దేవుళ్లందరికి ప్రథమ నాయకుడు వినాయకుడు. ఆ గణపతిని పూజించని , వేడుకోని భక్తులుండరు. ఆయన లేనిది ఏ కార్యమూ జరగదు.అంతటి దేవదేవున్ని మనము కొలిచేటప్పుడు చాలా పేర్లతో ఆయనను పూజిస్తాము…మరి ఆ పేర్లేంటో ,వాటి వెనక ఉన్న అర్థం మేంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడండి….
వినాయకుడు సకల దేవతాగణాలకు అధిపతి. అన్ని అడ్డంకులు తోలగించే విఘ్నరాజు. అన్ని కార్యములకూ, పూజలకూ ప్రథమంగా పూజలందుకునేవాడు వినాయకుడు. అందుకే మొదట ఏ పూజైనా ఈ శ్లోకంతో ప్రారంభమవుతుంది…
ఓం శుక్లాంభరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం
ప్రసన్నవదనం ధ్యాయెత్ సర్వవిఘ్నోప శాంతయే…….విజయానికి ,చదువుకూ ,జ్ఞానానికి దిక్కైన దేవుడు ఈ గణనాథుడు.తెలుగు వారి పండుగలలో వినాయకుచవితి ముఖ్యమైన పండుగ.
భక్తుడు ఏ పూజ చేయదలుచుకున్నా మొదట పూజించేది, స్మరించుకునేది గణేశుడినే అని అందరికీ తెలిసిన విషయమే. చూడ్డానికి పూర్ణకుంభంలాంటి దేహం,బాన కడుపు,తొండం ఉంటుంది ఈ దేవుడికి …ఇవి పరిపూర్ణమైన ఈ జగత్తుకు గుర్తు.ఏనుగుతల,సన్నని కళ్లు మేధస్సుకు సంకేతాలు.వక్రతుండము ఓంకార ప్రణవనాదానికి ప్రతీకలు. ఏనుగు లాంటి ఆకారాన్ని మోస్తున్నది ఓ చిన్ని ఎలుక . ఇది వినాయకుడి వాహనం. నాలుగు చేతులు మానవాతీత సామర్థ్యాలకు , తత్త్వానికి సంకేతాలు. ఇలా ప్రతిది ఓ విశేషమే….
వినాయక చవితి వొచ్చిందంటే భక్తులకు పెద్ద పండుగే. భాద్రపద మాసమున చవితి రోజున గణపతిని కొలవని భక్తుడుండదు…అంతెందుకండి ఏ కార్యం అయినా సవ్యంగా జరగాలన్నా ఈయనను పూజించిన తర్వాతే. మరి అంతటి ఈ అగ్రదేవున్ని పూజించేటప్పడు వినాయకుడు , విఘ్నేశ్వరుడు , లంబోదరుడు ,గణపతి , ఏక దంతుడు ,వక్రతుండుడు, మూషిక వాహనుడు , గజనానుడు ,ధూమకేతువు లాంటి వివిధ రకాల పేర్లతో పూజిస్తాము..ఇవన్నీ బొజ్జగణపయ్యను ముద్దుగా పిలుచుకునే పేర్లు.
వినాయకుడు మనకున్న దేవుళ్లలో అయోనిజుడు…పార్వతి రూపుదిద్దిన పిండి బొమ్మ……ఈయన జన్మం సహజ ప్రక్రియలో జరగలేదు. ఈయన ఆవిర్భావం కోసం దేవతల అభ్యర్థనలే తప్ప యజ్ఞయాగాలు జరిగిన దాఖలాలు అస్సలు లేవు . పార్వతి చేతిలో ప్రాణం పోసుకున్న పిల్లవాడిని లోకం పార్వతీసుతుడని పిలిచింది.. శివుని చేతిలో మరణం పొంది తిరిగి ఏనుగు తలతో ప్రాణం పోసుకుని గజాననుడు అయ్యాడు.పెద్ద పొట్ట ఉన్నందున లంబోదరుడయ్యాడు.విఘ్నాలను ఎదిరించి విఘ్ననాయకుడయ్యాడు..ఆయననే నేడు మనం వినాయకుడిగా పిలుచుకుంటున్నాము. దేవతలందరిలోనూ విశ్వవ్యాప్తమైన విలక్షణ స్వరూపం గణపతిది.మనం మనసు పెట్టి ప్రార్థించాలేగానీ వెంటనే కోరిన కోర్కెలను ప్రసాదించే భక్తసులభుడు ఈ బొజ్జ గణపయ్య.
