Tuesday, November 26, 2024

Big Story: సీతారాముల కల్యాణంతో శుభ ఘడియలు- నేటినుంచి పెళ్లి ముహూర్తాలు షురూ

శ్రీరామ నవమి సీతా రాముల కళ్యాణంతో రాష్ట్రంలో పెళ్లిళ్ల సీజన్‌ మొదలైంది. నేటినుంచి మే 25వరకు రాష్ట్రంలో భారీగా మంచి ముహూర్తాలతో పెళ్లిళ్లు జరగనున్నాయి. 2020, 2021లలో కరోనా కారణంగా వెలవెలబోయిన కళ్యాణ మండపాలు, పెళ్లి వేడుకలు రెండేళ్ల తర్వాత అట్టహాసంగా అంబరాలనంటేలా రాష్ట్రమంతటా జరగనున్నాయి. ఆంక్షలు లేకపోవడంతో ఈ వివాహాలు కరోనాకు పూర్వం వలె కొత్త కళతో అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు వధూవరుల బంధుమిత్రులు ఉవవ్విళ్లూరుతున్నారు.

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: చైత్ర, వైశాఖ మాసాల్లో వచ్చే బలమైన ముహూర్‌ల నేపథ్యంలో రాష్ట్రంలో లక్షలాది వివాహాలు జరగనున్నాయి. సాధారణంగా ఎండాకాలంలో పెళ్లిళ్లకు విపరీత డిమాండ్‌ ఉంటుంది. తాజాగా రెండేళ్ల తర్వాత కరోనా ప్రభావం పూర్తిగా తగ్గిపోవడం, ఆంక్షలు ఎత్తివేసిన నేపథ్యంలో అప్పుడు వాయిదా పడిన వివాహాలు కూడా ఈ సీజన్‌లో ఘనంగా జరుపుకునేందుకు పలువురు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఏప్రిల్‌, మే నెలల్లో లక్షకుపైగా వివాహాలు జరిగేందుకు రాష్ట్రం ముస్తాబవుతున్నది. మే 25వరకు దివ్యమైన ముహూర్తాలున్నాయని వేదపండితులు అంటున్నారు. ఆ తర్వాత జూన్‌లో కూడా స్వల్ప ముహూర్తాలున్నాయని, కానీ అవి తక్కువగా ఉన్నాయని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఏప్రిల్‌, మే నెలల్లోని ముహూర్తాలకు ఇప్పటినుంచి ఫంక్షన్‌ హాళ్లు, రిసార్టులు, కళ్యాణ మండపాలు, కమ్యూనిటీ హాళ్లను బుక్‌ చేసుకుంటున్నారు. డిమాండ్‌ తీవ్రం కావడంతో ఒకే రోజు ఉదయం ఒకటి, సాయంత్రం ఒకటి చొప్పున వివాహాలకు ఫంక్షన్‌ హాళ్ల యాజమాన్యాలు సమయం నిర్దేశించి బుకింగ్‌లు చేసుకుంటున్నాయి. పురోహితులకు కూడా చేతినిండా పనిదొరికి ఒక్కో రోజు రెండు బుకింగ్‌లు చేసుకుంటున్నారని పలువురు తెలిపారు. గతంలో నష్టపోయిన ఫోటోగ్రాఫర్‌లు, మేకప్‌ ఆర్టిస్టులు, లైటింగ్‌, డెకరేషన్‌, క్యాటరింగ్‌ నిర్వాహకులు ఈ దఫా బుకింగ్‌లతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

దివ్యమైన మహూర్తాలతో రాష్ట్రంలో పెండ్లి సందడి మొదలైంది. గత రెండేళ్లుగా అనువైన పరిస్థితులు లేక శుభగడియల కోసం వేచిచూసిన తెలుగు ప్రజలు ఈ రెండు నెలల్లో వస్తున్న శుభ ముహూర్తాలను సద్వినియోగం చేసుకుంటున్నారు. శ్రీరామ నవమి తర్వాత నుంచి ఆరంభమైన శుభముహూర్తాలతో పెళ్ళిళ్ళతో ఎక్కడ చూసినా రాష్ట్రంలో కనువిందైన వాతావరణం నెలకొంటోంది. ఆదివారం ఒక్కరోజే వేలల్లో పెళ్ళిళ్ళు జరగనున్నాయి. లక్షల్లో లగ్నాలతో ఇరు తెలుగు రాష్ట్రాలు పండగ శోభతో అలరారేందుకు ముస్తాబయ్యాయి. ఇప్పటికే సంబంధం కుదుర్చుకున్న జంటలకు ఈ రెండు నెలల్లో వచ్చే ముహూర్తాల్లో ముచ్చటగా మూడుముళ్లు వేయించాలని పెద్దలు తొందరపడుతున్నారని వారంటున్నారు. శనివారం మొదలైన సందడి రెండో రోజు ఆదివారం గ్రాండ్‌గా కొనసాగనుంది. రాష్ట్రంలో ఆదివారంనాడు వేలాది పెళ్లిళ్లు జరిగేందుకు హోటళ్లు, కళ్యాణమండపాలు ముస్తాబయ్యాయి. ఆషాఢం వచ్చేలోపు ఉన్న పది ముహూర్తాల్లో పెళ్లిళ్లు చేసి తమ పని పూర్తిచేసుకోవాలని చూస్తున్న వధూవరుల తల్లిదండ్రులకు హోటళ్లు, మండపాలు, వాయిద్యాలు, వంటవాళ్లు, షామియానాల వంటి సమస్యలు ఎదురవుతున్నాయి.

ఏప్రిల్‌, మే, జూన్‌, జులై నెలల్లో పెళ్లిళ్లూ, శుభ కార్యాలకు ముహూర్తాలు సమీపించడంతో నేటినుంచి నుంచి 15వరకు వరకు శుభకార్యాలు, పెళ్ళిళ్ళతో రాష్ట్రం సందడిగా మారింది. ఈ ఏడాది పెళ్లిళ్లు ఖరీదుకు ఆనవాళ్లుగా మారాయి. కేటరింగ్‌నుంచి మొదలుపెడితే అలంకారం, డెకరేషన్‌ వరకు అంతా ఖరీదైన వ్యయంగా మారింది. ధరలు పెరగడం, డిమాండ్‌ ఎక్కువ కావడంతో సహజంగానే కొరత నెలకొంది. ఏర్పాట్ల ఖర్చు కూడా విపరీతంగా పెరిగింది. కళ్యాణ మండపాలకు భారీ డిమాండ్‌ ఏర్పడింది. ఒక రోజు అద్దె కనీసంగా రూ.50వేలనుంచి రూ. 1కోటి వరకు పలుకుతోంది. వీటికి అదనంగా విద్యుత్‌ బిల్లు. క్లీనింగ్‌ చార్జీలు, లేబర్‌ చార్జీలు వసూలు చేస్తుండటంతో సామాన్యులకు ఖర్చులు పెరిగాయి. వీటికితోడు పెళ్లి పందిరి, సౌండ్‌ సిస్టం, ఫోటోలు, భాజా భజంత్రీలు, ఇతర ఏర్పాట్లకు అదనంగా వెచ్చించాల్సి వస్తోంది. విందు భోజనాలకు అవసరమైన స్వీట్లు, కూరగాయలు, నాన్‌ వెజ్‌కు కూడా భారీగా ధరలు పెరిగాయి. మధ్య తరగతి మొదలు ఉన్నత వర్గాలవాళ్లంతా విందుకు భారీగా ఖర్చు చేయడం రివాజుగా మారింది. అయితే కేటరింగ్‌కు ఆర్డర్‌ ఇచ్చేవారి సంఖ్య భారీగా పెరగడంతో ధరలకు రెక్కలు వచ్చాయి. పనిలోపనిగా లక్షలాది పెళ్ళిళ్లకు ఒకేసారి డిమాండ్‌ పెరగడంతో పురోహితులకు విపరీత డిమాండ్‌ వచ్చి పడింది. కొందరికి పురోహితులు దొరక్కపోవడంతో ఆన్‌లైన్‌లో పురోహితులకు సెర్చ్‌ చేసి ఆర్డర్లు చేస్తున్నారని చెబుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement