సంగం, ప్రభా న్యూస్: నెల్లూరు జిల్లాలో సర్కారు భూములను కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు అమ్మకానికి పెట్టారు. ఎకరా 2 లక్షల నుంచి 5 లక్షలకు మాత్రమే ధర పలుకుతోంది. తక్కువ ధర ఉండడంతో కొనడానికి చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అయితే ఈ తతంగం గురించి తెలిసినా రెవెన్యూశాఖ అధికారులు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
నెల్లూరు జిల్లాలోని సంఘం మండలంలో ప్రభుత్వ భూముల విక్రయాలు కొనసాగుతూనే ఉన్నాయి. అయినా సంబంధిత అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని విమర్శలు ఉన్నాయి. మండల పరిధిలోని మక్తాపురం గ్రామపంచాయతీ పరిధిలో సర్వే నంబర్ 123 బై 1 ప్రభుత్వ రెవెన్యూ భూమి 115 ఎకరాలు ఉంది. ఈ భూమిని కొంతమంది దళారులు అమ్మకాలు చేస్తున్నారు. లోకల్ గా రైతులు కొనుగోలు చేస్తే ఎకరాకి 2 లక్షల రూపాయలు మాత్రమే.. బయట వారు కొనాలంటే మాత్రం 5 లక్షల రూపాయలు ఎకరా పొలం లెక్కన రేటు నిర్ణయించారు.
ఈ భూమి పెన్నా పరివాహక ప్రాంతానికి చెందిన ప్రభుత్వ భూమి కావడం గమనార్హం. ఇటీవల ఈ భూమికి సంబంధించి దాన్ని చదును చేసి సాగుబడి కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. స్థానికంగా ఉండాల్సిన రెవెన్యూ వీఆర్వో అందుబాటులో లేకపోవడం.. ఈ ల్యాండ్ సేల్‌ని ఎవరూ పట్టించుకోకపోవడంతో ఇష్టమున్నట్టు అమ్ముకుంటున్నారు మధ్య దళారులు.