ఏ దేవున్ని కొలవాలన్నా ముందు గణపతిని పూజించడం ఆనవాయితీ . గణపతి అంటే ఏ గణానికైనా అతడే పతి. జగత్తు అంతా గణ మయమే ! అనేక గణాలు కలిస్తేనే విశ్వమేర్పడుతుంది. గ’అనే అక్షరంనుంచే మనోవాణీయమైన జగత్తు జన్మించింది. కరచరణాద్యనయన విన్యాసం నుండి మొదలుకుని, ఎలాంటి శబ్దమయమైందయినా అంటే భాష భాషాత్మకమైన జగత్తు అంతా ‘గ’శబ్ద వాచ్యంమే. ఇది సగుణానికి సంకేతం. ఇక. ‘ణ’కారం మనసుకు, మాటలకు అందని పరతత్త్వానికి గుర్తు. ఇది నిర్గుణ సంకేతమన్నమాట! సగుణంగా, నిర్గుణంగా భాసించే ఈశుడే ‘గణేశుడు. అతడే ‘గణపతి’.
కార్తవీర్యుని వధించిన పరుశురాముడు శివుని దర్శనానికై కైలాసం వెళ్ళాడు. ఆ సమయంతో శివపార్వతులు ఏకాంతంలో ఉంటారు. బయట కాపలా కాస్తున్న గణపతి పరశురాముడికి అడ్డుపడతాడు. ఇద్దరి మధ్యా మాటా మాటా పెరిగి యుద్ధానికి దారితీస్తుంది. గణపతి తన తొండంతో పరుశురామున్ని పడేస్తాడు. ఆగ్రహించిన పరుశురాముడు గ్రండ గొడ్డలిని ప్రయోగించడంతో ఒక దంతం విరిగిపడుతుంది. ఆ చప్పుడుకు ఉలిక్కిపడిన పార్వతీ పరమేశ్వరులు నెత్తురోడుతున్న బాల గణపతిని చూసి పరశురామున్ని మందలిస్తారు. జరిగిన అపరాధాన్ని మన్నింపమని పరశురాముడు వేడుకుంటాడు. అంతటితో కథ సమాప్తమైనా.. గణపతి మాత్రం ఒక దంతం పోగొట్టుకొని ఏకదంతుడిగా పిలవబడుతున్నాడు.
విఘ్నేశ్వరుడంటే విఘ్నాలకు ఆధిపతి. ‘వి’ అంటే ‘విఘ్నం’ కాబట్టి ఆయన విఘ్న గణాలను తన ఆధీనంలో ఉంచుకొని భక్తులకు ఆ విఘ్నాలను తొలగించి శుభాలను ప్రసాదిస్తూ ఉంటాడు. క్రౌంచుడనే గంధర్వుడు సౌభరి భార్యయైన మనోమయిని ఎత్తుకెళ్తాడు. ఆ సమయంలో ఆశ్రమంలోని క్రౌంచున్ని పట్టుకుని గురువుకు అప్పగించారు. గురు పత్నిని తల్లిలా భావించక, కామాంధకారంతో ప్రవర్తించిన క్రౌంచున్ని గణముఖంతో నిశాచరుడవెై బ్రతుకును వెళ్ళదీయమని శపిస్తాడు. అప్పటికీ సౌహరి మహర్షి కోపం చల్లారక పోవడంతో రాక్షస జన్మ నుంచి విముక్తి పొందినప్పటికీ ఎలుకవలె మిగతా జన్మలను వెళ్లదీయమని శపించాడు. గణముఖ రూపునిగా మారిన క్రౌంచుడు, శివుని ప్రార్థించి అనేక వరాలను పొంది, దేవతలను బాధించసాగాడు. క్రౌంచుని ఆగడాలను తట్టుకోలేని దేవతలు విఘ్ననాయకుని దగ్గర మొరపెట్టుకోవడంతో గణముఖుని సంహరించాడు. అయినప్పటికీ గణముఖుని రూపం నుంచి విముక్తి పొందిన క్రౌంచుడు, సౌభరి మహర్షి మరో శాపం ప్రకారం, ఎలుకగా మారి, వినాయకుని శరణు వేడి, ఆయన వాహనంగా స్వామి సేవను చేసుకుని, తన జీవితాన్ని ధన్యం చేసుకున్నాడు. అణిగిమణిగి ఉండటమే అత్యుత్తమం అన్న విషయాన్ని వినాయకుని మూషికవాహనం మనకు తేటతెల్లం చేస్తోంది.అందుకే మూషికవాహనుడని వినాయకున్ని పిలుస్తాము.
గణపతిని వేడుకుంటే తీరని కోరిక లేదు..ఆరోగ్యం ,అభయం,విజయం ,సంతోషం,సంపద,దైర్ఘ్యం, అన్నింటిని ప్రసాదించే స్వామి ఈ గణపయ్య . ఏదైనా పాపాలు కానీ తప్పులు కానీ చేస్తే క్షమించమని మిగతా దేవతల ముందు కోరుకుంటారు కానీ వినాయకుని ముందు మాత్రం గుంజీలు తీస్తాం…ఇలా ప్రతిదీ ప్రత్యేకత కలిగిన దేవుడు ,అధినాయకుడు వినాయకుడు. భక్తితో గణపతిని పూజించి అష్టైశ్వర్యాలు పొందుదాం…ఆ దేవదేవుని అనుగ్రహం కోసం జరుపుకునే పర్వదినాన అందరికి వినాయక చతుర్థీ శుభాకాంక్షలు.