Tuesday, November 26, 2024

హర్​ ఘర్​ తిరంగా, ఇదేం తిరకాసురా బాబూ.. రైల్వే ఉద్యోగుల వేతనాల్లోంచి జెండా ఖర్చుల కోత!

భారతదేశం 75వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఈ ఆగస్టు 15 జరుపుకుంటుంది. ఈ సందర్భంగా భారత ప్రభుత్వం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌ను నిర్వహిస్తోంది. ఇది విదేశీ పాలన నుండి భారతదేశం స్వాతంత్ర్యం పొందిన 75 సంవత్సరాల వేడుకలను సూచిస్తుంది. ఇందులో భాగంగా ‘హర్ ఘర్ తిరంగ’ ప్రచారాన్ని కేంద్ర ప్రభుత్వం చేపట్టింది. ఈ సంవత్సరం స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా దీన్ని నిర్వహిస్తున్నారు.

అయితే.. ‘హర్ ఘర్ తిరంగ’ ప్రచారం కింద రైల్వే సంస్థ తమ ఉద్యోగులందరికీ ఓ త్రివర్ణ పతాకాన్ని అందిస్తోంది. దీనికి గాను వారి జీతాల నుండి ఆ జెండా ఖర్చును రికవరీ చేయనున్నట్టు ఆదేశాలు వెలువరించడం ఇప్పుడు ఉద్యోగుల్లో ఆందోళనరేకెత్తిస్తోంది. రైల్వే ఉద్యోగుల జీతం నుంచి ఒక్కో జెండాకు రూ.38 చొప్పున కోత విధించనున్నట్టు ఉన్నతాధికారుల ద్వారా తెలుస్తోంది. అయితే.. రైల్వే ఉద్యోగుల సంఘం దీన్నీ తీవ్రంగా వ్యతిరేకించింది. రైల్వే ఉద్యోగులకు ప్రైవేట్ ఏజెన్సీ ద్వారా అందించే జాతీయే జెండా ఖరీదును రూ. 38గా నిర్ణయించారు. వారు ముందుగా నగదు చెల్లించి ఈ త్రివర్ణ పతాకాన్ని కొనుగోలు చేయనవసరం లేదు. ఈ డబ్బు వారి జీతాల నుండి మినహాయించబడుతుంది అని ఓ అధికారి తెలిపారు.

కాగా, దీనిపై నార్త్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ యూనియన్ తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. డివిజనల్ మంత్రి చందన్ సింగ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ జెండా ఉద్యోగుల ప్రయోజన నిధి నుండి సిబ్బందికి అందిస్తారు. తర్వాత వారి జీతాల నుండి ఆ మొత్తాన్ని ఉద్యోగుల ప్రయోజన నిధికి బదిలీ చేస్తారు. అందుచేత జీతం నుండి డబ్బు కట్ చేయాల్సిన అవసరం లేదు” అన్నారు. కానీ, రైల్వే CPRO శివం శర్మ తెలిపిన వివరాల ప్రకారం “రైల్వే ఉద్యోగులకు అందించే జెండా కోసం రైల్వే ఉద్యోగుల జీతాల నుండి రూ.38 మినహాయించుకుంటున్నట్టు పేర్కొంటూ ఉత్తర్వులు జారీ చేయబడ్డాయి.”

ఇక.. బీజేపీ కార్యాలయంలో రూ.20కి లభించే సేమ్​ టు సేమ్​ ఇట్లాంటి జెండాలకు హెడ్ పోస్టాఫీసులో రూ.25కి కొనుగోలు చేస్తుండగా.. స్వయం సహాయక సంఘాలు మాత్రం రూ.20కే అమ్ముతున్నాయి. మరి రైల్వే ఉద్యోగులకు అదే జెండాను రూ.38 రూపాయలకు ఎందుకు అమ్ముతున్నారనే దానిపై చాలామంది అసహనం వ్యక్తం చేస్తున్నారు. కాగా, జెండాలు కొనుగోలు చేయడానికి ప్రజల్లో తీవ్ర పోటీ నెలకొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement