Wednesday, November 20, 2024

హంద్రీనీవా పనులు ఆపాలే.. కేఆర్​ఎంబీకి తెలంగాణ వినతి

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: హంద్రీనీవా ప్రాజెక్టు విస్తరణ పనులను ఆపేలా ఆంధ్రప్రదేశ్‌ను ఆదేశించాలని కృష్ణానదీ యాజమాన్యబోర్డును తెలంగాణ కోరింది. ఆ ప్రాజెక్టుద్వారా కృష్ణా బేసిన్‌ అవతలి ప్రాంతానికి నీటిని తరలిస్తున్నారని గుర్తు చేసింది. మరోవైపు శ్రీశైలం నుంచి ఏపీ 34 టీఎంసీల కంటే ఎక్కువ నీటిని తోడకుండా ఆపాలని ఇప్పటికే పలుమార్లు తాము బోర్డును కోరామని… అయినప్పటికీ చెన్నై తాగునీటి పథకం కోసం 15 టీఎంసీలను, మరో 19 టీఎంసీలను ఎస్‌ఆర్‌బీసీ ద్వారా తరలించుకుపోయిందని తెలంగాణ ఈఎన్‌సీ మురళీధర్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. హంద్రీనీవా ప్రాజెక్టు పనులను ఆపాలని గురువారం కేఆర్‌ఎంబీకి లేఖ రాశారు. ఈ పరిస్థితుల్లో బనకచర్ల క్రాస్‌ రెగ్యులేటర్‌ నుంచి కృష్ణా నీటిని కేసీ కెనాల్‌కు మళ్లించి హంద్రీ నీవా ఎస్కేప్‌ ఛానల్‌ ద్వారా తరలించే ఏపీ ప్రయత్నాలను అడ్డుకోవాలని కోరారు. ఇలా చేయటం ఉమ్మడి రాష్ట్ర విభజన చట్టానికి వ్యతిరేకమని లేఖలో గుర్తు చేశారు.

మరోవైపు… గురువారం జరిగిన కేఆర్‌ఎంబీ త్రిసభ్య కమిటీ సమావేశంలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య నీటి కేటాయింపులపై చర్చ జరిగింది. శ్రీశైలం రిజర్వాయర్‌లో ఇరు రాష్ట్రాలు నిబంధనలకు విరుద్ధంగా నీటిని తోడాయని బోర్డు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. ప్రస్తుతం రిజర్వాయర్‌లో నీటి మట్టం డెడ్‌ స్టోరేజీకి చేరువలో ఉందని, ఈ దశలోనూ నీటి తోడే ప్రయత్నాలను విరమించుకోవాలని స్పష్టం చేసినట్లు సమాచారం. నీటి కొరతను దృష్టిలో ఉంచుకొని శ్రీశైలం జలాశయం నుంచి విద్యుత్‌ ఉత్పత్తి కోసం నీటిని వినియోగించుకోవద్దని కేఆర్‌ఎంబీ ఫిబ్రవరిలోనూ సూచించిన విషయం తెలిసిందే. మొత్తంగా శ్రీశైలం రిజర్వాయర్‌ నుంచి విద్యుత్‌ అవసరాల కోసం నీటి తరలింపుపై సమావేశంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలిసింది. మరోవైపు నాగార్జునసాగర్‌ నుంచి నీటి వినియోగంపై కూడా బోర్డులో చర్చ జరిగినట్లు సమాచారం. యాసంగి పంట నీటి అవసరాల కోసం తెలంగాణ 90టీఎంసీలు, ఏపీ 80 టీఎంసీలు వినియోగించుకోవాలని బోర్డు సూచించినట్లు తెలిసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement