Friday, November 22, 2024

Big Story: ప్రైవేటు సేవలో తరిస్తున్న సర్కారు డాక్టర్లు.. లెక్క తేల్చే పనిలో ప్రభుత్వం..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: కొంత మంది ప్రభుత్వ వైద్యులు ప్రయివేటు ఆసుపత్రుల సేవల్లో బిజీగా మారుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో విధుల్లో ఉండాల్సిన సమయంలోనూ ప్రయివేటు ఆసుపత్రిలోని రోగులకు చికిత్స చేస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని పలు ప్రభుత్వ పెద్దాసుపత్రులతోపాటు పలు జిల్లా ఆసుపత్రులు, ముఖ్య పట్టణాల్లోని ఏరియా ఆసుపత్రుల్లో పనిచేస్తున్న ప్రభుత్వ వైద్యుల భాగోతం ఇది. తమతోపాటు పనిచేసే కొందరు ప్రభుత్వ వైద్యులు … ప్రయివేటు ఆసుపత్రుల్లో పనిచేయటంపై తోటి వైద్యులే అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న పలువురు ప్రభుత్వ వైద్యుల పేర్లు ఆ పక్కనే ఉండే ప్రయివేటు ఆసుపత్రుల డ్యూటీ చార్ట్‌ లు, అందుబాటులో ఉన్న స్పెషల్‌ వైద్యుల జాబితాలో ఉంటుండటం గమనార్హం. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న సీనియర్‌ వైద్యుల పేర్లను పలు ప్రముఖ ప్రయివేటు ఆసుపత్రులు తమ ప్రచారంలోనూ వాడుకుంటున్నాయి.

ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే… డ్యూటీ సమయంలో ప్రయివేటు ఆసుపత్రుల సేవల్లో తరిస్తున్నా ఆ వైద్యులకు అటెండెన్స్‌ రిజిష్టర్‌లో క్రమం తప్పకుండా హాజరు పడుతోంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లోని చాలా మంది సీనియర్‌, స్పెషలిస్టు వైద్యులు ప్రయివేటు ఆసుపత్రుల సేవల్లో ఉండటంతో జూనియర్‌ డాక్టర్లపై భారం పడుతోంది. హైదరాబాద్‌లోని గాంధీ, ఉస్మానియా, నీలోఫర్‌ ఆసుపత్రుల్లో పనిచేసే కొందరు సీనియర్‌ వైద్యులు… దగ్గర్లోని ప్రయివేటు ఆసుపత్రుల్లో చీఫ్‌ మెడికల్‌ ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు. జిల్లాల్లోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేసే కొందరు వైద్యులు …ప్రయివేటు ఆసుపత్రులు ఏర్పాటు చేసే వైద్య, ఆరోగ్య శిబిరాలకు ఎలాంటి జంకు లేకుండా హాజరవుతున్నారన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.

ప్రభుత్వ వైద్యుల ప్రయివేటు సేవల బాగోతంపై రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ప్రత్యేకంగా నిఘా పెట్టినట్లు తెలుస్తోంది. వారి జా బితా తయారీ ఇప్పటికే పూర్తయినట్లు ఓ ఉన్నతాధికారి చెబుతున్నారు. త్వరలో మంత్రి హరీష్‌రావు ఈ విషయమై వైద్య, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో ప్రత్యేక సమీక్ష నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. జిల్లాల వారీగా, హైదరాబాద్‌లోని ఆసుపత్రుల వారీగా ప్రయివేటు క్లినిక్‌లు నడుపుతున్న, పనిచేస్తున్న వైద్యుల పై చర్యలు తప్పవని వైద్య, ఆరోగ్యశాఖ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement