల్లో పంట నష్టం జరిగిందంటే అకాల వర్షాల బీభత్సం ఏ స్థాయిలో
ఉందో అర్థం చేసుకోవచ్చు.

ఇక ఖమ్మం జిల్లాలో 20వేల ఎకరాలకు పైగా, జనగామ జిల్లాలో 21వేల ఎకరాల్లో, మెదక్‌ జిల్లాలో 15వేల ఎకరాల్లో ఇలా మొత్తంగా ఈ మూడు రోజుల్లో కురిసిన అకాల వర్షాలకు దాదాపు 6 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు అంచనా. గత నెల 18, 19 తేదీల్లో కురిసిన వర్షాల ధాటికి రాష్ట్ర వ్యాప్తంగా 72వేల ఎకరాల్లో వరిపంటకు నష్టం జరగ్గా, ఆ తర్వాత పదిహేను రోజుల వ్యవథిలోనే మరోసారి కురిసిన వడగళ్ల వానకు 1లక్షా 50వేల ఎకరారల్లో వివిధ పంటలు ధ్వంసమయ్యాయి. తాజాగా మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు దాదాపు 5లక్షలా 50వేల ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు వ్యవసాయశాఖ అంచనా వేస్తోంది.

కన్నీరు మిగిల్చిన వరి సాగు
ముఖ్యంగా వరి సాగు చేసిన రైతులకు కన్నీరే మిగిలింది. ఈ ఏడాది యాసంగిలో తెలంగాణలో రికార్డు స్థాయిలో 54లక్షల పైచిలుకు ఎకరాల్లో వరి సాగయింది. అయితే అకాల వర్షాలు, ఈదురుగాలులు, వడగళ్ల వానలతో చేతికందిన వరి పంట నేలపాలైంది. వరి ధాన్యం గలలు వినిపించాల్సిన చోట రైతుల కన్నీటి కడగండ్లు వినిపిస్తున్నాయి. పలు జిల్లాల్లో కోత
కు వచ్చిన వరి పైరు వడగళ్ల వానలకు పూర్తిగా దెబ్బతింది. చివరకు కొనుగోలు కేంద్రాలకు తరలించిన ధాన్యం ప్రభుత్వం కొనేలోపే వర్షార్పణం కావడంతో రైతుల కళ్లలో కన్నీరు ప్రవహిస్తోంది. వరి కోత దశలో అకాల వర్షాలు, వడగళ్లు పడుతుండడంతో వరి కంకులు రాలిపోయి ఉత్త గడ్డే మిగిలిందని రైతులు వాపోతున్నారు. కళ్ల ముందే పంట వడగళ్ల వానకు ధ్వంసమవుతున్నా చూస్తూ ఊరుకోవడం తప్ప ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలోకి కూరుకుపోయామని రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు.

కౌలు రైతు కుదేలు…
అకాల వర్షాలకు రాష్ట్రంలో కౌలు రైతుల కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ఏటేటా పంటసాగుకయ్యే పెట్టుబడులు పెరగడం తోపాటు భూమి కౌలు ధర కూడా ఏటా పె ంచుతుండడంతో వారికి కష్టాలే మిగులుతున్నాయి. ఇది చాలదన్నట్లు అకాల వర్షాలకు వేలాది రూపాయలు కౌలు చెల్లించి, లక్షలాది రూపాయలు పెట్టుబడి పెట్టి సాగు చేసిన పంటలు కూడా దెబ్బతినడంతో వారు నిలువునా అప్పుల ఊబిలో కూరుకుపోయారు. ఖమ్మం, నిజామాబాద్‌, వరంగల్‌తో పాటు అన్ని జిల్లాల్లో పెద్ద సంఖ్యలో కౌలు రైతులు ఉన్నారు. కొన్ని గ్రామాల్లో ఎకరాకు రూ.25వేలు చెల్లించి మరీ భూములను కౌలుకు తీసుకున్న రైతులకు వడగళ్ల వాన కారణంగా కనీసం కౌలు చెల్లించలేని పరిస్థ్తితులు నెలకొన్నా యి. పంట నష్టపరిహారం చెల్లిస్తామని ప్రభుత్వం చెబుతున్నా కౌలు రైతులకు చెల్లించే విషయంలో ఇప్పటి వరకు ఎలాంటి మార్గదర్శకాలు విడుదల చేయకపోవడంతో అప్పులు ఎలా తీర్చాలో తెలియడం లేదని రైతులు వాపోతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement