Wednesday, November 20, 2024

దారి తప్పిన జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌10.. ఇస్రో ప్రయోగం విఫలం!

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌10 వాహకనౌక నింగిలోకి దూసుకెళ్లిన కాసేపటికే విఫలం అయింది. మూడో దశలో సాంకేతిక లోపంతో ఈ ప్రయోగం విఫలం అయిందని ఇస్రో ఛైర్మన్‌ శివన్‌ తెలిపారు.

​ నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోటలో గల సతీశ్​ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ నుంచి ఈ ఉదయం 5.43 గంటలకు జీఎస్‌ఎల్‌వీ ఎఫ్‌10 ద్వారా ఈవోఎస్​-3ను శాస్త్రవేత్తలు ప్రయోగించారు. 38 వేల కిలోమీటర్ల ఎత్తులో ఉప గ్రహాన్ని కక్ష్యలో ప్రవేశపెట్టాల్సి ఉండగా.. ప్రయోగం విఫలమైంది. మూడో దశ అయిన క్రయోజనిక్‌ దశలో సాంకేతిక లోపం కారణంగా ఈ ప్రయోగం విఫలం అయిందని ఇస్రో ఛైర్మన్‌ శివన్‌ తెలిపారు. దీంతో అది నిర్దేశిత మార్గంలో కాకుండా మరోమార్గంలో వెళ్లిందని, ఫలితంగా ప్రయోగం విఫలమైందని ఇస్రో చైర్మన్ శివన్ వెల్లడించారు.

ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ (ఈఓఎస్-03)​ ఉప గ్రహాన్ని అనేక ప్రయోజనాలు పొందేలా ఇస్రో రూపొందించింది. దేశ భూభాగం, సరిహద్దులు, అడవులకు సంబంధించి స్పష్టమైన ఛాయా చిత్రాలను పంపేలా తయారు చేశారు. కుంభవృష్టి, తుఫాన్లు వంటి ప్రకృతి విపత్తులపై కూడా త్వరగా అప్రమత్తమయ్యేలా సమాచారం పొందే ఉద్దేశంతో రూపొందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement