Monday, November 18, 2024

యశోదగా సమంత ప్రేక్షకులని మెప్పించిందా..

సరోగసి నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం యశోద. ఈ చిత్రంలో స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రని పోషించింది. ఈ చిత్రం నేడు థియేటర్లలలో రిలీజ్ అయింది. మరి ఈ చిత్రం సమంతకి విజయాన్ని అందించిందో లేదో చూద్దాం..

కథ ఏంటంటే.. యశోద(సమంత) జోమాటో ఫుడ్‌ డెలివరీ గర్ల్ గా పనిచేస్తూ తన చెల్లిని చూసుకుంటుంది. చెల్లికి అనారోగ్యం కోసం ఆమెకి డబ్బు కావాలి. అందుకోసం సరోగసి ద్వారా బిడ్డకి జన్మనిచ్చేందుకు సిద్ధమవుతుంది. డబ్బు అందిన వెంటనే ఆమెని ్‌ఈవా్‌ అనే సరోగసి ఫెర్టిలిటీ సెంటర్‌కి తీసుకెళ్తారు. సకల సౌకర్యాలకు నెలవు. ఏది కావాలన్నా వారి వద్దకే వచ్చి చేరుతుంటాయి. అవి చూసి యశోద సంతోషిస్తుంది. ఆ సెంటర్‌ మధు(వరలక్ష్మి శరత్‌ కుమార్‌) సమక్షంలో నిర్వహించబడుతుంది. ప్రెగ్నెంట్‌ లేడీలకు డాక్టర్‌ గౌతమ్‌(ఉన్నిముకుందన్‌)చెకప్‌ చేస్తుంటారు. ఈ క్రమంలో సరోగసి కోసం వచ్చిన ఇతర ప్రెగ్నెంటీ లేడీలతో యశోదకి మంచి స్నేహం ఏర్పడుతుంది. కానీ ఉన్నట్టుండి ఇద్దరు ప్రెగ్నెంట్‌ లేడీలు నొప్పులొస్తున్నాయని చెప్పి సీక్రెట్‌ రూమ్‌కి తీసుకెళ్తారు. వారు తిరిగి రారు. బిడ్డ చనిపోయింది, వారిని ఇంటికి పంపించామని చెబుతుంటారు. కానీ ఏదో అనుమానం, ఇందులో ఇంకేదో జరుగుతుందని యశోదకి అనుమానం వస్తుంది. అదేంటో తెలుసుకునే ప్రయత్నంలో అనేక షాకింగ్‌ విషయాలు బయటపడతాయి. మరి ఆ షాకింగ్‌ విషయాలేంటి? ఆ సెంటర్‌లో ఇంకా ఏం జరుగుతుంది? దాన్ని యశోద ఎలా ఎదుర్కొంది..

విశ్లేషణ.. బ్యూటీ ప్రొడక్ట్స్ తయారి వెనకాల జరిగే క్రైమ్‌ని, బిజినెస్‌ని కళ్లకి కట్టినట్టు చూపించిన చిత్రం యశోద. దానికి సరోగసి అనే పాయింట్ ఎలా ఉపయోగపడుతుందనేది యశోదలో ఆవిష్కరించారు. గర్భంలో ఉన్న బేబీ కణజాలంతో బ్యూటీ ప్రొడక్ట్ లు తయారు చేస్తున్నారనే షాకింగ్‌ విషయాన్ని ఇందులో చూపించారు. యశోద్‌లో సరోగసి ఒక్కటే మెయిన్‌ పాయింట్‌ కాదని, దానికి మించిన అంశాలుంటాయని టీమ్‌ చెప్పింది. చెప్పినట్టుగానే ఊహించని విషయాలను చర్చించారు. ప్రస్తుత సమాజంలో బ్యూటీ ప్రొడక్ట్ వెనకాల జరిగే క్రైమ్‌ని అద్భుతంగా ఆవిష్కరించారు. అయితే అదేదో సందేశం ఇవ్వాలనే యాంగిల్‌లో సినిమాని తీయకపోవడం ఇందులో హైలైట్ అంశం. దీనికి తోడు సమంత పాత్రలోని ట్విస్ట్ ఈ సినిమాని మరో స్థాయికి తీసుకెళ్తుంది. యాక్షన్‌ ఎపిసోడ్స్ సినిమాకి మరో హైలైట్‌. సస్పెన్స్, థ్రిల్లింగ్‌ సీన్లలో బీజీఎం సినిమాని ఇంకో లెవల్‌లోకి తీసుకెళ్లింది. ఇక సినిమాగా చూస్తే మొదటి భాగం చాలా వరకు బోరింగ్‌గా సాగుతుంది. చాలా అంశాలు మిస్టరీగా ఉండటంతో ఏం జరుగుతుందనేది అర్థం కాదు. పైగా ఈవా సరోగసి ఫెర్టిలిటీ సెంటర్‌లో ఆఫీస్‌ స్టాఫ్‌తో, అలాగే తనతోటి ప్రెగ్నెంటీ లేడీల మధ్య జరిగే కన్వర్జేషన్‌ కాస్త బోరింగ్‌గా అనిపిస్తుంది. సినిమాపై ఆసక్తిని డైవర్ట్ చేస్తుంది. మొదటి భాగం వరకు అసలు కథ రివీల్‌ కాదు. ఇంటర్వెల్‌ ట్విస్ట్, సెకండాఫ్‌ నుంచి సినిమా మరో లెవల్‌కి వెళ్తుంది. ఒకదాని తర్వాత ఒక్కో కొత్త విషయం తెరపైకి రావడం, సస్పెన్స్ గా, థ్రిల్లింగ్‌గా సాగడంతో ఆడియెన్స్ పూర్తిగా కథలో ఇన్‌వాల్వ్ అయిపోతారు.

- Advertisement -

నటీనటులు.. యశోద సినిమాకి సమంతనే బలం. ఆమె లేకపోతే సినిమా లేదనే చెప్పాలి. తన నట విశ్వరూపం చూపించారు. ఆమె పలికించిన ఎమోషన్స్ ఆకట్టుకుంటాయి. నటిగా మరింత పరిణతి కనబరడంతోపాటు సినిమాని తనభుజాలపై మోసింది. ఆల్మోస్ట్ ప్రతి ఫ్రేమ్‌లోనూ తనే కనిపిస్తుంది. యాక్షన్‌ సీన్స్ లో తనలోని మరో యాంగిల్‌ని ఆవిష్కరించింది. హీరోయిజానికి మరో అర్థాన్ని చెప్పింది. సినిమాకి హీరో ఉండాల్సిన అవసరం లేదని, తనే హీరోని మించి చేయగలను అని నిరూపించింది. ఈ సినిమా కమర్షియల్‌గా సక్సెస్‌ అయితే ఇండియన్‌ సినిమాలో సమంత నెక్ట్స్ బిగ్‌ నేమ్‌గా మారబోతుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇతర నటుల విషయానికి వస్తే కాస్త పాజిటివ్‌, ఇంకాస్త నెగటివ్‌ రోల్స్ లో వరలక్ష్మి శరత్‌ కుమార్‌, ఉన్నిముకుందన్‌ సూపర్బ్ గా చేశారు. సమంత తర్వాత ఈ ఇద్దరి నటన ఆకట్టుకుంటుంది. అలాగే రావు రమేష్‌, మురళీ శర్మ, సంపత్‌ రాజ్‌, శత్రు ఎప్పటిలాగే అదరగొట్టారు. సినిమాకి తమ వంతు హెల్ప్ అయ్యారు.

టెక్నీషియన్లు.. హరి, హరీష్‌ దర్శకద్వయం తెలుగులోకి ఎంట్రీ ఇస్తూ చేసిన తొలి చిత్రమిది. తక్కువబడ్జెట్‌ అనుకుని చేశారు. నిర్మాతతో బడ్జెట్‌ మారిపోయింది. లార్జ్ స్కేల్‌లో చాలా బాగా డిజైన్‌ చేశారు. వీరు ఎంచుకున్న కథ చాలా కొత్తగా ఉంటుంది. కాంటెంపరరీగా ఉండటంతో సాధారణ ఆడియెన్‌కి కూడా కనెక్ట్ అవుతుంది. ముఖ్యంగా మహిళలకు బాగా కనెక్ట్ అయ్యే సబ్జెక్ట్ ఇది. వారికి నచ్చిందంటే సినిమా ఇంకో లెవల్‌కి చేరుతుందని చెప్పొచ్చు. అయితే చాలా చోట్ల లాజిక్‌లు మిస్‌ అయ్యారు. సమంత మొదట సరోగసి సెంటర్‌కి వెళ్లడం, సరోగసి సెంటర్లో, అలాగే పోలీస్‌ ఇన్వెస్టిగేషన్స్ లో కొన్ని ప్రైమరీ లాజిక్స్ ని మిస్‌ చేశారు. అవి ఆడియెన్స్ ఈజీగా పట్టేసేలా ఉండటం గమనార్హం. అవి పక్కన పెడితే ఓ మంచి ప్రయోగం చేశారని, వారు ఎంచుకున్న కాన్సెప్ట్ ని అభినందించాల్సిందే. సినిమాటోగ్రఫీ సినిమాకి మరో బలం. ఎం సుకుమార్‌ కెమెరా విజువల్‌ చాలా బాగున్నాయి. సినిమాకి సంగీతం, బీజీఎం మరో బలం. సినిమాకి అది మరో ప్రాణం. మణిశర్మ తన అనుభవాన్ని చూపించారు. సినిమాని ఇంకో స్థాయికి తీసుకెళ్లారు. మొదటి భాగంలో ఎడిటింగ్‌ వర్క్ కి ఇంకా పనిచెప్పాల్సింది. సినిమాలోని కొన్ని అనవసరంసీన్లు లేపేస్తే ఇంకా క్రిస్పీగా ఉండేది. ఆర్ట్ వర్క్ కూడా ప్రత్యేకంగా మెన్షన్‌ చేసేలా ఉంది. ప్రతి సెట్‌ వర్క్ గ్రాండియర్‌గా ఉంది. పులగం చిన్నారాయణ, చల్లా భాగ్యలక్ష్మి మాటలు సినిమాకి మరింత సపోర్టివ్ గా నిలిచాయి. శివలెంక కృష్ణ ప్రసాద్‌ నిర్మాణ విలువలు సినిమాకి మరో ప్లస్‌. సమంత ఫ్యాన్స్ పండగ చేసుకోవచ్చు.

Advertisement

తాజా వార్తలు

Advertisement