ఖమ్మం : రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కోసం తీసుకొచ్చిన పథకం మన ఊరు-మన బడి/మన బస్తి-మన బడి అని, అందులో భాగంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని మౌళిక సదుపాయాలు కల్పించి అభివృద్ధి చేయడం జరుగుతుందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. శనివారం మన బస్తి – మన బడి కార్యక్రమంలో భాగంగా ఖమ్మం నగరం 53వ డివిజన్ ఎన్ఎస్ సి కాలనీలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో రూ. 57.38 లక్షలతో చేపట్టిన అభివృద్ధి పనులను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలోని 26,065 ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన విద్య, నమోదు, హాజరుతో పాటు వారు తమ పాఠశాల విద్యను ఎలాంటి ఆటంకాలు లేకుండా కొనసాగించేందుకు వసతులు కల్పిస్తున్నామని పేర్కొన్నారు. ప్రతి పేదవారు ఉన్నత విద్యను ఉచితంగా అభ్యసించి జీవితంలో ఉన్నతంగా ఎదగాలని ప్రభుత్వం సంకల్పించిందని మంత్రి పేర్కొన్నారు. ఖమ్మం నగరంలో ఇంకా 16 ప్రభుత్వ పాఠశాలలో పనులు కొనసాగుతున్నాయని, అతి త్వరలో వాటిని పూర్తి చేసి వినియోగంలోకి తెస్తామని ఆయన తెలిపారు. ఇప్పటికే నిర్దేశించిన పాఠశాలలు పూర్తయ్యాయని, అందులో విద్యార్థులు అద్భుతంగా విద్యను అందుకుంటున్నారని, తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలకు పంపిస్తున్నారని, ఇంగ్లీష్ విద్యను అందించడంతో తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారన్నారు. ఇటీవలి కాలంలో ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్ కోసం తనకు విజ్ఞప్తులు పెరుగుతున్నాయని, ఆయా తల్లిదండ్రులు తమ పిల్లలకు పాఠశాలలో అడ్మిషన్ కోసం అడిగినపుడు మనసుకు చాలా సంతోషంగా అనిపిస్తుందన్నారు.
దశల వారీగా డిజిటల్ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టి, విద్యార్థుల అభ్యసన సామర్థ్యాన్ని పెంచాలని ప్రభుత్వం భావిస్తోందని, దీనికోసమే మన ఊరు-మన బడి/మన బస్తి-మన బడి పథకాన్ని తీసుకొచ్చి అమలు చేస్తోందన్నారు. దశల వారీగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఆధునీకరణ, స్కూళ్లలో 12 రకాల మౌళిక సదుపాయల కల్పనకు పటిష్ట చర్యలు చేపట్టామని, గ్రామీణ ప్రాంతాలలో ఈ స్కీమ్‌ను మన ఊరు-మన బడి పేరుతో అమలు చేస్తుండగా, పట్టణ ప్రాంతాలలో మన బస్తి-మన బడి పేరుతో అమలు చేస్తున్నామన్నారు. ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చేందుకే తెలంగాణ ప్రభుత్వం విద్యావ్యవస్థ పై అత్యధికంగా నిధులు వెచ్చించిందన్నారు. తొలుత ప్రభుత్వ, స్థానిక సంస్థలకు చెందిన పాఠశాలలో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తోందని, ఆయా పాఠశాలలో నీటి సౌకర్యంతో పాటు టాయిలెట్లు, విద్యుద్దీకరణ, తాగునీటి సరఫరా, విద్యార్థులు, సిబ్బందికి సరిపడే ఫర్నీచర్ అందించడం, పాఠశాలలు మొత్తం నవీకరించడం, మరమ్మత్తులు చేయడం, కిచెన్లు ఏర్పాటు, డైనింగ్ హాళ్లు, శిథిలమైన గదుల స్థానంలో కొత్త క్లాస్ రూంలు ఏర్పాటు చేయడం, డిజిటల్ విద్య వంటి వాటిని అమలు చేస్తోందన్నారు. కార్యక్రమంలో జిల్లా ప్రజాపరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజ్ మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి మన ఊరు-మన బడి / మన బస్తీ- మన బడి కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. పట్టణ ప్రాంతాల్లో వైద్యానికి బస్తీ దవాఖానాలు ప్రారంభించినట్లు, విద్య, వైద్యం ప్రతి పేదవానికి ఉచితంగా అందాలని ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. నాణ్యతా ప్రమాణాలతో పనులు జరుగుతున్నట్లు ఆయన తెలిపారు.
కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… జిల్లాలో మొదటి విడతగా 426 పాఠశాలలను ఎంపిక చేసి అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. 50 శాతం పాఠశాలలు మార్చి నెలాఖరుకు పనులు పూర్తి చేస్తామన్నారు. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి వంద శాతం పాఠశాలలు అన్ని పనులు పూర్తి స్థాయిలో పూర్తిచేసుకుని పునః ప్రారంభానికి సిద్ధం చేయాలన్నారు. రాష్ట్రంలో మన ఊరు-మన బడి / మన బస్తీ-మన బడి కార్యక్రమం అమలులో ఖమ్మం జిల్లా ప్రథమ స్థానంలో ఉందన్నారు. విద్యా, సంక్షేమం, మౌళిక సదుపాయాల అభివృద్ధి సంస్థ చైర్మన్ శుక్రవారం జిల్లా పర్యటన సందర్భంగా జిల్లాలో మన ఊరు-మన బడి కార్యక్రమ అమలుపై సంతృప్తి చెందారని, ఇతర జిల్లాలు ఖమ్మం ప్రగతిని ఆదర్శంగా తీసుకోవాలని తెలిపారని అన్నారు. కార్యక్రమంలో నగర మేయర్ పునుకొల్లు నీరజ మాట్లాడుతూ… ప్రయివేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు అభివృద్ధి చెందుతున్నాయన్నారు. దీనికి ప్రచారం కల్పించి, పాఠశాలల్లో నమోదులు పెంచాలన్నారు. ఈ కార్యక్రమంలో సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్, ఖమ్మం మున్సిపల్ కమిషనర్ ఆదర్శ్ సురభి, స్థానిక కార్పొరేటర్ పగడాల శ్రీవిద్యా నాగరాజ్, జిల్లా విద్యాధికారి సోమశేఖర్ శర్మ, అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు ఉన్నారు.