తెలంగాణ సీఎం కేసీఆర్ యూపీ నుంచి ఇవ్వాల (మంగళవారం) సాయంత్రం ఢిల్లీ చేరుకున్నారు. సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ అంత్యక్రియలకు హాజరైన కేసీఆర్ అంతిమసంస్కారాలు ముగిసిన తర్వాత అటు నుంచి అటే ఢిల్లీ వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన ఈమధ్యనే ఢిల్లీలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ఆఫీసును పరిశీలించారు. ఇంతకుముందే ఢిల్లీలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి.
ఈ భవన నిర్మాణం పూర్తి అయ్యే దాకా కొత్తగా ప్రకటించిన బీఆర్ఎస్ కార్యాలయం కోసం సర్దార్ పటేల్ మార్గ్‌లోని ఓ భవనాన్ని రెంట్‌కు తీసుకున్నారు. బీఆర్ఎస్ ప్రకటన రోజే ఈ భవనానికి బీఆర్ఎస్ రంగులు అద్దారు. టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్గా మార్చిన తర్వాత కేసీఆర్ ఢిల్లీకి రావడం ఇదే తొలిసారి. ఈ పర్యటనలో బీఆర్ఎస్ తాత్కాలిక కార్యాలయంలో ఆయన పలు పార్టీలకు చెందిన నేతలతో పాటు మేథావులతోనూ చర్చలు జరపనున్నట్లు సమాచారం. అయితే ఈ టూర్లో కేసీఆర్ ఎవరెవరిని కలుస్తారన్న విషయంపై మాత్రం స్పష్టత లేదు.