ఆ బాబా పాద ధూళి సోకితే చాలు సర్వ పాపాలు హరిస్తాయి.. అతని చూపు తమపై పడితే చాలు రోగాలు పోతాయి. భోలే నాథ్ బాబా నడిచిన మట్టి తమ వద్ద ఉంటే చాలు సిరి సపందలు వెళ్లివిరిస్తాయి.. మా కష్టాలు కడతేరే మార్గం ఇదొక్కటే అన్న నమ్మకం వారిని పరుగులు పెట్టించింది. అలా.. మట్టికోసం వెళ్లిన వారిని అడుగులే మృత్యువై కాటేసి మట్టిలోకి తొక్కేశాయి. యూపీలో జరిగిన తొక్కిసలాటలో ఏకంగా 121 మంది చనిపోయారు. ఈ విషాద ఘటనతో యావత్ దేశం దిగ్భ్రాంతికి గురయ్యింది. మూఢ విశ్వాసంతోనే ఈ దారుణం జరిగిందని మేథావులు అంటున్నారు. అయితే.. దేవుడిపై భక్తి, విశ్వాసం ఉంటే చాలని, బాబాలు, పూజారులపై మూఢ నమ్మకం వద్దని చెబుతున్నారు. కాగా, దేశ వ్యాప్తంగా పలు ఆలయాల వద్ద చోటుచేసుకున్న మహా విషాద ఘటనలను కూడా గుర్తు చేసుకుంటున్నారు. వందలాది మందిని బలిగొన్న పలు విషాద ఘటనలను పరిశీలిద్దాం..
మృత్యువై కాటేసిన అడుగులు
తొక్కిసలాటలో 121 మంది దుర్మరణం
యూపీలోని హథ్రాస్ ఘటనలో పెరిగిన మృతుల సంఖ్య
గతంలోనూ ఇలాంటి ఘటనలు ఎన్నెన్నో
విషాద ఘటనలను చేసుకుంటున్న నెటిజనులు
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యమేనంటూ సుప్రీం కోర్టుకు
నిపుణుల కమిటీతో విచారణ జరపాలన్న పిటిషనర్
సీబీఐతో ఎంక్వైరీ చేయాలని అలహాబాద్ హైకోర్టులో మరో వ్యాజ్యం
ఆశ్రమం వదిలేసి ఎస్కేస్ అయిన భోలే బాబా
స్వామీజీ కోసం కొనసాగుతున్న సెర్చ్ ఆపరేషన్
ఉత్తర్‌ప్రదేశ్ హాథ్రస్లో జరిగిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో తొక్కిసలాట జరిగి 121 మంది ప్రాణాలు విడిచారు. మరో 28 మంది గాయపడ్డారు. మరణించిన వారిలో ఎక్కువ మంది మహిళలు ఉన్నారని, మృతుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉందని అధికారులు భావిస్తున్నారు. భోలే బాబా సత్సంగ్ పేరుతో జరిగిన ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి ఉత్తర్‌ప్రదేశ్‌లోని వేర్వేరు జిల్లాలతోపాటు పొరుగు రాష్ట్రాల నుంచి వేల సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. కార్యక్రమం ముగిసిన తర్వాత భోలే బాబా వెళ్లిపోతుండగా భక్తులు ఆయన పాదాలను తాకటానికి పరుగెత్తారు. వేదిక సమీపంలో ఉన్న కాలువ నుంచి నీరు పొంగి పొర్లటంతో రహదారి బురదమయంగా మారింది. దీంతో భక్తులు ఒకరిపై ఒకరు జారిపడటం వల్ల తొక్కిసలాట జరిగినట్లు తెలుస్తోంది. అయితే.. ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య ఇంకా పెరగొచ్చని అధికారులు, డాక్టర్లు చెప్తున్నారు. కాగా, ఆధ్యాత్మిక కార్యక్రమాల సందర్భంగా తొక్కిసలాటలు జరగడం, ప్రజలు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు గతంలోనూ జరిగాయి. ఇలాంటి మృత్యుఘోష ఘటనలు జరిగిన మహా విషాదాల తీరును పరిశీలిద్దాం..
మందరాదేవి ఆలయంలో మహావిషాదం… 340 మంది దుర్మరణం
2005లో మహారాష్ట్రలోని మంధరాదేవి ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో 340 మంది చనిపోయారు. 2008లో రాజస్థాన్‌లోని చాముండా దేవి ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో 250 మంది మరణించారు. 2008లో హిమాచల్ ప్రదేశ్‌లోని నైనా దేవి ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో 162 మంది ప్రాణాలు కోల్పోయారు.
దేశంలో చోటుచేసుకున్న ఈ తరహా విషాదాలు..
= 2023, మార్చి 31: మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో శ్రీరామ నవమి వేళ ఒక ఆలయం స్లాబ్ కూలిపోవడంతో 36 మంది మృతి చెందారు.
= 2022, జనవరి 1 : జమ్ముకశ్మీర్‌లోని మాతా వైష్ణో దేవి ఆలయంలో భక్తుల రద్దీ కారణంగా జరిగిన తొక్కిసలాటలో 12 మంది కన్నుమూశారు.
= 2015, జులై 14: ఏపీలోని రాజమండ్రిలో పుష్కరాల మొదటి రోజున గోదావరి నది ఒడ్డున జరిగిన తొక్కిసలాటలో 27 మంది మృతి చెందారు. 20 మంది గాయపడ్డారు.
= 2014, అక్టోబర్ 3: బీహార్‌లోని పాట్నాలో దసరా వేడుకల సందర్భంగా గాంధీ మైదాన్‌లో చోటుచేసుకున్న తొక్కిసలాటలో 32 మంది మృతి చెందారు. 26 మంది గాయపడ్డారు.
= 2013, అక్టోబరు 13: మధ్యప్రదేశ్‌లోని దతియా జిల్లాలోని రతన్‌ఘర్ దేవాలయం సమీపంలో నవరాత్రి ఉత్సవాల సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో 115 మంది మృతి చెందారు. 100 మందికి పైగా జనం గాయపడ్డారు.
= 2012, నవంబర్ 19: బీహార్‌లోని పట్నాలో గంగా నది ఒడ్డున అదాలత్ ఘాట్ వద్ద ఛత్ పూజలు నిర్వహిస్తుండగా తాత్కాలిక వంతెన కూలిపోవడంతో తొక్కిసలాట జరిగి 20 మంది మరణించారు.
= 2011, నవంబర్ 8: హరిద్వార్‌లోని గంగా నది ఒడ్డున హర్కీ పైడి ఘాట్ వద్ద జరిగిన తొక్కిసలాటలో 20 మంది మృతి చెందారు.
= 2011, జనవరి 14 : కేరళలోని ఇడుక్కి జిల్లాలోని పులమేడు వద్ద విషాదం చోటుచేసుకుంది. శబరిమల ఆలయాన్ని సందర్శించి వస్తున్న భక్తుల మధ్య జరిగిన తొక్కిసలాటలో 104 మంది మృతి చెందారు. 40 మంది గాయపడ్డారు.
= 2010, మార్చి 4: ఉత్తరప్రదేశ్‌లోని ప్రతాప్‌గఢ్ జిల్లాలో కృపాలు మహారాజ్ రామ్ జానకి ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో 63 మంది మరణించారు.
= 2008, సెప్టెంబరు 30 : రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో గల చాముండా దేవి ఆలయంలో బాంబు పేలుడు వదంతుల కారణంగా చోటుచేసుకున్న తొక్కిసలాటలో 250 మంది కన్నుమూశారు. 60 మందికి పైగా జనం గాయపడ్డారు.
= 2008, ఆగస్ట్ 3: హిమాచల్ ప్రదేశ్‌లోని బిలాస్పూర్ జిల్లాలోని నైనా దేవి ఆలయంలో కొండ చరియలు విరిగి పడ్డాయనే వదంతులు రావడంతో జరిగిన తొక్కిసలాటలో 162 మంది మృతి చెందారు. 47 మంది గాయపడ్డారు.
= 2005, జనవరి 25: మహారాష్ట్రలోని సతారా జిల్లాలోని మంధరాదేవి ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో 340 మంది మృతి చెందారు. వందలాది మంది గాయపడ్డారు.
= 2003, ఆగష్టు 27: మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో సింహస్థ కుంభమేళా పవిత్ర స్నానాల సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో 39 మంది మృతి చెందారు. 140 మంది గాయపడ్డారు.