Tuesday, November 26, 2024

అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన హ‌ర్భ‌జ‌న్ సింగ్‌..

న్యూఢిల్లీ: టీమిండియా వెటరన్‌ స్పిన్నర్‌ హర్భజన్‌సింగ్‌ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. అంతర్జాతీయ క్రికెట్‌లోకి 1998 మార్చిలో 17ఏళ్ల వయసులో అరంగేట్రం చేసిన హర్భజన్‌ ఆస్ట్రేలియాపై తన తొలి మ్యాచ్‌ ఆడాడు. హాఫ్‌స్పిన్నర్‌ భజ్జీ చివరిసారిగా 2016లో అంతర్జాతీయ మ్యాచ్‌ను ఆడాడు. అప్పటినుంచి మళ్లిd జాతీయజట్టులో హర్భజన్‌కు చోటు లభించలేదు. ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌కింగ్స్‌, కోల్‌కతా నైట్‌రైడర్స్‌, ముంబై ఇండియన్స్‌ తరఫున ఆడాడు. రిటైర్‌మెంట్‌ విషయాన్ని భజ్జీ టిటర్‌ వేదికగా తెలుపుతూ ఓ వీడియోను యూట్యూబ్‌లో షేర్‌ చేశాడు. 23ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం మధుర జ్ఞాపకంగా మారడానికి కృషి చేసిన అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ టీట్‌ చేశాడు.

కాగా హర్భజన్‌సింగ్‌ భారత్‌ తరఫున 103టెస్టులు, 236వన్డేలు, 28టీ20లకు ప్రాతినిధ్యం వహించాడు. 103 టెస్టుల్లో 417 వికెట్లు, 236వన్డేల్లో 269వికెట్లు, 28టీ20ల్లో 25వికెట్లు తీశాడు. అన్ని ఫార్మాట్లలో కలిపి 3,500పరుగులు చేశాడు. టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్లలో హర్భజన్‌సింగ్‌ నాలుగోస్థానంలో ఉన్నాడు. ధోనీ సారథ్యంలో 2007 టీ20 ప్రపంచకప్‌, 2011 వన్డే ప్రపంచకప్‌ భారత్‌ గెలుచుకోవడంలో హర్భజన్‌సింగ్‌ కీలకపాత్ర పోషించాడు. 2001లో టెస్టుల్లో భారత్‌ తరఫున భజ్జీ తొలిసారి హ్యాట్రిక్‌ నమోదు చేశాడు. 2001లో ఆసీస్‌పై టెస్టుసిరీస్‌ గెలుపులో హర్భజన్‌ కీలకంగా వ్యవహరించాడు. ఆ సిరీస్‌లో 32వికెట్లు భజ్జీ పడగొట్టాడు. కోల్‌కతాలోని ఈడెన్‌గార్డెన్స్‌లో రెండోటెస్టులో హ్యాట్రిక్‌ సాధించాడు. భారత బౌలర్‌ సుదీర్ఘ ఫార్మాట్‌లో హ్యాట్రిక్‌ సాధించడం అదే తొలిసారి కావడం విశేషం. ఐపీఎల్‌లో 163మ్యాచ్‌లు ఆడిన భజ్జీ 150వికెట్లు తీశాడు. కోల్‌కతా నైట్‌రైడర్స్‌ తరఫున చివరిసారి ఐపీఎల్‌లో ఆడిన భజ్జీ 150వికెట్లతో ఐపీఎల్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో ఐదోస్థానంలో ఉన్నాడు.

మంకీ గేట్‌ వివాదంలో భజ్జీకి అండగా నిలిచిన టీమిండియా..
ఆస్ట్రేలియా పర్యటనలో చోటు చేసుకున్న మంకీ గేట్‌ వివాదం హర్బజన్‌ కెరీర్‌లో కీలకపాత్ర పోషించింది. సచిన్‌ అండగా నిలవడంతో ఆ వివాదం సద్దుమణిగింది. 2007-08 భారతజట్టు ఆస్ట్రేలియాలో పర్యటించింది. సిడ్నీ వేదికగా జరిగిన రెండో టెస్టుల్లో ఆసీస్‌ ఆల్‌రౌండర్‌ ఆండ్రూ సైమండ్స్‌ను భజ్జీ మంకీ అని జాతివివక్ష వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. హర్భజన్‌ తనను మంకీతో పోల్చినట్లు సైమండ్స్‌ ఫిర్యాదు చేశాడు. క్రమశిక్షణ చర్యగా భజ్జీ మ్యాచ్‌ఫీజులో కోతతోపాటు అతడిపై నిషేధం కూడా విధించారు. అయితే నిషేధాన్ని ఎత్తివేయకపోతే టూర్‌ను రద్దు చేసుకుంటామని టీమిండియా అల్టిమేటం జారీ చేయడంతో క్రికెట్‌ ఆస్ట్రేలియా వెనక్కి తగ్గింది.

స్లెడ్జింగ్‌ను తిప్పికొట్టే క్రమంలో మాకీ అంటే సైమండ్స్‌ మంకీగా భావించాడని ఆ తర్వాత భజ్జీ వివరించాడు. కాగా ఐపీఎల్‌ అరంగేట్ర సీజన్‌లో ముంబై ఇండియన్స్‌-కింగ్స్‌లెవన్‌ పంజాబ్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో హర్భజన్‌ ఆగ్రహంతో శ్రీశాంత్‌ను చెంపదెబ్బ కొట్టడంతో వివిదాస్పదమైంది. భజ్జీ ఆ టోర్నీ మొత్తం నిషేధాన్ని ఎదుర్కొన్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో రాణించి యువ క్రికెటర్లకు ఆదర్శంగా నిలిచిన భజ్జీకి మాజీ క్రికెటర్లు సచిన్‌ టెండూల్కర్‌, వీవీఎస్‌ లక్ష్మణ్‌, శ్రీశాంత్‌, వీరేంద్ర సెహాగ్‌, సురేశ్‌రైనా, శిఖర్‌ ధావన్‌, కుల్దిdప్‌యాదవ్‌, ఉమేశ్‌ యాదవ్‌ తదితరులు టిటర్‌ వేదికగా అభినందనలు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement