Saturday, November 23, 2024

Srisailam | శ్రీశైలంలో వైభ‌వంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు.. పెద్ద ఎత్తున త‌ర‌లివ‌చ్చిన భ‌క్తులు

శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి క్షేత్రంలో ముక్కోటి ఏకాదశి పర్వదినం వైభవంగా జరిగింది. సోమవారం తెల్లవారుజామున మేళతాళాలతో ఆలయ ద్వారాలు తెరచి ఏకాంత సుప్రభాత సేవ మంగళహారతులు జరిపించారు. ఈవో లవన్న ఆధ్వర్యంలో స్వామి, అమ్మవార్లను ముఖమండపంలో ఆసీనులను జేశారు. ఉత్సవ మూర్తులకు అర్చక వేదపండితులు విశేష పూజాధికాలతో ఉత్సవ సంకల్పం పఠించారు. లోక కళ్యాణాన్ని ఆకాంక్షిస్తూ భక్తులు సుఖసంతోషాలతో భాసిల్లాలని, పంటలు బాగా పండి రైతాంగం మనోధైర్యంగా ఉండాలే చూడాలని మహా సంకల్పాన్ని ప్రధానన అర్చకులు వల్లించారు.

అనంతరం ఉత్తర ద్వారం నుండి స్వామిఅమ్మవార్లను వెలుపలకు తోడ్కొని వచ్చి బలిపీఠం వద్ద ఉత్తరముఖంగా ప్రత్యేక పూజలు నిర్వహించి వైభ‌వంగా రావణవాహన సేవ నిర్వ‌హించారు. మేళతాళాలతో గంగాధర మండపం నుండి నందిమండపం మీదుగా బయలువీరభద్రస్వామి ఆలయం వరకు గ్రామోత్సవం జరిపించి భక్తులకు ఉత్తర ద్వారం నుండి సర్వదర్శనాలు కల్పించినట్లు ఈఓ తెలిపారు. ముక్కోటి ఏకాదశి సందర్బంగా ఏపీ, తెలంగాణ‌, క‌ర్నాట‌క రాష్ట్రాల నుండి వచ్చిన భక్తులు తెల్లవారుజామున కృష్ణా నదిలో పుణ్య స్నానాలు చేసుకుని ఉత్తర ద్వార దర్శనానికి బారులుదీరారు. స్వామి అమ్మవార్ల దర్శన అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించారని ఆలయ అధికారులు తెలిపారు.

సాయంత్రం ఆలయంలోని పురాతన దీపాలంకరణ మండపంలో స్వామిఅమ్మవార్లకు షోడశోపచార పూజలు జరిపించి సహస్త్ర దీపార్చన చేశారు. అనంతరం ఆలయ ప్రదక్షిణగా వెండి రథోత్సవ కార్యక్రమం సాగింది. ఆలయ దక్షిణ మాడవీధిలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కళారాధన కార్యక్రమంలో చిన్నారులు చేసిన భరతనాట్యం, ఇత‌ర సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ సమ్మోహనపరిచాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement