ఆంధ్రప్రదేశ్ లో కరోనా సెకండ్ వేవ్ ఉధృతి ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గత మూడు, నాలుగు రోజులుగా 20 వేల పైచిలుకు కేసులు నమోదు అవుతున్నాయి. జిల్లాలోని ఆస్పత్రులు కొవిడ్ బాధితులతో నిండిపోయాయి. ఆక్సిజన్ కొరత తీవ్రంగా వేధింస్తోంది. ఇప్పటికే పలు ఆస్పత్రుల్లో ఆక్సిజన్ అందక చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే, ఏపీ పోలీసుల సమయస్ఫూర్తి వందలాదిమంది ప్రాణాలను నిలబెట్టింది. సమయానికి ఆక్సిజన్ అందజేయడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. ఒడిశా నుంచి విజయవాడకు ఆక్సిజన్ ట్యాంకర్ బయల్దేరింది. అర్ధరాత్రి దాటిన తర్వాత ఆ ట్యాంకర్ తో సంబంధాలు తెగిపోయాయి. ఆ వెంటనే విజయవాడ సిటీ కమిషనర్ కి ఈ సమాచారాన్ని చేరవేశారు. వెంటనే ఆయన ఒడిశా నుంచి విజయవాడ వరకు మార్గ మధ్యలో ఉన్న జిల్లాల ఎస్పీలను అప్రమత్తం చేశారు.
తూర్పు గోదావరి జిల్లా ధర్మవరం దగ్గర ఓ దాబాలో ఆక్సిజన్ ట్యాంకర్ ని ప్రత్తిపాడు పోలీసులు గుర్తించారు. వెంటనే వెళ్లి డ్రైవర్ ను ఆరా తీయగా.. తాను అలసిపోయి వాహనాన్ని నిలిపి వేసినట్టుగా చెప్పాడు. వెంటనే పత్తిపాడు సీఐ డ్రైవర్ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళారు. అధికారుల ఆదేశాలతో ఆక్సిజన్ ట్యాంకర్ కు గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేశారు. ఆక్సిజన్ ట్యాంకర్ ను గ్రీన్ ఛానల్ ద్వారా సమయానికి పోలీసులు విజయవాడ జీజీహెచ్ కు చేరార్చారు. సకాలంలో ఆక్సిజన్ అందించడంతో 400 మంది ప్రాణాలను పోలీసులు కాపాడారు. జీజీహెచ్‌లో ఆక్సిజన్ తో 400మంది కొవిడ్ భాదితులు చికిత్సపొందుతున్నారు. సమయస్ఫూర్తితో వ్యవహరించిన పోలీసులపై డీజీపీ గౌతమ్ సవాంగ్, అధికారులు అభినందించారు. కాగా, కొద్ది రోజుల క్రితం గ్రీన్ ఛానల్ ద్వారా ఆక్సిజన్ ట్యాంకర్ ను గుంటూరు ఆస్పత్రికి చేర్చిచన సంగతి తెలిసిందే.