Tuesday, November 26, 2024

నేను పడ్డ కష్టం ఎవరు పడకూడదు: హరితేజ

క‌రోనా మ‌నుషుల మ‌ధ్య దూరాన్ని కూడా పెంచేసింది. చివ‌రికి క‌న్న బిడ్డ‌ను త‌ల్లి కూడా తాక‌ని పరిస్థితి తీసుకొచ్చింది. సామాన్యులే కాదు సెలెబ్రెటీలు సైతం ఇలాంటి దుర్భర పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. తాజాగా ఇలాంటి దుస్థితినే తానూ ఎదుర్కొన్నానని నటి హరితేజ తెలిపింది. కరోనా సమయంలో గర్భవతిగా ఉన్న తనకు కరోనా పాజిటివ్ వచ్చిందని.. అలాంటి సమయంలో తానొక్కదాన్నే ఒంటరిగా పోరాడానని కన్నీటిపర్యంతమయ్యింది. ఆ సమయంలో తాను అనుభవించిన బాధను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది. డెలివరీ సమయంలో తాను పడిన కష్టాలను వివరిస్తూ ఓ సుదీర్ఘమైన వీడియోని పోస్ట్‌ చేసింది. హ‌రితేజ ఇటీవ‌ల పండంటి ఆడ‌బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చిన విష‌యం తెలిసిందే. అయితే డెలివ‌రీ స‌మ‌యంలో తాను ఎదుర్కొన్న మాన‌సిక సంఘ‌ర్ష‌ణ‌ను ఓ వీడియో రూపంలో ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ చేసింది.

‘పాప పుట్టాక శుభాకాంక్షలు తెలిపిన వారందరికీ థాంక్స్.. పాప పుట్టడానికి వారం ముందు నేను, నా కుటుంబ సభ్యులందరు కరోనా బారిన పడ్డారు.  కరోనా అని తెలిసాక డాక్టర్లు నాకు డెలివరీ చేయమన్నారు. ప్రతిరోజు టెస్టులు, రిపోర్ట్స్ అంటూ ఆసుపత్రుల చుట్టూ తిరుగుతూనే ఉన్నాం. ఒంటరిగా నేనే డెలివరీ కి వెళ్లాను.  నా భర్తకు నెగటివ్‌గా నిర్ధారణ కావడంతో ఆయనే నన్ను ఎంతో జాగ్రత్తగా చూసుకున్నారు. అనంత‌రం నాకు పాప పుట్టింది. పాపకు కరోనా నెగిటివ్ అని తేల‌గానే త‌న‌ను నాకు దూరంగా ఉంచారు. రోజూ వీడియో కాల్‌లో బేబీని చూసేదాన్ని. క‌నీసం పాప‌కు పాలు కూడా ఇవ్వ‌లేక‌పోయాను.. ఆ స‌మ‌యంలో నాకు ఎంతో బాధ అనిపించింది. ఇక చికిత్స త‌ర్వాత నన్ను ఇంటికి పంపించేశారు. త‌ర్వాత దేవుడి ద‌య వ‌ల్ల మా ఇంట్లో వారంద‌రికీ నెగిటివ్ వ‌చ్చింది. ఆ వారం రోజులు నరకాన్ని చూశాను. నేను పడ్డ కష్టం ఎవరు పడకూడదు.. డెలివరీ మహిళలు చాలా జాగ్రత్తగా ఉండండి.. బయట పరిస్థితులు బాలేదు. అందరు జాగ్రత్తగా ఉండండి’ అని హ‌రితేజ భావోద్వేగానికి గురయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement