Tuesday, November 26, 2024

జీఎస్‌టీ ఎగవేత కేసు.. రెండు బీరువాల్లో కరెన్సీ కట్టలు.. ఇంట్లో నోట్ల గుట్టలు..

న్యూఢిల్లీ : పన్ను ఎగవేశాడన్న ఆరోపణలపై ఓ పర్ఫ్యూమ్‌ వ్యాపారి ఇంటికెళ్లిన ఆదాయపన్ను శాఖ అధికారులు షాక్‌ తిన్నారు. ఇంటి నిండా నోట్ల కట్టలు కనిపించడంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఆ ఇంట్లో ఉన్న రెండు పెద్ద బీరువాల నిండా నోట్ల కట్టలు బయటపడ్డాయి. యూపీలో కాన్పూర్‌లో ఈ ఘటన జరిగింది. కాన్పూర్‌కు చెందిన ఓ పర్ఫ్యూమ్‌ తయారీ సంస్థ యజమాని పీయూష్‌ జైన్‌పై పన్ను ఎగవేత ఆరోపణలు వచ్చాయి. ఇంట్లో అనుమానాస్పదంగా రెండు అల్మారాలు కనిపించాయి. వాటిని ఓపెన్‌ చేసి చూడగా.. ప్యాక్‌ చేసిన నోట్ల కట్టలు కనిపించాయి. దీంతో ఐటీ అధికారులు షాక్‌ తిన్నారు. బ్యాంకు అధికారులను పిలిపించారు. మూడు కౌంటింగ్‌ మిషన్‌లతో డబ్బులను లెక్కించడం ప్రారంభించారు. రూ.150 కోట్ల వరకు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. డైరెక్టరేట్‌ ఆఫ్‌ జీఎస్‌టీ ఇంటెలిజెన్స్‌ అధికారులు కూడా పీయూష్‌ ఇంటికి చేరుకున్నారు. నకిలీ ఇన్‌ వాయిస్‌లు, బిల్లులను పీయూష్‌ సృష్టించారని, జీఎస్‌టీ పన్నులు ఎగ్గొట్టారని విచారణలో తేలింది. కాన్పూర్‌లోని ఇంటితో పాటు మహారాష్ట్ర, గుజరాత్‌లోని ఆయనకు సంబంధించిన పలు కార్యాలయాలు, గోడౌన్లలోనూ తనిఖీలు నిర్వహించారు. ఓ వేర్‌ హౌస్‌లో నకిలీ ఇన్‌ వాయిస్‌లు ఉన్న నాలుగు ట్రక్కులను స్వాధీనం చేసుకున్నారు.

సమాజ్‌వాదీ వర్సెస్‌ బీజేపీ
పీయూష్‌ కేవలం వ్యాపారం మాత్రమే కాకుండా సమాజ్‌వాదీ పార్టీ అనుచరుడిగా ఉన్నారు. ఆ పార్టీ అఖిలేష్‌ యాదవ్‌కు అత్యంత సన్నిహితుడు. ఇటీవల సమాజ్‌వాదీ పార్టీతో ప్రత్యేకంగా ఓ పర్ఫ్యూమ్‌ను కూడా మార్కెట్లోకి విడుదల చేశారు పీయూష్‌. కాగా పర్ఫ్యూమ్‌ వ్యాపారి ఇంట్లో దొరికిన నోట్ల కట్టలకు సంబంధించిన ఫొటోలను సోషల్‌ మీడియాలో పంచుకుంది బీజేపీ. ఎస్‌పీ అవినీతి వాసన ఇది అంటూ పోస్టు చేసిన ఈ ఫొటోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారాయి. సెంట్రల్‌ బోర్డు ఆఫ్‌ ఇన్‌డైరెక్ట్‌ ట్యాక్సెస్‌ అండ్‌ కస్టమ్స్‌ (సీబీఐసీ) చైర్మన్‌ వివేక్‌ జోహ్రీ మాట్లాడుతూ.. సీబీఐసీ చరిత్రలో ఇంత భారీ మొత్తంలో రికవరీ చేయలేదన్నారు. అయితే ఇప్పటి వరకు ఎలాంటి అరెస్టులు చేయలేదన్నారు. నోట్ల కట్టలకు సంబంధించిన గుట్టలు.. గుట్టలు ఇంట్లో నుంచి బయటపడ్డాయి. ఒక్కో అల్మారాలో 30 బండిల్స్‌ వరకు స్వాధీనం చేసుకున్నాం. మూడు కౌంటింగ్‌ మిషన్స్‌తో లెక్కించడం జరిగింది.

భారీగా నకిలీ ఇన్‌వాయిస్‌ల స్వాధీనం
ఓ వేర్‌ హౌస్‌లో 200 నకిలీ ఇన్‌వాయిస్‌లు ఉన్న నాలుగు ట్రక్కులను గుర్తించి వాటిని స్వాధీనం చేసుకున్నామని వివేక్‌ జోహ్రీ తెలిపారు. కాన్పూర్‌ ఎస్‌బీఐ అధికారులను రంగంలోకి దించి.. డబ్బులను కౌంటింగ్‌ చేయించాం. కీలక పత్రాలు కూడా స్వాధీనం చేసుకున్నాం. నకిలీ ఇన్‌ వాయిస్‌లతో గూడ్స్‌ ట్రాన్స్‌పోర్టు చేయడం జరిగింది. ఎలాంటి ఈ-వే బిల్లులు లేకుండా సరుకు రవాణా చేశారు. 200 ఇన్‌ వాయిస్‌లు జీఎస్‌టీ లేకుండా నకిలీ బిల్లులు సృష్టించారు. ఒక్కో ఇన్‌వాయిస్‌ రూ.50,000 వరకు ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement