Monday, November 18, 2024

ప్ర‌భుత్వ పెండ్లి ప‌థ‌కం పైసల కోసం.. సొంత చెల్లెలితోనే..

ప్రభుత్వ పథకం ద్వారా వచ్చే నగదు కోసం సొంత చెల్లిని పెళ్లి చేసుకున్న షాకింగ్ ఇన్సిడెంట్ ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో జ‌రిగింది. మూడు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. యూపీలోని సోషల్‌ వెల్ఫేర్‌ డిపార్ట్‌ మెంట్‌ ఆధ్వరంలో ముఖ్యమంత్రి సామూహిక వివాహ యోజన పథకం కింద ఇటీవల ఫిరోజాబాద్‌ తుండ్లలో అధికారులు సామూహిక వివాహాలు జరిపించారు. కార్యక్రమంలో మొత్తం 51 జంటలు వివాహ బంధంతో ఒక్కటయ్యాయి. పెళ్లి చేసుకున్న జంటలకు ఈ పథకం కింద రూ.35వేల నగదు, ఇంటికి సంబంధించిన కొన్ని వస్తువులను కానుకలుగా ప్రభుత్వం అందిస్తోంది. రూ.20వేల రూపాయలు పెళ్లి కూతురు పేరుతో బ్యాంక్‌లో డిపాజిట్‌ చేసి, మిగిలిన రూ. 15 వేలకు గాను కానుకలను ఇస్తోంది.

అయితే వీటి కోసం ఒక వ్యక్తి తన సొంత చెల్లిని పెళ్లి చేసుకున్నాడు. అందరిలానే చెల్లెలి మెడలో తాళికట్టి భార్యను చేసుకున్నాడు. అనంతరం ప్రభుత్వం ఇచ్చిన నగదు, ఇతర కానుకలను తీసుకున్నాడు. పెళ్లికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్‌ కావడంతో అన్నా చెల్లెలు అనే అసలు విషయం బయటపడింది. వివాహం చేసుకున్న వారిద్దరూ అన్నచెల్లెళ్లని గుర్తించిన గ్రామస్తులు అధికారులకు సమాచారమిచ్చారు.

అయితే అప్పటికే వారిద్దరూ పరారైనట్లు సమాచారం. దీంతో అప్రమత్తమైన అధికారులు వారిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకుంటామని తుండ్ల బ్లాక్‌ డెవలప్‌మెంట్‌ అధికారి నరేష్‌ కుమార్‌ తెలిపారు. వారి ఆచూకీ కనుగొని ప్రభుత్వ పథకం కింద అందించిన గ‌హౌపకరణాలు వెనక్కి తీసుకోనున్నట్లు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement