హైదరాబాద్, ఆంధ్రప్రభ : వైద్య, ఆరోగ్యశాఖ జిల్లా అధికారుల పనితీరుపై మంత్రి హరీశ్‌రావు అసంతృప్తితో ఉన్నారు. దీంతో ఆ శాఖలో డీఎంహెచ్‌వోల బదిలీలు భారీ ఎత్తున జరగనున్నట్లు తెలుస్తోంది. మరో నాలుగైదు జిల్లాల డీఎంహెచ్వోలను నాలుగైదు రోజుల్లో మారుస్తారని చర్చ జరుగుతోంది. ఇటీవల వైద్య, ఆరోగ్యశాఖపై మంత్రి హరీష్‌రావు వరుస సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన పలువురు డీఎంహెచ్‌వోల పనితీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. బాగా పనిచేసే డీఎంహెచ్వోలను జాతీయ ఆరోగ్య మిషన్‌లో ప్రోగ్రామ్ అధికారులుగా నియమిస్తారన్న చర్చ కూడా జరుగుతోంది. మరోవైపు ఉన్నతాధికారులు బదిలీల్లో అనేక అక్రమాలు జరిగినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సీనియర్లను పక్కన బెట్టి జూనియర్లకు పదోన్నతులు కట్టబెట్టారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఏళ్లుగా పనిచేయకుండా ఉన్న సీనియర్లను తప్పించేందుకు ఆకస్మికంగా పదోన్నతులు చేపట్టారు.
హైదరాబాద్, సంగారెడ్డి, నిర్మల్, భూపాలపల్లి, ఆసీఫాబాద్ జిల్లాల డీఎంఅండ్‌హెచ్‌వో పోస్టుల్లో జూనియర్లే ఉన్నారని ఆగ్రహం వ్యక్తమవుతోంది. ప్రధానంగా వైద్య, ఆరోగ్యశాఖలో కీలకంగా ఉన్న ఓ వ్యక్తి తన అనుచరులను అందలం ఎక్కిస్తున్నారని పలువురు అధికారులు చర్చించుకుంటున్నారు. ఇటీవల చేపట్టిన ముగ్గురు జిల్లా వైద్యాధికారుల బదిలీలపై అనేక అసంతృప్తులు సీనియర్ అధికారుల నుంచి వ్యక్తమవుతున్నాయి. ఇటీవల ప్రభుత్వం మేడ్చల్ జిల్లా డీఎంహెచ్‌వో మల్లికార్జున్‌ను యాదాద్రి భువనగిరి జిల్లాకు బదిలీ చేశారు.. యాదాద్రి భువనగిరి జిల్లా డీఎంహెచ్‌వో సాంబశివరావును హన్మకొండ జిల్లాకు బదిలీ చేశారు. అక్కడ పనిచేస్తున్న లలితాదేవీని బదిలీ చేశారు. అయితే ఈ బదిలీల వెనక రాజకీయ ఒత్తిళ్లు ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.