Monday, November 18, 2024

వీడు మామూలోడు కాదు.. నాలుగు రాష్ట్రాల‌కి చెందిన.. ఆరుగురు మ‌హిళ‌ల‌ని వివాహం చేసుకున్న ఘనుడు

ఒక వ్య‌క్తి నాలుగు రాష్ట్రాల‌కి చెందిన ఆరుగురు మ‌హిళ‌ల‌ని వివాహం చేసుకున్నాడు. ఈ అంతరాష్ట్ర పెళ్లికొడుకు చివరకు ఒక బావ మరిదికి రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయాడు. ఈ సంఘటన బీహార్‌లో జరిగింది. బర్హత్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జవతారి గ్రామానికి చెందిన చోటూ కుమార్‌ ఒక ఆర్కెస్ట్రా బృందంలో గాయకుడిగా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో నాలుగు రాష్ట్రాల్లో కచేరీల సందర్భంగా పరిచయమైన ఆరుగురు మహిళలను అతడు పెళ్లాడాడు. వారితో పిల్లల్ని కూడా కన్నాడు. కోల్‌కతాకు వెళ్లేందుకు జముయి రైల్వే స్టేషన్‌ను చేరుకున్న రెండో భార్య మంజూ సోదరుడు వికాస్‌, మరో భార్యతోపాటు ఉన్న చోటూను చూశాడు.

వెంటనే అతడ్ని పట్టుకుని తన కుటుంబ సభ్యులను అక్కడకు రప్పించాడు. దీంతో వారంతా కలిసి చోటూను పోలీస్‌ స్టేషన్‌కు తీసుకెళ్లారు. 2018లో తన కుమార్తె మంజూను చోటూ పెళ్లి చేసుకున్నాడని ఆమె తల్లి కోబియా దేవి పోలీసులకు ఫిర్యాదు చేసింది. వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారని తెలిపింది. ఏడాదిన్నర కిందట మందులు తీసుకువస్తానని చెప్పి బయటకు వెళ్లిన చోటూ ఇంటికి తిరిగి రాలేదని ఆమె ఆరోపించింది. జార్ఖండ్‌ రాజధాని రాంచీకి చెందిన కళావతి దేవిని అతడు మొదటి పెళ్లి చేసుకున్నాడని, వారికి నలుగురు పిల్లలున్నారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. మరోవైపు, చోటూను పోలీసులు ప్రశ్నించగా నాలుగు రాష్ట్రాలకు చెందిన ఆరుగురు మహిళలను పెళ్లి చేసుకున్నట్లు అతడు చెప్పాడు. బీహార్‌లోని చిన్వారియా, సుందర్‌కండ్ ప్రాంతాలకు చెందిన మహిళలతోపాటు జార్ఖండ్‌లోని రాంచీ, డియోఘడ్‌లో ఒక్కో మహిళను, మహారాష్ట్రలోని సంగ్రామ్‌పూర్ గ్రామానికి చెందిన ఒక మహిళను, ఢిల్లీకి చెందిన మరో మహిళను అతడు పెళ్లి చేసుకున్నాడని పోలీసులు తెలిపారు. అందరి భార్యలతో పిల్లలను కలిగి ఉన్నట్లు చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement