Friday, November 22, 2024

Breaking: గవర్నర్‌ తమిళిపై బదిలీ? తెలంగాణకు త్వరలో కొత్త గవర్నర్‌

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్రానికి కొత్త గవర్నర్‌ రానున్నారా? ప్రస్తుత గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ స్థానంలో మరొకరిని ఎంపిక చేసేందుకు కేంద్ర హోంశాఖ వర్గాలు కసరత్తు చేస్తున్నాయా? పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న తమిళిసైని అక్కడే కొనసాగించే అవకాశముందా? లేదా మరో రాష్ట్రానికి తమిళిసైని బదిలీ చేసే వీలుందా? తమిళిసై ఢిల్లీ పర్యటన నేపథ్యంలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నట్టు అత్యంత విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. ప్రోటోకాల్‌ విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి, రాజ్‌భవన్‌కు మధ్య తీవ్ర అంతరం ఏర్పడిన సంగతి తెలిసిందే. తనను కేసీఆర్‌ ప్రభుత్వం తీవ్రంగా అవమానిస్తోందని, తన పర్యటనలకు అధికారులెవరూ రావడం లేదని గవర్నర్‌ తమిళిసై ఇటీవల ఢిల్లిd వెళ్లి ప్రధాని నరేంద్ర మోడీ, హోంశాఖ మంత్రి అమిత్‌ షాను కలిసి ఫిర్యాదు చేసినట్టు కథనాలు వెలువడ్డాయి.

ఆ తర్వాత భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పర్యటనకు వెళ్లాక కూడా అక్కడ అధికారులెవరూ గవర్నర్‌కు స్వాగతం పలికేందుకు రాలేదు. జిల్లా ఎస్పీ, కలెక్టర్‌ ఈ పర్యటనకు దూరంగా ఉన్నారు. శ్రీరామ నవమి సందర్భంగా భద్రాచలంలో జరిగిన పట్టాభిషేక కార్యక్రమానికి గవర్నర్‌ తమళిసై ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇక్కడ కూడా ప్రోటోకాల్‌ రగడ కొనసాగింది. ఈ తాజా పరిణామాల నేపథ్యంలో మరోసారి హస్తిన వెళ్లిన గవర్నర్‌ తమిళిసై తనను తెలంగాణ నుంచి విముక్తి చేసి పుదుచ్చేరి గవర్నర్‌గా కొనసాగించాలని కేంద్ర ప్రభుత్వ పెద్దలను అభ్యర్థించినట్టు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ప్రతిపాదనపట్ల సానుకూలత వ్యక్తం కాలేదని కేంద్ర హోం శాఖ వర్గాలు చెబుతున్నాయి.

తమిళిసైని మరో రాష్ట్రానికి గవర్నర్‌గా బదిలీ చేసే అవకాశముందని విశ్వసనీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. తమిళనాడు రాష్ట్రానికి చెందిన తమిళిసైని పుదుచ్చేరి గవర్నర్‌గా కొనసాగించినా అక్కడ విపక్షాలు కూడా ఆమెపై విమర్శలు చేసే అవకాశం ఉందని తాజాగా తమిళ సంవత్సరాది సందర్భంగా గవర్నర్‌ నిర్వహించిన విందు కార్యక్రమాన్ని విపక్షాలు బహిష్కరించి నిరసన వ్యక్తం చేసిన అంశాన్ని కేంద్ర ప్రభుత్వ పెద్దలు గుర్తు చేస్తున్నారు. ఒక ప్రాంతీయ భాషను మాట్లాడే వారిని అదే రాష్ట్రానికి గవర్నర్లుగా నియమిస్తే ఇబ్బందులు తలెత్తుతాయని భావిస్తున్న కేంద్ర ప్రభుత్వం తమిళిసైని మరో రాష్ట్రానికి బదిలీ చేయాలన్న ఆలోచనతో ఉన్నట్టు బాజపా వర్గాలు చెబుతున్నాయి. తమిళిసైని మారిస్తే కఠినంగా వ్యవహరించే మరొకరిని తెలంగాణకు ఎంపిక చేయాలన్న ఆలోచనతో కూడా కేంద్రం ఉన్నట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికిప్పుడు తమిళిసైని మార్చకపోయినా వచ్చే నెల, రెండు నెలల్లో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయని సమాచారం.

