తెలంగాణలో కోరనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. కొత్త కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకు విపరీతంగా పెరుగుతోంది. గత మూడు రోజులుగా రెండు వేలకుపైనే పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. కరోనా నియంత్రణపై వైద్య, ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్ వరుస సమీక్షలతో నిర్వహించారు. తొలుత అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి.. ఆ తరువాత ప్రైవేటు ఆస్పత్రుల యాజమాన్యాలతో చర్చించారు.
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి రోజు రోజుకు విపరీతంగా పెరుగుతోందని మంత్రి ఈటల అన్నారు. దేశం మొత్తంలో నమోదైన కేసుల్లో 40శాతం కేసులు ఒక్క మహారాష్ట్రలోనే నమోదయ్యాయని తెలిపారు. మహారాష్ట్రతో తెలంగాణకు రాకపోకలు రెగ్యూలర్గా ఉంటాయని, మహారాష్ట్ర ఎఫెక్ట్ తెలంగాణపై ఉండే అవకాశం ఉందన్నారు. దాదాపు రోజుకు లక్ష మంది మహారాష్ట్ర, తెలంగాణ మధ్య ప్రయాణాలు సాగిస్తుంటారని చెప్పారు. కరోనాతో సహజీవనం చేయడం తప్ప వేరే మార్గం లేదన్నారు. తెలంగాణలో లాక్డౌన్, కర్ఫ్యూలు పెట్టే పరిస్థితి లేదని మంత్రి ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు. కరోనా నివారణకు అధికారులు అన్ని రకాల చర్యలు చేపట్టాలన్నారు. అన్ని రకాలుగా సిద్ధంగా ఉండాలని సూచించారు.
ఇతర రాష్ట్రాల నుంచి కూడా హైదరాబాద్కు వైద్యం కోసం వస్తున్నారని, వారికి చికిత్స అందించాల్సిన బాధ్యత ప్రైవేటు ఆస్పత్రుల బాధ్యత అని మంత్రి ఈటల పేర్కొన్నారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో కరోనా వైద్యానికి ప్రభుత్వం ఫీజులను ఖరారు చేసిందన్నారు. ఏడాది కాలంలో ఎన్నో అనుభవాలు ఎదుర్కొన్నామన్నారు. కార్పొరేట్ ఆస్పత్రులు అనగానే దోచుకుంటాయి అనే పరిస్థితి ఉండొద్దని ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యాలకు మంత్రి ఈటల సూచించారు. పేదలు ప్రైవేటు ఆస్పత్రికి వచ్చినపుడు వాళ్ళను ఆర్ధికంగా ఇబ్బంది పెట్టొద్దని కోరారు. ప్రైవేటు ఆస్పత్రులు మానవత్వంతో వ్యవహారించాలన్నారు. కరోనా అంటే ఏడాది కింద ఉన్న భయం ఇపుడు లేదన్నారు. కొవిడ్ ట్రీట్మెంట్తో పాటు.. నాన్ కోవిడ్ రోగులకూ వైద్యం అందించాలని ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యాలకు మంత్రి ఈటల రాజేందర్ దిశానిర్దేశం చేశారు.