Friday, November 22, 2024

టెన్నిస్‌కు టాటా.. ఇదే నా చివరి సీజన్‌.. సానిమా సంచలన ప్రకటన

భారత్‌ టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా సంచలన ప్రకటన చేసింది. 2022 సీజనే తనకు చివరిది అని ఈ హైదరాబాదీ టెన్నిస్‌ స్టార్‌ తెలిపింది. ఈ సీజన్‌ తరువాత ఆటకు వీడ్కోలు పలుకుతానని పేర్కొంది. ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ డబుల్స్‌లో ఉక్రెయిన్‌ ప్లేయర్‌ నదియా కిచ్నోక్‌తో జోడీ కట్టిన సానియాకు చుక్కెదురైంది. తొలి రౌండ్‌లోనే స్లోవేనియాకు చెందిన తమరా జిదాన్‌సెక్‌-కాజా జువాన్‌ జోడీ 4-6, 6-7 (5) చేతిలో సానియా జోడీ ఓటమిపాలైంది. 37 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్‌లో సానియా జోడీ గట్టిగానే పోటీ ఇచ్చినా.. ఓటమి తప్పలేదు. ఈ ఓటమి తరువాత సానియా తన రిటైర్మెంట్‌ నిర్ణయాన్ని వెల్లడించింది. ఇదే నా చివరి సీజన్‌ అని నిర్ణయించుకున్నాను. నేను ఒక వారం నుంచి ఈ టోర్నీ ఆడుతున్నాను. ఈ సీజన్‌ మొత్తం ఆడగలనో.. లేదో.. తెలియదు. కానీ నేను మొత్తం సీజన్‌లో ఉండాలని అనుకుంటున్నాను.. కొన్ని రోజులుగా మోచేయి నొప్పిగా ఉంటున్నది. గతేడాది ఆఖర్లోనే ఈ నిర్ణయం తీసుకున్నాను. నా వయస్సు 35. ఆడేందుకు సిద్ధంగా ఉన్నా.. కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి. ఈ సీజన్‌ను విజయవంతంగా ముగించడమే నా ముందు ఉన్న లక్ష్యం. ఆస్ట్రేలియా ఓపెన్‌లో ఓటమికి మోచేయి నొప్పి కారణమని మాత్రం చెప్పలేను.. బాబుకు జన్మనిచ్చిన తరువాత ఫిట్‌నెస్‌ కోసం ఎంతో కష్టపడ్డా.. విదేశీ టూర్లకు మూడేళ్ల కుమారుడిని తీసుకురావాల్సి వస్తున్నది.. ఇది కూడా ఓ ఇబ్బంది.. అంటూ సానియా మీర్జా చెప్పుకొచ్చింది. సానియా ప్రస్తుతం అమెరికాకు చెందిన రాజీవ్‌ రామ్‌తో కలిసి ఆస్ట్రేలియా ఓపెన్‌ మిక్స్‌డ్‌ డబుల్స్‌ బరిలోకి దిగనుంది.

2013లోనే సింగిల్స్‌కు గుడ్‌ బై
2013లోనే సానియా మీర్జా.. సింగిల్స్‌ ఆడటం మానేసింది. డబుల్స్‌లో అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తూ వచ్చింది. వరల్డ్‌ నెంబర్‌ వన్‌ ర్యాంకును కూడా ముద్దాడింది. 91 వారాల పాటు ఈ స్థానాన్ని తనవద్దే పదిలంగా ఉంచుకుంది. 20 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో 270కు పైగా సింగిల్స్‌ విభాగంలో విజేతగా నిలిచింది. డబుల్స్‌లో 500కు పైగా విజయాలను నమోదు చేసుకుంది. సింగిల్స్‌లో సానియా అత్యుత్తమ ర్యాంకు 27 కాగా.. డబుల్స్‌లో అగ్ర స్థానాన్ని కైవసం చేసుకుంది. ఒక సింగిల్స్‌ టైటిల్‌తో పాటు 40 డబుల్స్‌ టైటిల్స్‌, 6 గ్రాండ్‌ స్లామ్‌ టైటిల్స్‌ను గెలుచుకుంది. రియో ఒలింపిక్స్‌లో నాల్గో స్థానంలో నిలిచి తృటిలో పతకాన్ని చేజార్చుకుంది. ఆసియా క్రీడలు, కామన్‌ వెల్త్‌ క్రీడలు, ఆఫ్రో-ఆసియా క్రీడల్లో సానియా.. 14 పతకాలను గెలుచుకుంది. అందులో 6 బంగారు పతకాలు ఉన్నాయి. ప్రస్తుతం సానియా.. అంతర్జాతీయంగా 68వ ర్యాంకులో కొనసాగుతోంది.

షోయబ్‌ మాలిక్‌తో వివాహం
పాకిస్తాన్‌ క్రికెటర్‌ షోయబ్‌ మాలిక్‌ను వివాహం చేసుకున్న సానియా.. 2018లో పండండి మగ బిడ్డకు జన్మనిచ్చింది. దీంతో రెండేళ్ల పాటు ఆటకు దూరమైంది. ఆ తరువాత రీ ఎంట్రీ ఇవ్వడానికి గంటల పాటు కోర్టులో చెమటోడ్చింది. 26 కిలోల బరువును తగ్గించి.. ఆటకు సిద్ధమైంది. రెండో ఇన్నింగ్స్‌లో ఉక్రెయిన్‌కు చెందిన నదియా కిచెనోక్‌తో కలిసి హోబర్‌ ్డ ఇంటర్నేషనల్‌లో మహిళల డబుల్స్‌ టైటిల్‌ను నెగ్గి.. తాను ఇంకా ఆటలో మేటి అని నిరూపించుకుంది. ఆ తరువాత టోక్యో ఒలింపిక్స్‌లో కూడా బరిలోకి దిగింది. కానీ ఆశించిన ఫలితాన్ని రాబట్టుకోలేకపోయింది. సానియా మీర్జా ఆట కన్నా ఆమె అందానికే అభిమానులు ఎక్కువ అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బాలీవుడ్‌ హీరోయిన్‌ను మించిన అందం సానియా సొంతం. షోయబ్‌తో పెళ్లి అని తెలుసుకుని.. ఆమె ఇంటి ముందు ధర్నా కూడా చేశారంటే.. సానియా అంటే ఎంత పిచ్చో అర్థం చేసుకోవచ్చు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసంఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్  పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement