పది రోజుల నుంచి వరుసగా కురిసిన భారీ వర్షాలు, వరదలతో ముంపు ప్రభావిత ప్రాంతాల్లో అంటు వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉంది. దీంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమయ్యింది. దీనికి సంబంధించి వైద్యారోగ్య శాఖలోని ఇద్దరు ఉన్నతాధికారులతో నోడల్ టీమ్‌ని నియమించింది. వీరిలో తెలంగాణ మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ కె. రమేశ్‌రెడ్డి, ఫ్యామిలీ వెల్ఫేర్, మెడికల్ హెల్త్ డైరెక్టర్ జి. శ్రీనివాసరావుని నియమిస్తూ ఆదేశాలిచ్చింది.
కాగా, వైద్యరోగ్యానికి సంబంధించి ఈ ఇద్దరు ఉన్నతాధికారుల పర్యవేక్షణలో మెరుగైన చర్యలు తీసుకోవాలని ఇవ్వాల (శనివారం) భేటీ అయిన ప్రజాప్రతినిధుల కమిటీ నిర్ణయించింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులను ప్రభుత్వ కార్యదర్శి రిజ్వి కొద్దిసేపటికి క్రితమే వెలువరించారు. ఆదిలాబాద్, కుమ్రం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి జిల్లాలకు బాధ్యులుగా కె. రమేశ్‌రెడ్డి ఉంటారు. భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలకు బాధ్యులుగా శ్రీనివాసరావు వ్యవహరించనున్నారు.
వీరు వెంటనే వరద ప్రభావిత జిల్లాల్లో హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేయడంతో పాటు అన్ని రకాల హెల్త్ ఇష్యూస్‌కి సరైన మందులను అందుబాటులో ఉండేలా చూసుకోవాల్సి ఉంటుంది. వరద నీరు తొలగిన తర్వాత తలెత్తే సమస్యలు, ఇతర అంటు వ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.