Thursday, November 21, 2024

Big Story: వరికోతలు ముమ్మరం, 50శాతం పూర్తి.. ఇప్పటికీ చేరుకోని గన్నీ బ్యాగులు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : రాష్ట్ర వ్యాప్తంగా యాసంగి వరికోతలు ముమ్మరం కావడంతో పూర్తిస్థాయిలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ సిద్ధమవుతోంది. ఇప్పటికే పలు జిల్లాల్లో 20 నుంచి 30శాతం మేర వరికోతలు పూర్తయ్యాయి. రానున్న వారం, పది రోజుల్లో దాదాపు 60శాతం కోతలు పూర్తయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అదేవిధంగా మే మొదటివారానికల్లా పూర్తిస్థాయిలో వరికోతలు పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఏప్రిల్‌ మూడో వారంలో అంటే రానున్న మూడు, నాలుగు రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా కొనుగోలు కేంద్రాలన్నింటినీ అందుబాటులోకి తేవాలని సివిల్‌సప్లయి ఉన్నతాధికారులు క్షేత్రస్థాయి సిబ్బందిని ఆదేశించారు.

రాష్ట్ర వ్యాప్తంగా ఈ యాసంగిలో ధాన్యం కొనుగోళ్ల కోసనం 6983 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. అయితే వరి కోత లు ఇప్పుడిప్పుడే ముమ్మరమవుతుండటంతో పూర్తిస్థాయిలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయలేదు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 1000లోపు మాత్రమే కొనుగోలు కేంద్రాలు ప్రారంభమయ్యాయి. కొనుగోళ్లు ప్రారంభం కానప్పటికీ వరికోతలు పూర్తి చేసిన రైతులు ధాన్యాన్ని గతంలో కొనుగోలు చేసిన ప్రాంతాల్లోని కల్లాలకు తీసుకువస్తున్నారు. దీంతో ఈ వారంలో కొనుగోళ్లు అన్ని కేంద్రాల్లో అధికారికంగా ప్రారంభం కానున్నాయి. వారం రోజుల్లో దాదాపు 50శాతం మేర వరికోతలు పూర్తి కానున్నాయి. ఈ యాసంగిలో 60లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తుందని ప్రభుత్వం అంచనా వేసింది.

ధాన్యం కొనుగోళ్ల విషయంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా పకడ్బంధీగా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్లను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. దీంతో ప్రతి జిల్లా కలెక్టరేట్‌లో ప్రత్యేకంగా కంట్రోల్‌ రూం ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోళ్ల వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నారు. కొనుగోళ్లలో ఎదురయ్యే సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేలా జిల్లాల యంత్రాంగాలు పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నాయి. అదే సమయంలో రాష్ట్ర స్థాయిలో సివిల్‌ సప్లై , ఎఫ్‌సీఐ, వ్యవసాయ, మార్కెటింగ్‌శాఖల డిప్యూటీ డైరెక్టర్ల స్థాయి అధికారులతో ప్రత్యేకంగా కమిటీని వేశారు. జిల్లాల్లో ఎదురవుతున్న ధాన్యం కొనుగోళ్ల సమస్యలపై ఎప్పటికప్పుడు పరిష్కారం దిశగా ఈ కమిటీ కృషి చేయనుంది.

గోనె సంచుల కొరత…
మూడు, నాలుగు రోజుల్లో అన్ని జిల్లాల్లో ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం కానున్న నేపథ్యంలో గోనె సంచుకుల కొరత ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.ఇప్పటికే ముందుగా వరికోతలు పూర్తి చేసిన రైతులు పెద్ద సంఖ్యలో ధాన్యాన్ని కేంద్రాలకు తెచ్చారు. కేంద్రాలకు ధాన్యంతో వచ్చి వారం గడుస్తున్నా కొనుగోళ్లు చేయడం లేదని, ఏమంటే గన్నీ సంచుల కొరత అంటూ ఉన్నతాధికారులు చెబుతున్నారని రైతులు వాపోతున్నారు. గోనె సంచులకు ముంఉదుగానే కలకత్తాలోని మిల్లులకు ముందుగా అధికారులు ఇండెంట్‌ పెట్టాలి.

అయితే ఈ యాసంగిలో ధాన్యం కొనుగోళ్ల నిర్ణయం ఆలస్యం కావడంతో ఇండెంట్‌ పెట్టలేకపోయినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ ఏడాది యాసంగి ధాన్యం కొనుగోళ్లకు 16కోట్ల గన్నీ బ్యాగులు అవసరమవుతాయని అంచనా. ఇప్పటికే రాష్ట్ర సివిల్‌ సప్లై శాఖ వద్ద 3.5కోట్ల గన్నీ బ్యాగులు ఉన్నాయి. మిగతా వాటిని సమకూర్చుకునేందుకు ఇప్పటికే టెండర్లు పిలిచారు. ఒకటి, రెండు రోజుల్లో గోనె సంచులు రాష్ట్రానికి రానున్నాయి. సంచులు వచ్చిన మరుసటి రోజ కొనుగోళ్లను ముమ్మరం చేయాలని పౌరసరఫరాలశాఖ నిర్ణయించింది.

- Advertisement -

కేంద్రాలకు చేరని ప్యాడీ క్లీనర్లు…
కొనుగోలు కేంద్రాలకు ధాన్యం పెద్ద ఎత్తున వచ్చినా… ప్యాడీ క్లీనర్లు ఇంకా అందుబాటులోకి రాలేదు. దీంతో రైతులు ట్రాక్టర్‌ ఇంజన్లను, ఫ్యాన్‌ను అద్దెకు తీసుకుని ధాన్యాన్ని తూర్పార పడుతున్నారు. రెండు, మూడు రోజుల్లో కొనుగోళ్లు అధికారికంగా ప్రారంభం కానుండటంతో అప్పటికల్లా ధాన్యాన్ని తూర్పారబట్టి సిద్ధంగా ఉంచాలన్న తాపత్రయంలో రైతులు ఉన్నారు. కొనుగోలు కేంద్రాల్లో విద్యుత్‌ సౌకర్యం అందుబాటులో లేకపోవడంతో పక్కనే ఉన్న రైతుల బావుల నుంచి విద్యుత్‌ వైరు కొని తెచ్చుకుని ఏర్పాటు చేసుకుంటున్నారు. ట్రాక్టర్‌, ఫ్యాన్‌ కు రోజుకు రూ.800 దాకా అద్దె వసూలు చెల్లించాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు. వెంటనే ప్యాడీ క్లీనర్లను సమకూరిస్తే ధాన్యాన్ని కొనుగోళ్లకు సిద్ధం చేస్తామని రైతులు చెబుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement