రామ్‌చరణ్.. మెగాస్టార్ తనయుడిగా ఇండస్ట్రీలోకి వచ్చేసిరికి అతడి పేరు ఇదే. తొలి సినిమా ‘చిరుత’లో ఫైట్లు, డ్యాన్సులు బాగానే చేసినా అతడిలో నటన ఇంకా మెరుగుపడాలి అన్న అభిప్రాయాలు వినిపించాయి. కానీ రెండో సినిమానే దర్శక ధీరుడు రాజమౌళితో. అది కూడా ఫాంటసీ మూవీ ‘మగధీర’. ఈ సినిమా రామ్‌చరణ్‌కు స్టార్ డమ్‌ను తెచ్చిపెట్టడమే కాకుండా మెగా పవర్‌స్టార్ అనే బిరుదును కూడా సాధించిపెట్టింది. ‘ఆరెంజ్’ నిరాశపరిచినా అందులో చరణ్ చాలా స్టైలిష్‌గా, అందంగా కనిపిస్తాడు. రొమాంటిక్ హీరోలకు తానూ ఏ మాత్రం తక్కువ కాదని నిరూపించాడు.
నాయక్, రచ్చ, ఎవడు సినిమాలతో తనకంటూ ఓ రూట్‌ను ఏర్పరుచుకున్నాడు. తర్వాత ‘గోవిందుడు అందరివాడేలే’ అనిపించుకున్నాడు. ‘ధృవ’ లాంటి సినిమాతో కథా ప్రాధాన్యమున్న చిత్రాలలో నటించి మెప్పించాడు. ‘రంగస్థలం’ అయితే నటనలో విశ్వరూపం చూపించాడు. చెవిటివాడి పాత్రలో అద్భుతంగా నటించి సూపర్ డూపర్ హిట్ కొట్టాడు. ఇక త్వరలోనే RRRలో ‘సీతారామరాజు’గా మరోసారి తన నటనలో వైవిధ్యం చూపడానికి సిద్ధమవుతున్నాడు. అభిమానులు ముద్దుగా పిలుచుకునే ‘చెర్రీ’ జీవితంలో మరెన్నో సూపర్ డూపర్ హిట్లు సాధించాలని కోరుకుంటూ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతోంది మీ ‘ప్రభా న్యూస్’డిజిటల్ టీమ్.