ఉక్రెయిన్లో చిక్కుకుపోయిన భారతీయ విద్యార్థులను తరలించేందుకు ప్రభుత్వం చర్యలు ముమ్మరం చేసింది. రష్యా-ఉక్రెయిన్ ల మధ్య భీకర యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో ఉక్రెయిన్ నుంచి భారతీయ విద్యార్థుల తరలింపు ప్రక్రియ వేగవంతం అవుతోంది. యుద్ధ వాతావరణంలో భయంగా గడుపుతోన్న విద్యార్థులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం మరిన్ని చర్యలు చేపట్టింది. భారతీయ పౌరుల తరలింపులను సమన్వయం చేయడానికి ప్రభుత్వం ఇప్పుడు నలుగురు కేంద్ర మంత్రులను ఉక్రెయిన్ పొరుగు దేశాలకు పంపుతోంది.
ఆపరేషన్ గంగను వేగవంతం చేయడానికి ప్రధాని మోదీ అత్యున్నత సమావేశం ఏర్పాటు చేశారు. విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ సహా పలువురు మంత్రులు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. యుద్ధంలో దెబ్బతిన్న దేశం నుండి భారతీయ పౌరుల తరలింపు ప్రక్రియను ప్రధాని వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తున్నారు. ఈ సందర్భంగా నలుగురు కేంద్ర మంత్రులకు కీలక బాధ్యతలు అప్పగించారు.
ఉక్రెయిన్ సరిహద్దు దేశాలకు ఆ నలుగురు వెళ్లి, భారతీయుల తరలింపు ప్రక్రియను స్వయంగా పర్యవేక్షించనున్నారు. హర్దీప్ సింగ్ పూరీ, జ్యోతిరాదిత్య సింధియా, కిరణ్ రిజుజు, వీకే సింగ్ ఉక్రెయిన్ సరిహద్దు దేశాలకు వెళ్లనున్నారు. ఉక్రెయిన్లో దాదాపు 16,000 మంది విద్యార్థులు ఉన్నట్లు తెలుస్తోంది. వారందరినీ తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.