న్యాయమూర్తుల నియామకం విషయం మరోసారి వివాదంగా మారింది. దీనిపై ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, కేంద్ర మంత్రి రిజిజు మధ్య ట్వీట్ల సంవాదం జరిగింది. కొలీజియంపై కీలక వ్యాఖ్యలు చేశారు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు. కాగా, కొలీజియంలో తమ రిప్రజంటేటీవ్లను చేర్చుకోవాలని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును కోరుతూ తీసుకున్న నిర్ణయాన్ని ‘‘అత్యంత ప్రమాదకరమైనది’’గా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అభివర్ణించారు. ఈ అంశంపై రిజిజు స్పందించారు. జాతీయ న్యాయ నియామకాన్ని కొట్టివేస్తూ సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకోగా.. సుప్రీంకోర్టు, హైకోర్టుల కొలీజియంలో తమ ప్రతినిధులను, రాష్ట్రాలను చేర్చుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఇది సుప్రీంకోర్టు ముందు ఉన్న “కచ్చితమైన తదుపరి చర్య” అని న్యాయ మంత్రి కిరణ్ రిజిజు సోమవారం అన్నారు.
‘‘మీరు కోర్టు ఆదేశాలను గౌరవిస్తారని నేను ఆశిస్తున్నాను! జాతీయ జ్యుడీషియల్ అపాయింట్‌మెంట్ కమిషన్ చట్టాన్ని కొట్టివేస్తూ సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం నిర్దేశించిన కచ్చితమైన తదుపరి చర్య ఇది. కొలీజియం వ్యవస్థ యొక్క ఎమ్‌ఓపి (మెమోరాండమ్ ఆఫ్ ప్రొసీజర్)ని పునర్నిర్మించాలని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఆదేశించింది” అని కేంద్ర మంత్రి రిజిజు ట్విట్టర్‌లో తెలిపారు.
న్యాయమూర్తుల ఎంపికలో పారదర్శకత, ప్రజా జవాబుదారీతనం కల్పించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రతినిధులను వరుసగా సుప్రీంకోర్టు.. హైకోర్టు కొలీజియంలలో చేర్చాలని సూచిస్తూ కేంద్ర న్యాయశాఖ మంత్రి భారత ప్రధాన న్యాయమూర్తి DY చంద్రచూడ్‌కు లేఖ కూడా రాశారు. అయితే.. “ఇది చాలా ప్రమాదకరమైనది. జ్యుడీషియల్ నియామకాల్లో ప్రభుత్వ జోక్యం ఉండకూడదు’ అని కేజ్రీవాల్ ట్విట్టర్ వేదికగా మరో పోస్టు పెట్టారు.
కాగా, గత నవంబర్‌లో కిరణ్ రిజిజు న్యాయవ్యవస్థలో నియామకాలు చేసే కొలీజియం.. రాజ్యాంగానికి “పరాయి వ్యవస్థ”గా అభివర్ణించారు. అంతేకాకుండా ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌ఖర్, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా కూడా న్యాయవ్యవస్థ.. చట్టసభల అధికారాలను అతిక్రమిస్తోందని ఆరోపించారు. సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల నియామకం, పెంపుదల, బదిలీలకు సంబంధించి దాదాపు ఏడుగురు న్యాయమూర్తుల మార్గనిర్దేశం చేసిన మెమోరాండం ఆఫ్ ప్రొసీజర్ (ఎంఓపీ)పై కేంద్ర ప్రభుత్వం, సుప్రీంకోర్టు కొలీజియం ఏకాభిప్రాయానికి రాకపోవడంపై పార్లమెంటరీ ప్యానెల్ కూడా ఆశ్చర్యం వ్యక్తం చేసింది.
ఇటీవలి నివేదికలో డిపార్ట్ మెంట్-సంబంధిత స్టాండింగ్ కమిటీ ఆన్ లా అండ్ జస్టిస్ అండ్ పర్సనల్.. సుప్రీం కోర్ట్ పరిశీలన పరంగా కొన్ని సూచనలు చేసింది. “మరింత సమర్థవంతంగా, పారదర్శకంగా ఉండే” సవరించిన మెమోరాండం ఆఫ్ ప్రొసీజర్(MoP)ని ప్రభుత్వం, న్యాయవ్యవస్థలు ఖరారు చేయాలని ఆశిస్తున్నట్లు పేర్కొంది.
“రాజ్యాంగ న్యాయస్థానాలకు (సుప్రీంకోర్టు,25 హైకోర్టులు) న్యాయమూర్తుల నియామకానికి సంబంధించిన మెమోరాండం ఆఫ్ ప్రొసీజర్ (ఎంఓపి) సవరణపై సుప్రీంకోర్టు, ప్రభుత్వం ఏకాభిప్రాయం సాధించడంలో విఫలమయ్యాయని కమిటీ గమనించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. దాదాపు ఏడేళ్లుగా రెండింటి పరిశీలనలో ఉంది’’ అని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) సీనియర్ నాయకుడు సుశీల్ కుమార్ మోదీ నేతృత్వంలోని ప్యానెల్ పేర్కొంది.