యాదాద్రి భువనగి/హైదరాబాద్, ఆంధ్రప్రభ : కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సకు ఆస్పత్రికి వచ్చిన ఓ మహిళలకు ఈ ఆపరేషన్ చేయబోమంటూ వైద్యులు వెళ్లిపోయిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. జిల్లా కేంద్రంలో ఉన్న ప్రభుత్వ ఆస్పత్రిలో శనివారం కుటుంబ నియంత్రణ ఆపరేషన్ క్యాంప్‌ను వైద్యాధికారులు నిర్వహించారు. రెండు మండలాలకు చెందిన మహిళలకు ఆపరేషన్లు చేస్తామని ప్రకటించి తీరా ఒకే మండలానికి చెందిన వారికే కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేస్తామని వైద్యులు ప్రకటించడంతో అసలు రగడ మొదలైంది. దీంతో అక్కడి వైద్యులు ఎవరికి ఆపరేషన్లు చేయకుండానే వెళ్లిపోయారు. భువనగిరి జిల్లా ఆసుపత్రిలో వైద్యులు, ఆశ వర్కర్లు, మహిళల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. తుర్కపల్లి, రాజాపేట మండలాలకు చెందిన సుమారు వంద మందికిపైగా మహిళలు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ కోసం ఆసుపత్రికి వచ్చారు. వారిని సంబంధిత మండలాల ఆశావర్కర్లు ఆపరేషన్ కోసం తీసుకువచ్చారు.
ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు మహిళల పేర్లను నమోదు చేసుకున్నారు. అనంతరం ఆపరేషన్ చేయడానికి 12 మంది మహిళలకు మత్తు ఇంజెక్షన్ ఇచ్చారు. వైద్యులు మాత్రం తుర్కపల్లి మండలం నుంచి వచ్చిన మహిళలకు ఏప్రిల్ 5న ఆపరేషన్లు చేస్తామని చెప్పారు. దీంతో ఆగ్రహించిన ఆశావర్కర్లు, మహిళలు, బాధిత కుటుంబ సభ్యులు ఆసుపత్రి సిబ్బందితో గొడవకు దిగారు. ఆపరేషన్లను వాయిదా వేయాలని తీసుకున్న నిర్ణయంపట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ఉదయం నుంచి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ కోసం ఆహారం, భోజనం, ఇతర పానీయాలు సేవించకుండా మహిళలు వేచిచూశారు. సాయంత్రం వరకు అలాగే కూర్చోబెట్టి ఆపరేషన్ చేయమని ఇంటికి వెళ్లిపోమ్మని చెబితే ఎలా అని వారు నిలదీశారు. అసలే వేసవికాలం చంటి పిల్లలతో వచ్చి ఇబ్బందులు పడ్డామని బాధిత మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు ఆశావర్కర్లు వైద్యుల నిర్ణయాన్ని తప్పుబట్టారు. కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు పూర్తి చేయాలని తమకు లక్ష్యాలను నిర్దేశించారని ఒత్తిడి చేసి ఆపరేషన్ కోసం తీసుకువస్తే చేయకపోగా ఏప్రిల్ 5న రమ్మని ప్రకటించడం తమనెంతో బాధించిందని ఆశావర్కర్లు చెప్పారు.
దీంతో ఆసుపత్రిలో గందరగోళం చోటు చేసుకుంది. ఈ అంశంపై జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి సాంబశివరావును సంప్రదించగా మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌కు ముందు నిర్ధారణ పరీక్షలు చేస్తామని వారికి మత్తు మందు పడుతుందా, లేదా పర్యవేక్షిస్తామని చెప్పారు. అంతేకానీ మత్తు మందు ఇచ్చి వైద్యులు వెళ్లిపోయారని ఆరోపించడం సబబు కాదని చెప్పారు. ఆపరేషన్ చేసే వైద్యుడికి ఆరోగ్యం సహకరించకపోవడంతో ఏప్రిల్ 5వ తేదీకి వాయిదా వేశామన ఆయన వివరించారు.