తెలంగాణ ప్రజలకు మెరుగైన వైద్య సేవల కోసం ఉద్దేశించిన హెల్త్ ప్రొఫైల్ ప్రాజెక్టు రెండు రోజుల్లో పున: ప్రారంభం కానుంది. ఈ మేరకు తెలంగాణ సర్కారు ఏర్పాట్లు చేస్తోంది. సమ్మక్క జాతర తర్వాత తెలంగాణలో హెల్త్ ప్రొఫైల్ ప్రాజెక్టును అధికారికంగా ప్రారంభిస్తామని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖా మంత్రి హరీష్‌రావు ప్రకటించిన విషయం విధితమే. ఈ మేరకు రెండు, మూడు రోజుల్లో హెల్త్ ప్రొఫైల్ ప్రాజెక్టును ములుగు, సిరిసిల్ల జిల్లాలో అధికారికంగా ప్రారంభించనున్నారు.
హైదరాబాద్, ఆంధ్రప్రభ: రాష్ట్రంలోని ప్రజలు ఎదుర్కొంటున్న వ్యాధులు, అనారోగ్య సమస్యలను రికార్డు చేసే ఉద్దేశ్యంతో హెల్త్ ప్రొఫైల్ ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం రూపొందించింది. హెల్త్ ప్రొఫైల్ ప్రాజెక్టు అమలుల్లోకి వస్తే ప్రజారోగ్యంలో పెద్ద విప్లవాత్మక అడుగు పడినట్లేనని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ ప్రాజెక్టుతో దేశానికే రాష్ట్రం రోల్ మోడల్‌గా మారనుందని చెబుతున్నారు. ఇప్పటికే హెల్త్ ప్రొఫైల్ ప్రాజెక్టును పైలట్ మోడ్‌లో సిరిసిల్ల జిల్లాలో అమలు చేసి చూశారు. అద్భుతమైన ఫలితాలు రావటంతో రాష్ట్ర మంతా విస్తరించాలని నిర్ణయించారు. హెల్త్ ప్రొఫైల్‌లో భాగంగా రాష్ట్రంలోని ప్రతీ వ్యక్తి ఆరోగ్య డేటాను సేకరిస్తారు. ఆ వ్యక్తి ఎదుర్కొంటున్న అనారోగ్య సమస్యలు ప్రత్యేకించి బీపీ, షుగర్, అసంక్రమిత వ్యాధులు, కంటి సంబంధిత వ్యాధులు, క్యాన్సర్, కిడ్నీ, కాలేయ తదితర వ్యాధుల వివరాలను సేకరిస్తారు. సేకరించిన ఆరోగ్య డేటాను ఆ పౌరుని పేరుమీద నిక్షిప్తం చేస్తారు.
అతడు అనారోగ్యంతో ఆసుపత్రికి వెళ్లిన వెంటనే ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యులు తెలుసుకునేందుకు వీలు కలుగుతుంది. హెల్త్ ప్రొఫైల్ ప్రాజెక్టులో భాగంగా ప్రతీ వ్యక్తికి ఆరోగ్య స్మార్ట్ కార్డును అందిస్తారు. రోగి ఎదుర్కొంటున్న అనారోగ్య సమస్యలు, అతడున్న ప్రాంతంలో వ్యాప్తిలో ఉన్న వ్యాధులు తదితర సమాచారం అంతా వైద్యుడికి క్షణాల్లో తెలిసిపోతుంది. ఆ సమాచారం ఆధారంగా వైద్యుడు పక్కా వైద్యం అందించటంతోపాటు ప్రభుత్వం ఆయా ప్రాంతాల్లోని ప్రజలు ఎదుర్కొంటున్న అనారోగ్య సమస్యలు, వ్యాధుల దాడిని అరికట్టేందుకు ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేయటంతోపాటు ఆయా ఆసుపత్రుల్లో ఆ మేరకు మౌళిక సదుపాయాలను వృద్ధి చేయనుంది.