Thursday, November 21, 2024

Guarantee – డ్రాగన్ ఫ్రూట్ సాగుకు ఉపాథి హామీ…

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: రైతులకు ఆర్థిక సాధికారత చేకూర్చేలా జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకాన్ని అమలు చేయాలన్న లక్ష్యంలో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరో కీలక నిర్ణయం తీసుకున్నాయి. జాతీయ ఉపాధిహామీ పథకాన్ని ఉత్పాదకత దిశగా మళ్లిస్తూ ఇప్పటికే పథకంలో భాగంగా భూముల అభివృద్ధి, సాగునీటి వసతి కల్పన, చేపల చెరువుల తవ్వకం, గొర్రెలు, మేకల షెడ్ల నిర్మాణం చేపడు తున్నారు. తాజాగా జాతీయ ఉపాధి హామీ పథకంలో భాగంగా డ్రాగన్‌ ఫ్రూట్‌ సాగును అనుసంధానిస్తూ నిర్ణయం తీసుకున్నారు. డ్రాగన్‌ ఫలాలకు మార్కెట్‌లో మంచి డిమాండ్‌ ఉండడంతో ఈ పంట సాగు ద్వారా రైతులు ఆర్థికంగా లబ్దిపొం దేలా ఉపాధిహామీ పథకంలో భాగంగా తెలం గాణ గ్రామీణాభివృద్ధి శాఖ చర్యలు చేపడు తోంది. డ్రాగన్‌ ఫ్రూట్‌ సాగు వాణిజ్య పంట అని, దీని సాగుకు ఉపాధిహామీ పథకం కింద రైతులకు మూడేళ్లపాటు సబ్సిడీలు, ప్రోత్సాహకాలు అంది స్తామని ఉన్నతాధికారులు చెబుతున్నారు.

ఉపాధిహామీ పథకంలో జాబ్‌కార్డు కలిగి ఉన్న ప్రతి సన్న, చిన్నకారు రైతులు ఈ పథకం కింద లబ్ధిపొందేందుకు అర్హులు. గ్రామంలోని సన్న, చిన్నకారు రైతులు ఎంతమంది రైతులు ముందుకొచ్చినా అందరికీ ఈ పథకాన్ని వర్తింపచేయాలని గ్రామీణాభివృద్ధి శాఖ నిర్ణయిం చింది. ముందుగా రైతులు తమ పొలానికి భూసార పరీక్ష చేయించుకోవాలి. ఆ తర్వాత రైతులు పట్టాదారు పాసుపుస్తకం, జాబ్‌కార్డు, ఆధార్‌కార్డు, బ్యాంకు పాసుపుస్తకంతో ఎంపీడీవో కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం డ్రాగన్‌ ఫ్రూట్‌కు మార్కెట్‌లో మంచి డిమాండ్‌ ఉంది. శరీరంలో రక్తకణాలు, పోషకాల పెరుగుదలకు ఈ ఫలం దోహదం చేస్తుండడంతో వైద్యులు సైతం తినాలని సూచిస్తున్నారు. పంట సాగు కూడా రైతులకు ఆర్థికంగా చేయూత అందించేవిధంగా ఉండనుంది.

- Advertisement -

ఒక్కసారి మొక్కలు నాటితే 40ఏళ్ల వరకు ఫలసాయం అందించడం డ్రాగన్‌ ఫ్రూట్‌ మొక్కల ప్రత్యేకత. నాటిన తర్వాత రెండేళ్లకే పంట చేతికొస్తుంది. ఒక్కో ఫలం బరువు దాదాపు 250 గ్రాముల దాకా ఉంటుంది. ఎకరానికి సుమారు రూ.5 లక్షల పెట్టుబడి అవుతుండగా ఎకరాకు 30 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుందని ఉద్యానవన శాఖ అధికారులు చెబుతున్నారు. పండ్లను మార్కెట్‌లో కిలోకు రూ.250 చొప్పున ధర పలుకుతోంది. ఇలా క్వింటాల్‌ దిగుబడికి రూ.25 వేల దాకా ఆదాయం రానుంది. మొత్తం 30 క్వింటాళ్ల దిగుబడికి రూ.7.50 లక్షల ఆదాయం వస్తుంది. అంటే ఖర్చులు పోను ఎకరానికి ఏటా లక్ష వరకు ఆదాయం రానుంది. ఉపాధిహామీ పథకంలో భాగంగా డ్రాగన్‌ ఫ్రూట్‌ సాగుకు రూ.2.50 లక్షలను గ్రామీణాభివృద్ధి శాఖ అందించనుంది. ఈ సబ్సిడీని మూడేళ్లలో విడతల వారీగా అందిస్తారు. అర ఎకరంలో 900 మొక్కలు నాటొచ్చని ఉద్యానవన శాఖ అధికారులు చెబుతున్నారు.

మొక్కలను ఉద్యాన వన శాఖ సబ్సిడీ కింద అందించనుంది. దిగుబడి వచ్చిన మొదటి ఏడాదే ఎకరాకు రూ.లక్ష ఆదాయం వస్తుందని ముందు ముందు ఆదాయం పెరుగుతుం దని ఉద్యానవన శాఖ చెబుతోంది. మరోవైపు డ్రాగన్‌ ఫ్రూట్‌ తోటలో అంతరపంటగా పుచ్చ, కర్బూజతోపాటు కూరగాయలు కూడా సాగు చేసుకోవచ్చు. డ్రాగన్‌ ఫ్రూట్‌ మొక్కకు ముళ్లు ఉండడంతో కోతుల బెడద కూడా ఉండదు. తక్కువ నీరుతోనే ఈ పంటను పండించొచ్చు. ఎండను తట్టుకుని పండే పంటగా దీన్ని పేర్కొంటారు. ఒక ఎకరం వరి సాగుకు అవసరమైన నీళ్లలో కేవలం ఒకటో వంతు నీరు మాత్రమే ఈ పంట సాగుకు సరిపోతుంది.
ఇప్పటికే పలు జిల్లాల్లో డ్రాగన్‌ ఫ్రూట్‌ తోటలను రైతులు అక్కడక్కడా సాగు చేస్తున్నారు.
ఈ పంట సాగు లాభదాయకంగా ఉందంటున్నారు. పెట్టుబడి ఖర్చులు పోను ఎకరాకు లక్ష రూపాయల ఆదాయం వస్తుండడంతో నల్గొండ, రంగారెడ్డి, ఉమ్మడి వరంగల్‌, మహబూబ్‌నగర్‌, ఖమ్మం తదితర జిల్లాల్లో ఇప్పుడిప్పుడే ఈ పంట సాగు ఊపందుకుంటోంది. ప్రస్తుతం ఉపాధిహామీ పథకం కింద పంట సాగును ప్రోత్సహించాలని తెలంగాణ గ్రామీణాభివృద్ధి శాఖ నిర్ణయించిన నేపథ్యంలో డ్రాగన్‌ ఫ్రూట్‌ సాగు భారీ ఎత్తున సాగుకానుందని ఉద్యానవనశాఖ అధికారులు చెబుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement