గుజరాత్ అల్లర్ల కేసు మరో ట్విస్ట్ బయటికి వచ్చింది. ఈమధ్య సుప్రీం కోర్టు అప్పటి గుజరాత్ సీఎం నరేంద్ర మోదీకి క్లీట్ చీట్ ఇవ్వగా.. ఇప్పుడు ప్రత్యేక దర్యాప్తు బృందం మరో కొత్త అంశాన్ని తెరమీదికి తీసుకొచ్చింది. ఉద్యమకారిణి తీస్తా సెతల్వాద్ వెనకాల ఉన్నది కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అహ్మద్ పటేల్ అని.. ఆయన కుట్రలో భాగంగానే మోదీని, ఇతరులను కేసులో ఇరికించారని ఇప్పుడు సిట్ కనిపెట్టింది. అయితే.. అహ్మద్ పటేల్ చనిపోయిన తర్వాత ఆయనపై కుట్ర చేశాడన్న అపవాదు తీసుకురావడం ఏంటని? కోర్టులో క్లీన్ చీట్ తెచ్చుకోవడం సరేకానీ, గుజరాత్ అల్లర్ల వెనకాల ఉన్నది ఎవరు.. ఎవరి వల్ల ఇదంతా జరిగిందో యావత్ దేశం మొత్తానికి తెలిసిన విషయమేనని కాంగ్రెస్ పార్టీ అంటోంది.
రెండేళ్ల క్రితం చనిపోయిన కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్.. 2002 గుజరాత్ అల్లర్ల తర్వాత ఉద్యమకారిణి తీస్తా సెతల్వాద్‌తో కలిసి ప్రధాని నరేంద్ర మోదీపై కుట్ర పన్నారని గుజరాత్ పోలీసు ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) సెషన్స్ కోర్టు ముందు తెలిపింది. ఉద్యమకారిణి తీస్తా సెతల్వాద్ బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోగా.. ఆమెకు బేయిల్ ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ గుజరాత్ పోలీసులు ఈ విషయం చెప్పారు.
2002 అల్లర్ల తర్వాత రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసేందుకు దివంగత కాంగ్రెస్ నేత అహ్మద్ పటేల్ ఆదేశానుసారం జరిగిన “పెద్ద కుట్ర”లో ఆమె ఒక భాగమని సెషన్స్ కోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్లో పోలీసు ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) పేర్కొంది. కాగా, సిట్ సమర్పించిన సమాధానాన్ని రికార్డు చేసి, బెయిల్ దరఖాస్తుపై విచారణను సోమవారానికి వాయిదా వేశారు అదనపు సెషన్స్ జడ్జి డిడి ఠక్కర్.
కాగా, గుజరాత్ అల్లర్ల కేసుల్లో అమాయకులను కేసులో ఇరికించేందుకు కల్పిత సాక్ష్యాలను రూపొందించారని.. దీంతో మాజీ ఐపీఎస్ అధికారులు ఆర్‌బీ శ్రీకుమార్, సంజీవ్ భట్‌తో పాటు సెతల్వాద్‌ను అరెస్టు చేశారు. ఈ కుట్ర అమలులో భాగంగా(సెతల్వాద్) ప్రభుత్వాన్ని పడగొట్టడం లేదా అస్థిరపరచడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. అమాయకులను ఈ కేసులో ఇరికించే ప్రయత్నాలు చేసి.. ప్రత్యర్థి రాజకీయ పార్టీ నుండి అక్రమంగా ఆర్థిక, ఇతర ప్రయోజనాలు.. రివార్డులను పొందింది” అని సిట్ తన అఫిడవిట్లో పేర్కొంది.
దివంగత అహ్మద్ పటేల్ సూచన మేరకు ఈ కుట్ర జరిగిందని సాక్షి వాంగ్మూలాలను ఉటంకిస్తూ సిట్ పేర్కొంది. 2002లో గోద్రా అనంతర అల్లర్ల తర్వాత పటేల్ ఆదేశాల మేరకు సెతల్వాద్ రూ. 30 లక్షలు అందుకున్నారని ఆరోపించింది. బీజేపీ ప్రభుత్వ సీనియర్ నాయకుల పేర్లను అల్లర్ల కేసుల్లో ఇరికించేందుకు సెతల్వాద్ ఢిల్లీలో ఆ సమయంలో అధికారంలో ఉన్న ప్రముఖ జాతీయ పార్టీ నేతలను కలుస్తుండేవారని సిట్ పేర్కొంది.
అయితే.. తమ దివంగత నేత అహ్మద్ పటేల్‌పై గుజరాత్ పోలీసులు చేసిన ఆరోపణలను కాంగ్రెస్ పార్టీ ఖండించింది. ఇదంతా 2002లో జరిగిన మత ఘర్షణలు, మారణహోమానికి బాధ్యత వహించకుండా.. ఆ కేసులో రిలీఫ్ పొందాలన్న ప్రధాని నరేంద్ర మోదీ వ్యూహంలో భాగమేనని కాంగ్రెస్ పార్టీ కమ్యూనికేషన్ విభాగం ఇన్‌చార్జ్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ శనివారం రిలీజ్ చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.
గత నెలలో గుజరాత్ అల్లర్ల కేసు నుంచి అప్పటి ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ, ఇతరులకు సుప్రీంకోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది. ఆ తర్వాత రోజు పోలీసులు సెతల్వాద్‌ను అరెస్టు చేశారు. శ్రీకుమార్, భట్‌తో పాటు ఆమెపై IPC సెక్షన్లు 468 (ఫోర్జరీ), 194 (ఉరిశిక్ష విధించే ఉద్దేశంతో తప్పుడు సాక్ష్యం ఇవ్వడం లేదా కల్పించడం) ఇతర నేరాల కింద కేసు నమోదు చేశారు.