తమిళిసై నివేదికలపై అధ్యయనం చేస్తున్న కేంద్రం
రాష్ట్ర ప్రభుత్వ పని తీరు, తెలంగాణలో జరుగుతున్న పరిణామాలపై గవర్నర్‌ తమిళిసై తాజాగా అందజేసిన నివేదికలను కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో అధ్యయనం చేస్తున్నట్టు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. గవర్నర్‌ అందజేసిన నివేదికల్లో కీలకమైన అంశాలు ఉన్నాయని వాటిని కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోందని బాజపాకు చెందిన ఓ అగ్రనేత చెప్పారు. గవర్నర్‌ అందజేసిన నివేదికలతో పాటు కేంద్ర ప్రభుత్వం నిఘా వర్గాల ద్వారా కీలక సమాచారాన్ని తెప్పించుకుని పరిశీలిస్తోందని గవర్నర్‌ నివేదికలు, నిఘా వర్గాల సమాచారం ఒకేలా ఉందని దీనిపై త్వరలోనే ఒక నిర్ణయం జరిగే అవకాశముందని ఆ నేత వివరించారు.

తమిళిసైని మారిస్తే కొత్త గవర్నర్‌ ఎవరు?
తెలంగాణ గవర్నర్‌ తమిళిసైని బదిలీ చేస్తే ఆ స్థానంలో ఎవరిని నియమిస్తారన్న అంశంపై చర్చోపచర్చలు జరుగుతున్నాయి. పశ్చిమ బంగా గవర్నర్‌ జగ్‌దీప్‌ ధన్‌కర్‌, కర్నాటక గవర్నర్‌ తవర్‌ చంద్‌ గెహ్లాట్‌, మహారాష్ట్ర గవర్న్‌ భగత్‌సింగ్‌ కోషియారి, తమిళనాడు గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవిలలో ఒకరిని తెలంగాణకు బదిలీ చేసే అవకాశముందని ప్రచారం జరుగుతోంది. ఈ ముగ్గురు గవర్నర్లతో పాటు మరో రెండు, మూడు పేర్లను కూడా తెలంగాణ గవర్నర్‌ ఎంపికకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్టు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. ఒక మహిళ పేరు కూడా పరిశీలనలో ఉందని సమాచారం. రెండోసారి ఢిల్లిd పర్యటనకు వెళ్లిన తమిళిసై హోంశాఖ మంత్రి అమిత్‌ షాను మరోసారి కలిసే అవకాశం కనిపిస్తోంది. తెలంగాణలో తనకు జరుగుతున్న అవమానాన్ని, మంత్రులు, ఎమ్మెల్యేలు, తెరాస పార్టీ నేతలు సామాజిక మాద్యమాల్లో తనకు వ్యతిరేకంగా పెడుతున్న పోస్టింగ్‌లు, కొందరు మంత్రులు మీడియా సమావేశం ఏర్పాటు చేసి తనపై చేసిన ఆరోపణల క్లిప్పింగ్‌లను అమిత్‌ షాకు అందజేయాలని ఆమె నిర్ణయించినట్టు సమాచారం.

- Advertisement -

త్వరలో గవర్నర్ల బదిలీలు
గవర్నర్ల బదిలీలతో పాటు పుదుచ్చేరి రాష్ట్రానికి కొత్త లెఫ్టినెంట్‌ గవర్నర్‌ను నియమించే అవకాశాలపై కేంద్రం హోంశాఖ కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే గవర్నర్ల బదిలీలుంటాయని చెబుతున్నారు. ఈ సందర్భంలో తమిళిసైని ప్రస్తుతం అదనపు బాధ్యతను నిర్వహిస్తున్న పుదుచ్చేరికి పూర్తి స్థాయిలో గవర్నర్‌గా నియమించడమా లేక మరో రాష్ట్రానికి బదిలీ చేసే అంశం తేలుతుందని అంటున్నారు. ఏదేమైనా తమిళిసై మార్పుకు సంబంధించి త్వరలోనే ఓ స్పష్టత రానున్నదని సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement