Friday, November 22, 2024

తెలుగు రాష్ట్రాల్లో వేసవి మంటలు!

తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచికొడుతున్నాయి. వేసవి ప్రారంభంలోనే, మార్చి నెల తొలి వారం నుంచే సూర్యుడు తన ప్రతాపాన్ని చూపించాడు. ఈ వేసవిలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2-4 డిగ్రీల మేర ఎక్కువగా నమోదవుతున్నాయి.  మధ్యాహ్నం వేళల్లో భగభగ మండుతున్న ఎండల్ని చూసి ప్రజలు ఇళ్లల్లోంచి బయటికి వచ్చేందుకే భయపడుతున్నారు. కొన్ని రోజుల్లో రికార్డు స్థాయికి గరిష్ఠ ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం కూడా ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఓవైపు ఎండలు, మరోవైపు వడగాల్పులు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి,

ఇక, ఆంధ్రప్రదేశ్‌లో నమోదవుతోన్న ఉష్ణోగ్రతల వివరాలను రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ విడుదల చేసింది. దీని ప్రకారం 78 మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీచినట్లు తెలిపారు. ఇక రానున్న 24 గంటల్లో 83 మండల్లాలో, రానున్న 48 గంటల్లో 14 మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉందని తెలిపింది. గురువారం అత్యధికంగా దెందులూరు 45.3, వేలైర్పాడు 45, పమిడి ముక్కల 45, బెల్లంకొండ 45.3, తెనాలి 45.5, చేబ్రోలు 45, కురిచేడు 45.8, కోనకనమిట్లలో 45.8 ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో శుక్రవారం కూడా ఉష్ణోగ్రతలు భారీగా నమోదయ్యే అవకాశాలున్నాయని, వేడి గాలులు కూడా వీచే అవకాశముందని అధికారులు హెచ్చరిస్తున్నారు.

ఉత్తర తెలంగాణలోని వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ పరిధిలో వడగాలుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఏప్రిల్, మే నెలల్లో 46 డిగ్రీల సెల్సియస్‌కు పైగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు కావచ్చని అధికారులు భావిస్తున్నారు.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో రానున్న రెండు రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింతగా పెరుగుతాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరించింది. ఆగ్నేయ బంగాళాఖాతం, దక్షిణ అండమాన్‌ సముద్రంలో తుపాను ప్రభావం కారణంగా వాతావరణంలో పలు మార్పులు జరుగుతున్నాయని తెలిపింది. వడగాల్పులు, మండుతోన్న ఎండలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement