తెలంగాణలో ఉద్యోగాల జాతర మొదలు కానుంది. రాష్ట్రంలో వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 90 వేల ఉద్యోగాల భర్తీకి ఇప్పటికే ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ క్రమంలో గ్రూప్–1 ఉద్యోగ భర్తీ ప్రక్రియలో ముందడుగు పడింది. ప్రభుత్వ శాఖల వారీగా ఉద్యోగాల భర్తీ ప్రతిపాదనలను ఇప్పటికే క్షుణ్ణంగా పరిశీలించిన తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) ఆయా శాఖల నుంచి సవరణ ప్రతిపాదనలు కోరింది. శనివారం బోర్డు సమావేశంలో దాదాపు అన్ని శాఖల ప్రతిపాదనలను మళ్లీ పరిశీలించగా సభ్యులు సంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో ఈ ప్రక్రియ దాదాపు కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే గ్రూప్–1లో ఇంటర్వ్యూలు రద్దు చేసినందున దీనికి సంబంధించిన జీవో సోమవారం వచ్చే అవకాశం ఉంది. దీంతో రేపు సాయంత్రానికి 503 గ్రూప్–1 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.
19 విభాగాల్లో గ్రూప్-1 సర్వీసుల్లో 503 పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. మొత్తం పోస్టుల్లో మండల పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్ పోస్టులు 121, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ 91, కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్లు 48, డిప్యూటీ కలెక్టర్లు 42, అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్లు 40 ఉన్నాయి. తెలంగాణ ఏర్పాటైన తర్వాత గ్రూప్-1కి ఇదే తొలి నోటిఫికేషన్. చివరి నోటిఫికేషన్ 2011లో విడుదలైంది, అయితే అనేక చట్టపరమైన సమస్యలను అధిగమించి 2017లో రిక్రూట్మెంట్ పూర్తయింది. అయితే, చట్టపరమైన సమస్యలు రిక్రూట్మెంట్లను ఆలస్యం చేయకుండా చూసేందుకు గ్రూప్-I మరియు గ్రూప్-IIతో సహా అన్ని కేటగిరీల కోసం ఇంటర్వ్యూను రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే, గ్రూప్-1 ఎంపిక ప్రిలిమ్స్, మెయిన్స్ అనే రెండు దశల్లో ఉంటుంది.