ఆరోగ్య తెలంగాణ కల సాకారం చేయడంలో భాగంగా హెల్త్ ప్రొఫైల్ పైలట్ ప్రాజెక్టును ప్రారంభించినట్లు వైద్యఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. తెలంగాణ ఆరోగ్య రంగ ముఖ చిత్రాన్ని మార్చేందుకు, ఆరోగ్య తెలంగాణ కల సాకారం చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనతో రూపొందించిన తెలంగాణ హెల్త్ ప్రొఫైల్ పైలట్ ప్రాజెక్టును ములుగు జిల్లా కలెక్టరెట్ లో ప్రారంబించిన వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. ఇ- హెల్త్ కార్డులను పలువురికి అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. హెల్త్ ప్రొఫైల్ ను ఆదివాసీ జిల్లా అయిన ములుగులో ప్రారంభించు కోవడం సంతోషకరం అన్నారు. దేశంలోనే ఇది ఎక్కడా జరగలేదని, అభివృద్ధి చెందిన అమెరికా, యూరప్ దేశాల్లో మాత్రమే ఈ విధానం ఉందన్నారు. ములుగు, సిరిసిల్ల జిల్లాల్లో హెల్త్ ప్రొఫైల్ పైలట్ ప్రాజెక్టు ను 40 రోజుల్లో పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించినట్లు వెల్లడించారు.
హెల్త్ ప్రొఫైల్ సిద్ధం చేయడంలో భాగంగా వైద్యసిబ్బంది ఇంటింటికీ వెళ్లి, ప్రతి వ్యక్తి ఆరోగ్య సమాచారాన్ని సేకరించనున్నారు. ప్రతి వ్యక్తికి ప్రత్యేకంగా ఒక ఐడీ నంబర్ ఇస్తారు. ఇందు కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా ఈ హెల్త్ ప్రొఫైల్ పేరుతో మొబైల్ యాప్‌ను తయారు చేసింది. వారి నుంచి నమూనాలను సేకరించి, 30 రకాల డయాగ్నోస్టిక్ పరీక్షలు నిర్వహిస్తారు. ఫలితాల ఆధారంగా వారి ఆరోగ్య సమస్యలను నిర్ధారిస్తారు. ఒకవేళ ఏవైనా సమస్యలు ఉంటే వెంటనే చికిత్స ప్రారంభిస్తారు. వివరాలన్నింటినీ ఎప్పటికప్పుడు ఆన్‌లైన్ చేస్తారు. ఈ సమాచారంతో అనేక ప్రయోజనాలు కలుగనున్నాయి. దీర్ఘకాలిక బాధితులను గుర్తించడం, వారికి మెరుగైన వైద్యం అదించడం, క్యాన్సర్ వంటి రోగాలను ప్రాథమిక దశలోనే గుర్తించడం, రక్తహీనత వంటి సమస్యలను గుర్తించి తగిన చికిత్స అందించడం.. ఇలా అనేక ప్రయోజనాలు కలుగనున్నాయి.
హెల్త్ ప్రొఫైల్ లో కూడా ఒక వ్యక్తి యొక్క సమస్త ఆరోగ్య సమాచారాన్ని పొందు పరుస్తారు. ఎప్పుడు పుట్టారు, ఎత్తు, బరువు, శరీర కొలతలు, గుండె కొట్టుకునే తీరు, రక్త వర్గం, జ్వరం, బీపీ, షుగర్ వంటి అనారోగ్య సమస్యలు ఏమైనా ఉన్నాయా? దీర్ఘకాలిక వ్యాధులు ఏవైనా ఉన్నాయా? ఉంటే ఎలాంటి ఏ చికిత్స తీసుకుంటున్నారు? వంటి వివరాలన్నీ అందులో పొందుపరుస్తారు. ఆరోగ్య వివరాలను సేకరించిన తర్వాత సర్వే చేసిన వ్యక్తులకు హీమోగ్లోబిన్, ఆర్బీఎస్ టెస్టులు నిర్వహిస్తారు. రక్త, మూత్ర నమూనాలను సేకరించి ప్రైమరీ హెల్త్ సెంటర్లకు పంపి డయాగ్నోస్టిక్స్ ద్వారా పరీక్షలు నిర్వహిస్తారు. ఫలితాలను ఎస్.ఎం.ఎస్ రూపంలో పంపిస్తారు. 18 ఏండ్లకు పైబడినవారు రాజన్న సిరిసిల్ల జిల్లాలో 3.80 లక్షల మంది, ములుగు జిల్లాలో 2.60 లక్షల మంది ఉన్నారు. రెండు జిల్లాలకు కలిపి మొత్తం 420 పైగా బృందాలను ఏర్పాటు చేశాం. ఒక్కో బృందంలో ఒక ఏఎన్ఎం, ముగ్గురు ఆశా కార్యకర్తలు ఉంటారు.