అమరావతి, ఆంధ్రప్రభ: ప్రభుత్వరంగ సంస్థలు.. కార్పొరేషన్లు.. సొసైటీల్లో పనిచేసే ఉద్యోగులకు 62 ఏళ్ల పదవీ విరమణ వయోపరిమితి పెంపు వర్తించదని హైకోర్టు స్పష్టం చేసింది. పదవీ విరమణ వయసును పెంచాల్సిందిగా గతం లో సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును రద్దు చేసింది. ఈ ఉద్యోగుల సర్వీసు నిబంధనలను 309 అధికరణ ప్రకారం రూపొందించలేదని కార్పొరేషన్లు, సొసైటీలు, ఇతర సంస్థల్లో పనిచేసే ఉద్యోగులకు వారి సొంత సర్వీసు నిబంధనలు ఉన్నాయని జీతాలను సైతం ఆయా కార్పొరేషన్ల నుంచే తీసుకుంటున్నారని వివరించింది. ప్రభుత్వ కార్యకలాపాలతో ముడిపడి ఉన్న ఏపీపీఎస్‌సీ ద్వారా నియమితులైన సంచిత నిధి నుంచి జీతాలు తీసుకుంటున్న ఉద్యోగులకు మాత్రమే 1984 చట్టంలోని నిబంధనలు వర్తిస్తాయని తేల్చి చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు 60 నుంచి 62కు పెంచుతూ తీసుకున్న నిర్ణయాన్ని తమకు కూడా వర్తింపచేయాలని కోరుతూ ఏపీఈడబ్లూఐడీసీ ఉద్యోగులు హైకోర్టులో పిటషన్ దాఖలు చేశారు. ప్రభుత్వం 62 ఏళ్లకు పెంచినప్పటికీ అదే సమయంలో 60 ఏళ్లకే తమను పదవీ విరమణ చేయాలంటూ ఏపీ విద్యా సంక్షేమ మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (ఏపీఈడబ్ల్యూఐడీసీ) ఎండీ జారీ చేసిన ప్రొసీడింగ్స్‌ను రద్దు చేయాలని కోరుతూ సంస్థ ఉద్యోగులు కే జనార్థనరెడ్డి కే కరుణాకరరెడ్డి, సీ చంద్రశేఖరరెడ్డి తదితరులు 2022లో పిటిషన్లు దాఖలు చేశారు.
దీనిపై అప్పట్లో సింగిల్ జడ్జి జస్టిస్ కే మన్మధరావు విచారణ జరిపి ప్రబుత్వ ఉద్యోగులతో పాటు వారికి కూడా పదవీ విరమణ వయోపరిమితి పెంపును వర్తింప చేయాలని తీర్పునిచ్చారు. ఈ తీర్పున ుసవాల్ చేస్తూపాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి, ఏపీఈడబ్యూఐడీసీ ఎండీ ధర్మాసనం ముందు అప్పీళ్లు దాఖలు చేశారు. పిటిషనర్ల తరుపున సీనియర్ న్యాయవాది ఓ మనోహరరెడ్డి, పీవీఏ పద్మనాభం వాదనలు వినిపించారు. ఏపీఈడబ్ల్యూఐడీసీ నిర్వర్తించే విధులు ప్రభుత్వ పరిధిలోవే అన్నారు. ప్రభుత్వ నియంత్రణలోనే ఉద్యోగులు పనిచేస్తున్నారని అందువల్ల వయోపరిమితి పెంపునకు అర్హులని వాదించారు.ఈ దశలో అడ్వొకేట్ జనరల్ ఎస్ శ్రీరాం స్పందిస్తూ ఎలాంటి అనుమతులు లేకుండానే కొన్ని ప్రభుత్వరంగ సంస్థలు, కార్పొరేషన్లు తమ ఉద్యోగుల పదవీ విరమణ వయసును 62ఏళ్లకు పెంచుతున్నాయని కోర్టు దృష్టికి తెచ్చారు.
ప్రభుత్వ అనుమతి తప్పనిసరన్నారు. వాస్తవానికి 1984 చట్టనిబంధనల ప్రకారం ప్రభుత్వ కార్పొరేషన్లు, సొసైటీలు తదితర సంస్థల్లో పనిచేసే ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు పెంపుదలకు అర్హులు కారన్నారు. ఇందుకు చట్ట నిబంధనలు కూడా అంగీకరింవచవని కార్పొరేషన్లకు సొంత సర్వీసు నిబంధనలు అమల్లో ఉన్నాయని వివరించారు. ఈ వాదనలతో జస్టిస్ డీవీఎస్‌ఎస్ సోమయాజులు, జస్టిస్ ఊటుకూరు శ్రీనివాస్‌లతో కూడిన ధర్మాసనం ఏకీభవిస్తూ రాష్ట్ర ప్రభుత్వ సర్వీసు నిబంధనలు పిటిషనర్లకు వర్తిస్తాయని సింగిల్ జడ్జి చెప్పటం సరికాదని స్పష్టం చేసింది.