హైదరాబాద్, ఆంధ్రప్రభ: శాసనమండలి ఛైర్మన్‌గా గుత్తా సుఖేందర్‌రెడ్డి ఏకీగ్రవంగా ఎన్నికయ్యారు. మండలి ఛైర్మన్ పదవికి ఆయన ఆదివారం నామినేషన్ దాఖలు చేశారు. టీఆర్‌ఎస్ అభ్యర్థిగా ఆయన ఒక్కరే నామినేషన్ దాఖలు చేసినట్లు శాసనమండలి కార్యదర్శి నర్సింహ్మాచార్యులు ప్రకటించడంతో గుత్తా ఎన్నిక ఏకగ్రీవమైంది. సోమవారంనాడు అధికారికంగా ప్రకటన వెలువడనుంది. ఆదివారం ఉదయం నామినేషన్ దాఖలు చేసిన తర్వాత అసెంబ్లి మీడియా పాయింట్‌లో సుఖేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. రెండవసారి మండలి చైర్మన్‌గా అవకాశం కల్పించిన సిఎం కేసీఆర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తన ఏకగ్రీవ ఎంపికకు సహకరించిన అన్ని పార్టీల సభ్యులకు ఈ సందర్భంగా ఆయన ధన్యవాదాలు తెలిపారు. గతంలో మాదిరిగానే మండలిని హుందాగా నడిపేందుకు కృషి చేస్తానని తెలిపారు. సభా నిర్వహణలో ధర్మబద్ధంగా వ్యవహరిస్తానని ఆయన చెప్పారు. తాను ఏ స్థాయిలో ఉన్నప్పటికీ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రతి రాష్ట్రంలో అసెంబ్లిdతోపాటు శాసనమండలి ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ఉమ్మడి ఏపీలో అప్పటి సీఎం వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి శాసనమండలిని పునరుద్దరించగా, ప్రస్తుత సీఎం కేసీఆర్ బలోపేతం చేశారన్నారు.
గుత్తా సుఖేందర్ రెడ్డి ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా రెండోసారి ఎన్నికయ్యారు. అంతకుముందు ఆయన నల్గొండ పార్లమెంట్ నుంచి మూడుసార్లు ఎంపీగా పనిచేశారు. మండలి చైర్మన్ పదవి ఎన్నికకు సంబంధించి శనివారం షెడ్యూల్ విడుదలైన విషయం తెలిసిందే. 2019 సెప్టెంబర్ 11న తొలిసారిగా ఆయన మండలి చైర్మన్‌గా బాధ్యతలు స్పీకరించారు. 2021 జూన్ మొదటి వారం వరకు ఆయన ఆ బాధ్యతల్లో కొనసాగారు. మండలి చైర్మన్ ఎన్నికకు శాసనమండలి కార్యదర్శి శనివారం నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిందే. షెడ్యూల్ ప్రకారం ఆదివారం నామినేషన్లు ముగియడంతో సోమవారం ఎన్నిక జరగాల్సి వుంది. అయితే చైర్మన్ పదవికి ఒకే నామినేషన్ రావడంతో గుత్తా సుఖేందర్ రెడ్డి ఎంపిక లాంఛనప్రాయం కానుంది. చైర్మన్‌గా గుత్తా ఎంపికను సోమవారం శాసనసభ కార్యదర్శి అధికారికంగా ప్రకటించనున్నారు. ఆ తర్వాత వైస్ చైర్మన్ ఎన్నికతో పాటు ఖాళీగా ఉన్న నాలుగు విప్ పదవులను కూడా భర్తీ చేయనున్నారు. మంగళవారంతో ఉభయ సభల బడ్జెట్ సమావేశాలు ముగియనున్నాయి. మండలి చైర్మన్‌గా గుత్తా సుఖేందర్ రెడ్డి ఏకగ్రీవ ఎంపికతో టీఆర్‌ఎస్ పార్టీ శ్రేణులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హర్షం వ్యక్తం చేశారు. ఆయన నామినేషన్ అనంతరం పలువురు అధికార పార్టీ నేతలు, కార్యకర్తలు గుత్తాను కలిశారు. నేడు షెడ్యూల్ ప్రకారం ఆయన ఎంపికను అధికారికంగా ప్రకటించనున్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..