వరంగల్ క్రైమ్, (ప్రభ న్యూస్): వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో భూ వివాదం కేసులో చట్ట విరుద్ధంగా నడుచుకొన్న పోలీస్ ఇన్స్పెక్టర్ పై వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్ సీరియస్ గా స్పందించారు. భూ వివాదం కేసులో ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇంటికి వెళ్లి అతిగా వ్యవహరించినట్లుగా క్షేత్ర స్థాయి విచారణలో తెలియడంతో ఆ అధికారిని వరంగల్ పోలీస్ కమిషనరేట్ వేకన్సీ రిజర్వుకు అటాచ్డ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
భూ వివాదం కేసులో హసన్ పర్తి ఇన్స్పెక్టర్ నరేందర్ ఒక వ్యక్తిని బెదిరించినట్లుగా ఆరోపణలు రావడంతో క్షేత్రస్థాయిలో విచారణ జరిపిన అధికారులు, ఆ ఆరోపణలు వాస్తవమని తేలడంతో సదరు అధికారిపై ఇవ్వాల (మంగళవారం) బదిలీ వేటు వేశారు. హసన్ పర్తి ఇన్స్పెక్టర్ నరేందర్ ను వీఆర్ కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులిచ్చారు. ఎలాంటి కేసులైన చట్ట పరిది లోనే చేయాలని, అందుకు విరుద్ధంగా నడుచుకోవడంను సహించబోమని సీపీ రంగనాథ్ పోలీసు అధికారులకు హెచ్చరికలు జారీ చేశారు.