అసమానతలు, అభివృద్ధి ఆటంకాలను రూపుమాపుకుంటూ అప్రతిహత అభివృద్ధిలో పురోగమిస్తున్న తెలంగాణ రాష్ట్రం సరికొత్త తీరులో అడ్డంకులను అధిగమిస్తోంది. ఇప్పటికే జీవో 111పై నిపుణుల కమిటీతో అధ్యయనానికి ఆదేశించిన సీఎం కేసీఆర్ అతి త్వరలో అసైన్డ్ భూముల సమస్యల నివారణకు సాలోచనలు చేస్తున్నారని తెలిసింది. ఇందులో భాగంగా ఇతర రాష్ట్రాల విధానాల పరిశీలనతోపాటు, తెలంగాణ ప్రాంతానికి, ఇక్కడి పరిస్థితులకు అనుగుణంగా, నిజమైన పేదలకు లబ్ది చేకూర్చేలా విప్లవాత్మక నిర్ణయాన్ని ప్రకటించనున్నట్లు తెలిసింది.
హైదరాబాద్, ఆంధ్రప్రభ: ఇప్పటికిప్పుడే కాకపోయినా కొంత జాప్యమైనా నిర్ధిష్టంగా నిరుపేదలకు వరంగా ఈ భూములు ఉపయుక్తమయ్యే కీలక నిర్ణయం దిశగా అనేక రకాలుగా ప్రభుత్వం లోతైన అధ్యయనం చేస్తోంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా పేదలకు పంచిన అసైన్డ్ భూములపై ప్రభుత్వం కలెక్టర్లనుంచి నివేదికలను సేకరించింది. అసలు అర్హుల వద్ద ఉన్నదెంత.. ఇతరుల చేతుల్లో ఉన్నదెంత…నిర్దేశిత వ్యవసాయ అవసరాలకు కాకుండా ఇతర కమర్శియల్ వినియోగాలకు మారిందెంత వంటి అనేక రకాల సమాచారాన్ని సేకరించి సిద్దంగా పెట్టుకొన్నట్లుగా తెలిసింది. వీటన్నింటిపై నిపుణులు, సామాజిక వేత్తలు, ఇతర మేధావులతో చర్చించిన తర్వాత ఎలా చేస్తే పేదలకు భూమి నిజమైన సామాజిక హోదాను కల్పించనుందో పరిశీలించి ఆ దిశగా కార్యాచరణను ప్రకటించనున్నారని తెలిసింది.
రాష్ట్రంలో అసైన్డ్ భూముల లెక్కలు కొలిక్కి వచ్చాయి. కొత్త జిల్లాల వారీగా భూముల వివరాలను కలెక్టర్లు ప్రభుత్వానికి నివేదించారు. రాష్ట్రవ్యాప్తంగా 22,52,340.37 ఎకరాల అసైన్డ్ భూములు ఉన్నాయని, వీటిని 15,87,021 మంది అసైనీలకు ప్రభుత్వం కేటాయింపులు చేసింది. ఇందులో 18,96,898.75 ఎకరాల భూమి వ్యవసాయ యోగ్యంగా ఉండగా, మరో 3,55,441.62 ఎకరాల భూమి వ్యవసాయానికి అనుకూలంగా లేదని గుర్తించారు. అసిఫాబాద్ జిల్లాలో అత్యధికంగా 1.85లక్షల ఎకరాల అసైన్డ్ భూములు ఉన్నాయని, వీటిలో 1.78లక్షల ఎకరాల భూమి వ్యావసాయ యోగ్యంగా తేల్చారు. హైదరాబాద్ జిల్లాల్లో అత్యల్పంగా 291 ఎకరాల భూమి ఉండగా, ఒక్క ఎకరంలో కూడా వ్యవసాయ సాగులేదని ప్రభుత్వానికి అందిన నివేదికలో వెల్లడైంది. వ్యవసాయ యోగ్యం కాని భూములు ఎక్కువగా నల్గొండ జిల్లాలో 1.38లక్షల ఎకరాలున్నాయని, అందులో 1386 ఎకరాల్లోనే సాగు అవుతున్నదని నివేదించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మొత్తం కేటాయించిన భూమి అంతా సాగు భూమేనని గుర్తించారు.
పరాధీనమైన అసైన్డ్ భూముల క్రమబద్దీకరణకు ఆర్డినెన్స్ తేవడమా, మరో మార్గంలో ఆదాయానికి అనువుగా ఇతర విధానాలు అవలంభించడమా, లేదంటే పూర్తిగా రద్దు చేసి తిరిగి స్వాధీనం చేసుకోవడమా అనే విభిన్నమైన విధానాలను ప్రభుత్వం అధ్యయనం చేస్తోంది. 22.52 లక్షల ఎకరాల అసైన్డ్ భూములపై భూ దస్త్రాల పరిశీలనతో స్పష్టత వచ్చింది. ఇందులో 84,706ఎకరాల భూమి ఇతరుల చేతుల్లో ఉన్నట్లుగా నిర్ధారించిన సర్కార్ వాటిపై సమగ్ర వివరాలను సేకరించింది.
ఆక్రమణదారుల్లో బీపీఎల్ కుటుంబాలు, ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీ కులాలవారీగా లెక్కలు తీస్తూ వారి సామాజిక హోదాను తేల్చారు. 1,85,101 ఎకరాలతో అసిఫాబాద్ మొదటి స్థానంలో ఉండగా, భద్రాద్రి కొత్తగూడెంలో 1,66,557 ఎకరాలు, నల్గొండలో 1,38,686ఎకరాలు, కామారెడ్డిలో 1,33,157 ఎకరాల అసైన్డ్ భూములు ఉన్నాయని గుర్తించారు. అయితే బీసీ సామాజిక వర్గంలో 6లక్షల 33 వేల451 మందికి 8లక్షల 14వేల 8ఎకరాలు పంపిణీ అయినట్లుగా తేల్చారు. ఎస్సీలకు 5,75,497ఎకరాలు, ఎస్టీలు 6,72,959 ఎకరాలు, ఓసీలు 1,46,102 ఎకరాలు, మైనార్టీలకు 54565 ఎకరాలను పంపిణీ చేసినట్లుగా రికార్డులు ధృవీకరిస్తున్నాయి.
‘సీలింగ్ భూముల్లో…
ఇక సీలింగ్ భూములకు చెందిన అక్రమాల్లో ఇప్పటికిప్పుడు లక్షల కోట్ల రూపాయల విలువైన 5.9లక్షల ఎకరాల భూమిని స్వాధీనం చేసుకునేందుకు ఎలాంటి అవరోధాలు లేవని సర్కార్‌కు అందిన నివేదికలో వెల్లడైంది.
ప్రభుత్వ భూములివే….
రాష్ట్రంలో ప్రభుత్వ భూములన్ని కలుపుకుని 35.67 లక్షల ఎకరాలున్నాయని టాస్క్‌ఫోర్స్ కమిటీ ప్రభుత్వానికి అందజేసిన నివేదికలో పేర్కొంది. ఇందులో వ్యవసాయానికి యోగ్యం కానివి 13.8లక్షల ఎకరాలుగా ఉండగా, ఇక ప్రజోపయోగ అవసరాలకు కేటాయించిన 16288ఎకరాల భూములు ఆయా అవసరాలకు వినియోగించకుండా వృధాగా ఉందని కమిటీ గుర్తించింది. రంగారెడ్డి జిల్లాలో 10852 ఎకరాలు, మెదక్‌లో 2042 ఎకరాలు, హైదరాబాద్‌లో 189 ఎకరాలు ఉన్నాయి. ప్రస్తుతానికి రూ.7852 కోట్ల విలువైన 4752 ఎకరాల ప్రభుత్వ భూమి 3 ఉమ్మడి జిల్లాల్లోనే కేంద్రీకృతమై ఉందని తేలింది. రంగారెడ్డిలో 4767ఎకరాలు, నిజామాబాద్‌లో 339 ఎకరాలు, మెదక్‌లో 206ఎకరాలు ఉంది. ఇందులో సీలింగ్ మిగులు భూమి 3674 హెక్టార్లు ఉండగా 774 హెక్టార్ల భూమి ఖాళీగా ఉందని గుర్తించారు. మరోవైపు సుమారు 49వేల ఎకరాల భూదాన్ భూమి సరెండర్‌కు సిద్దంగా ఉందని నివేదికలో తేలింది.
50వేల ఎకరాలకుపైగా అసైన్డ్ భూములు ఉన్న జిల్లాలు
జిల్లా భూమి ఎకరాల్లో
ఆదిలాబాద్ 145192
కొత్తగూడెం 166558
భూపాలపల్లి 102672
కామారెడ్డి 133157
ఖమ్మం 53666
అసిఫాబాద్ 185054
మహబూబ్‌నగర్ 68131
మంచిర్యాల 77665
మెదక్ 121773
నాగర్‌కర్నూలు 76633
నల్గొండ 138686
నిజామాబాద్ 99386
రంగారెడ్డి 87064
సంగారెడ్డి 101575
సిద్దిపేట 126790
వికారాబాద్ 97376